.
నిన్న గుజరాత్ ఉపముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా జస్ట్, 40 ఏళ్ల చిన్న వయస్సులోనే నియుక్తుడైన హర్ష్ సంఘవి గురించి చెప్పుకున్నాం కదా… మరో పేరు కూడా చెప్పుకోవాలి… ఆమె పేరు రివాబా జడేజా…
ఆమె వయస్సు 34 ఏళ్లు… క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య… ఆమెను కూడా మంత్రివర్గంలో తీసుకున్నారు… చిన్న వయస్సులోనే మంత్రి పదవి… బీజేపీ తమ పూర్తి ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో క్రమేపీ ముసలోళ్లను పక్కకు తప్పిస్తూ, యువతరాన్ని కీలక స్థానాల్లోకి తీసుకొస్తోంది… ఈ ఇద్దరూ దానికి ఉదాహరణ…
Ads
సారీ, రెండు తెలుగు రాష్ట్రాల గురించి అడక్కండి ప్లీజ్… సరే, ఎవరు ఈ రివాబా జడేజా..? కొన్ని విశేషాలున్నాయి…
1. ప్రేమ బంధం, రాజకీయ అరంగేట్రం!
రాజ్‌కోట్‌కు చెందిన రివా సోలంకి రాజ్‌పుత్ ఫ్యామిలీ… మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్… రవీంద్ర జడేజా సోదరి నైనాతో ఈమెకు దోస్తానా… ఏదో పార్టీలో రవీంద్ర కూడా ఆమెకు నైనా ద్వారానే పరిచయం… తరువాత ప్రణయం… 2016లో పెళ్లి…
2. కర్ణిసేన గర్జన నుంచి కమలదళం దాకా…
రాజకీయాల్లోకి రావడానికి ముందు రివాబాకు ఒక బలమైన రాజ్‌పుత్ నేపథ్యం ఉంది… 2018లో కర్ణిసేన మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఆమె యాక్టివిటీ, ముఖ్యంగా ‘పద్మావత్’ చిత్రంపై జరిగిన నిరసనల ద్వారా ఆమె వార్తల్లోకి వచ్చింది… ఈ అడుగు ఆమె రాజకీయ ప్రయాణానికి తొలి మైలురాయి… సరిగ్గా 2019 మార్చిలో, ఆమె అధికారికంగా భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరింది, తన రాజకీయ ప్రస్థానం వేగం పుంజుకుంది…
3. ఎన్నికల మైదానంలో కుటుంబ ‘నాటకం’
రివాబా జీవితంలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు… బీజేపీ జామ్‌నగర్ నార్త్ స్థానం నుంచి ఆమెకు టికెట్ ఇవ్వడంతో అసలు నాటకం మొదలైంది… ఒకవైపు, ఆమె భర్త రవీంద్ర జడేజా ఆమె కోసం ఉద్వేగభరితంగా ప్రచారం చేశాడు… మరోవైపు, వారి ఇంట్లోనే రాజకీయ విభేదాలు బయటపడ్డాయి…
జడేజా సోదరి, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు అయిన నైనా జడేజా, జడేజా తండ్రి అనిరుద్ద్ సిన్హ్ జడేజా బహిరంగంగా ఆమె ప్రత్యర్థికి మద్దతు తెలుపుతూ ప్రచారం చేశారు… వాళ్లు కాంగ్రెస్ యాక్టివిస్టులు… కుటుంబ వ్యతిరేకత, రాజకీయ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, రివాబా అద్భుతమైన విజయం సాధించింది… దాదాపు 40,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి, శాసనసభలోకి అడుగుపెట్టింది…
- ఏ నైనా ద్వారా రవీంద్ర జడేజా భార్య అయ్యిందో… ఆ నైనా, ఆమె తండ్రి రివాబాకు ఇంట్లోనే ప్రత్యర్థులయ్యారు… విశేషం ఏమిటంటే… ఆమె తల్లిదండ్రులు, పుట్టిల్లు కూడా కాంగ్రెస్ పార్టీయే… తరువాత ఆమె ఆ అత్తింట్లో నుంచి బయటికి వచ్చేసి, రవీంద్ర జడేజాతో వేరే ఇంట్లోకి మారిపోయింది…
4. వేగవంతమైన ‘సిక్సర్’: మంత్రి పదవి
బీజేపీలో చేరిన నాటి నుండి (2019), ఎమ్మెల్యేగా గెలిచిన (2022) రివాబా పురోగతి అనూహ్యమైన వేగంతో సాగింది… తన నియోజకవర్గంలో చురుకుగా పాల్గొనడం, సుకన్య సమృద్ధి యోజన వంటి బాలికా సంక్షేమ కార్యక్రమాలలో చురుకుగా ఉండడం ద్వారా ఆమె హైకమాండ్ దృష్టిని ఆకర్షించింది… దీని ఫలితంగా, కేవలం 34 సంవత్సరాల చిన్న వయస్సులోనే, 2025లో గుజరాత్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి, తన రాజకీయ జీవితంలో అత్యంత వేగవంతమైన మైలురాయిని అధిగమించింది… అంటే, పార్టీలో చేరిన ఆరేళ్లలోనే సిక్సర్ కొట్టింది…
5. ధనిక నాయకురాలు… లక్ష్యం ప్రజా సేవ!
రివాబా జడేజా తన అఫిడవిట్‌లో సుమారు ₹100 కోట్ల కుటుంబ ఆస్తులను ప్రకటించింది… ఈ ధనిక నేపథ్యం ఆమెకు ఎటువంటి ఆర్థిక పరిమితులు లేకుండా రాజకీయాలు చేయడానికి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను (శ్రీ మాతృశక్తి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా) విస్తృతంగా చేపట్టడానికి అవకాశం కల్పించింది…
ఆమె మామ, అంటే రవీంద్ర జడేజా తండ్రి ఆమెపై చాలా ఆరోపణలు చేశాడు… తమ ఆస్తులన్నీ పెళ్లయిన మూడు నెలలకే తన పేరిట రాయాలని డిమాండ్ చేసిందనీ, ఇంటిని చీల్చి రవీంద్ర జడేజాతో వేరుకాపురం పెట్టించిందనీ ఎట్సెట్రా… రవీంద్ర జడేజా స్వయంగా అవన్నీ ఫేక్ అని ఖండించాడు… ఇప్పుడు ఆమె గుజరాత్ బీజేపీ కీలక నాయకగణంలో ఒకరు…!!
Share this Article