అదుగదుగో శ్రీలీలను తీసిపారేశారు… మలయాళం నుంచి మమిత బైజును తీసుకొస్తున్నారు… నో, నో, ఇప్పుడందరి దృష్టీ పూణె మోడల్ భాగ్యశ్రీ బోర్సే మీద ఉంది… ఆమెను మూడు నాలుగు సినిమాల్లో బుక్ చేసేశారు… ఇలాంటి వార్తలు బోలెడు… నిజాలెన్నో, గాసిప్స్ ఎన్నో…
సరే, యువతులు వస్తుంటారు, పోతుంటారు, నాలుగు రోజులు గిరాకీ ఉన్నన్నాళ్లు నిర్మాతలు వాడేసుకుంటారు, తరువాత మెజారిటీ తెరమరుగు… కొందరే నిలబడతారు… అదంతా కామన్… ఇప్పుడు మరో పేరు ప్రముఖంగా వినిపిస్తోంది… ఆమె పేరు రుక్మిణి వసంత్… కన్నడ యువతి… అప్పుడే విజయ్ దేవరకొండ, నాని సినిమాల్లో ఈమెను తీసుకుంటున్నట్టు కూడా రాసేస్తున్నారు… సరిగ్గా ఈ పాత్రలకే నిన్నటిదాకా మమిత, భాగ్యశ్రీ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి…
ఐతే ఇక్కడ చిన్న తేడా ఉంది… ఈమె ఏది పడితే అది అంగీకరించకుండా నిర్మాతల వరుస ఆఫర్లను తిరస్కరిస్తోందట… ప్రత్యేకించి తెలుగు సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు, పరిస్థితుల మీద ఏమాత్రం సదభిప్రాయం లేదట… గుడ్… అప్పుడే ఇద్దరు ముగ్గురు ఆమెకు కన్నడ సాయిపల్లవి అని పేరు కూడా పెట్టేశారు… మంచిదే, నిర్మాతలు చెప్పినట్టు, మరీ సగటు సౌతిండియా హీరోల కోరికలకు తలొంచే, దిక్కుమాలిన దేభ్యం పాత్రలకు తలూపే యువతి కాదు అంటే విశేషమే కదా… ఆ మాత్రం పొగరు చూపే యువతులు ఈ డర్టీ ఇండస్ట్రీలో కనిపిస్తే ఆనందమే కదా…
Ads
సదరు మమిత అండ్ భాగ్యశ్రీల పర్సనాలిటీయే ఈమె కూడా… అనుభవమూ తక్కువే… రుక్మిణి ప్రధానంగా కన్నడంలో వచ్చిన సప్తసాగరదాచె ఎల్లో సినిమాతో పాపులర్… (సప్తసాగరాలు పేరిట తెలుగులో కూడా వచ్చినట్టుంది ఈ సినిమా… ఇది రక్షిత్ శెట్టి సొంత సినిమా),.. ఆల్రెడీ ఒక హిందీ సినిమాలో నటించిన ఈమె చేతిలో ప్రస్తుతం రెండు తమిళ సినిమాలు కూడా ఉన్నాయి…
ఐతే ఆమె బయోగ్రఫీలో ఇంట్రస్టింగు కుటుంబ నేపథ్యం ఉంది… అదీ మనం చెప్పుకునేది… బెంగుళూరులో ఆమె పుట్టుక… కన్నడ కుటుంబమే… ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్… కర్నాటక నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అశోకచక్ర పురస్కార గ్రహీత ఆయన… తను జమ్ముకశ్మీర్, యురిలో భారీగా సాగుతున్న చొరబాట్లను నిరోధించే క్రమంలో 2007లో దేశం కోసం వీరమరణం పొందాడు… ఆమె తల్లి సుభాషిణి వసంత్… శిక్షణ పొందిన భరతనాట్యం డాన్సర్… యుద్ధవితంతువుల కోసం ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఉదాత్తమైన సేవలో ఉంది…
రుక్మిణి కూడా ఆర్మీ స్కూల్‌లో, ఎయిర్‌ఫోర్స్ స్కూల్‌లో చదువుకుంది… లండన్, రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్‌లో యాక్టింగులో డిగ్రీ పొందింది… నాలుగైదేళ్ల క్రితం కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెట్టింది… ఆమె ఏదైనా తెలుగు పాత్ర అంగీకరిస్తుందా..? క్లిక్కవుతుందా..? ఇవి కాదు ప్రశ్నలు… అది టైమ్ చెబుతుంది… కానీ నటనను చదువుకున్న ఆమె కుటుంబ నేపథ్యం, పిచ్చి పాత్రలను అంగీకరించవద్దనే ఆమె దృక్పథం బాగున్నట్టనిపించింది..!!
Share this Article