.
గత ఏప్రిల్ మూడో తేదీన వచ్చిన వార్తే… సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు ఆగ్రహం… కోర్టుకు హాజరవుతారా ? జైలుకు పంపమంటారా ? మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండాలంటూ ఆదేశాలు…
హైకోర్టు కోర్టు ఆర్డర్ ఇల్లీగల్ అంటూ బాధితురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేయించిన జిల్లా కలెక్టర్… తనకున్న అధికారాన్ని ఉపయోగించి బాధితురాలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించడాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం…
Ads
విషయం ఏమిటంటే..? తన ఇల్లు మిడ్ మానేరులో పోయిందని, ఆర్అండ్ఆర్ చట్టం ప్రకారం తనకు పునరావాసం కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన రాజన్నసిరిసిల్ల జిల్లా అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత అనే నిర్వాసితురాలు…
సుదీర్ఘ కాలం విచారణ అనంతరం కవితకు అర్అండ్ఆర్ ప్యాకేజి ప్రకారం పునరావాసం కల్పించాలని తీర్పునిచ్చిన న్యాయస్థానం… కోర్టు తీర్పు మేరకు తనకు పునరావాసం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరిన బాధితురాలు… కోర్టును తప్పుదోవ పట్టించి ఇల్లీగల్ ఆర్డర్ తీసుకొచ్చారన్న అభియోగంతో పిటిషనర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వేములవాడ ఆర్డీవోకు లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్…
కలెక్టర్ ఆదేశాలతో బాధితురాలు కవితపై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు… తనకు జరిగిన అన్యాయంపై తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కవిత… కోర్టు తీర్పును ధిక్కరించండమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి కేసు నమోదు చేయడంపై సీరియస్ అయిన హైకోర్టు…
కలెక్టర్‌ను కోర్టుకు అటెండ్ కావాలని ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి… ఉదయం కోర్ట్‌కు హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరైన కలెక్టర్, మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండకపోతే జైలుకు పంపుతామని ప్రభుత్వ తరపు న్యాయవాదికి చెప్పిన న్యాయమూర్తి…
మధ్యాహ్నం కోర్టుకు హాజరైన కలెక్టర్, 2 గంటల పాటు కోర్టులో నిల్చోపెట్టి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి… న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తప్పు అని ఎలా అంటారు, బాధితురాలిపై క్రిమినల్ కేసు ఎలా నమోదు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
అడిషనల్ అడ్వకేట్ జనరల్ తప్పు జరిగిందని అంగీకరిస్తుంటే కలెక్టర్ వేరే న్యాయవాదిని పెట్టుకుని వాదించడం ఏమిటి..?
కోర్టు ధిక్కరణ కింద జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ కలెక్టర్‌ను అడిగిన న్యాయస్థానం… తాము మాట్లాడిన మాటలు తప్పేనని ఒప్పుకొని బేషరతు క్షమాపణ కోరిన కలెక్టర్… క్షమాపణ చెప్పినా సరే ఓ బాధితురాలిపై కేసు నమోదు చేయించిన ఘటనలో చర్యలకి సిద్ధంగా ఉండాలన్న న్యాయస్థానం… కోర్టు సమయం ముగియడంతో విచారణ వాయిదా…
ఇదీ ఏప్రిల్ వార్త… ఇంత జరిగినా సారు మారలేదు… చివరకు కలెక్టర్ వస్త్రధారణ తీరు చూసి కూడా కోర్టు మండిపడింది… మిమ్మల్ని చూస్తే మాకే భయంగా ఉందని వ్యాఖ్యానించింది… కోర్టుకు వచ్చే పద్ధతి కూడా తెలియదా అని ప్రశ్నించింది…
నిన్నటి వార్త ఏమిటంటే..? ఆయన్ని పిలిచి తీవ్రంగా మందలించాలని చీఫ్ సెక్రెటరీని ఆదేశించింది… ఇంకా సర్వీసు ఉన్నందున ఆయన సర్వీసులో కొనసాగాలనే ఏకైక కారణంతో చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది… ఆల్ ఇండియా సర్వీసుకు సంబంధించి ఇది తీవ్రమైన మందలింపే…
హైకోర్టు ఆగ్రహం సహేతుకం… తను చెప్పిందే శాసనం, తను రాసిందే రాజ్యాంగం అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది..? ఈ ధోరణి అధికార పార్టీకే అప్రతిష్ట, మైనస్… ప్రత్యేకించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్‌కు ఈ కలెక్టర్ ధోరణి పెద్ద మైనస్ కాబోతోంది…
కానీ ఎవరు తనకు దన్ను..? చివరకు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కమ్ విప్ పట్ల కూడా ప్రోటోకాల్ వంటి వ్యవహారాల్లో తన ధోరణి మీద విమర్శలు వచ్చినా సరే, ఎవరి వల్ల తను ఇంకా అక్కడే కొనసాగుతున్నాడు..? కాంగ్రెస్ నేతల కక్షసాధింపు చర్యలకు అనుగుణంగా ఈ కలెక్టర్ కొంతకాలంగా తీసుకుంటున్న నిర్ణయాలపై బాగా విమర్శలు వస్తున్నాయి కూడా…
నిర్వాసితురాలు కోర్టుకెక్కితే క్రిమినల్ కేసు పెట్టించాడంటే తన ధోరణి ఇట్టే అర్థమవుతోంది కదా… కేటీయార్ ఫోటో ఉంటే టీ స్టాల్ మూసేస్తాడు, బీఆర్ఎస్ వాళ్లదనే భావనతో బార్ మూసేస్తారు… ఆమధ్య చిత్ర బార్ విషయంలో కూడా కోర్టు జిల్లా యంత్రాంగం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది… ఓ జర్నలిస్టు భార్య టీచర్‌ను ఎక్కడికో బదిలీ చేస్తారు… బోలెడు ఉదాహరణలు…
ఈ ధోరణి చూడబోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎక్కడో బాగానే ఇరికిస్తాడనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి… ఈ స్థితిలో ఫీల్డులో తనకు ఎలాంటి కలెక్టర్లు కావాలో సీఎం ఓసారి సీరియస్ లుక్ వేయడం బెటర్…
ఇవన్నీ చదువుతూ ఉంటే అసలు ఎవరు ఈ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అని చెక్ చేస్తే …? ఈయన స్వస్థలం బీహార్‌లోని దర్బంగా జిల్లా… 2014 బ్యాచ్ ఐఏఎస్… 70వ ర్యాంకు… తెలంగాణ కేడర్… తనకు 2021లో చత్తీస్‌గఢ్ కోర్బా జిల్లాకు చెందిన పల్లవితో పెళ్లయింది… రెండేళ్లకే భార్యాభర్తల నడుమ విభేదాలు…
ఈ వివరాలు చదువుతుంటే మరికొన్ని పాత వార్తలు కనిపించాయి… ఈయన అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడనీ, గృహహింసకు పాల్పడుతున్నాడనీ, అసహజ శృంగారానికి ఒత్తిడి చేస్తున్నాడని భార్య కోర్టుకు ఎక్కింది… కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులకు చెప్పింది… (ఇది 2023 జూన్ వార్త…)
అదే సంవత్సరం ఆగస్టులో ఈ సందీప్ కుమార్ ఝా హైదరాబాద్, బంజారా హిల్స్ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు… తన భార్య, పిల్లనిచ్చిన మామ, బావమరిది కలిసి తనను మానసిక, భౌతిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ ఫిర్యాదు… తన పేరిట ఉన్న ఆస్తులను వాళ్ల పేరిట రాయాలని, లేకపోతే కేసులు పెడతామని వేధిస్తున్నారని ఆ ఫిర్యాదు సారాంశం… పోలీసులు ఆ ముగ్గురిపై కేసులు పెట్టారు…
ఇప్పుడు కోర్బా, బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసుల పురోగతి ఏమిటో తెలియదు గానీ… రెండేళ్లుగా ఎప్పుడూ ఏదోరకంగా వార్తల్లో ఉంటున్నాడు ఈ కలెక్టర్…! సరే, తన వ్యక్తిగత వివాదాలు ఎలా ఉన్నా, ఆర్అండ్ఆర్ బాధితురాలి మీద క్రిమినల్ కేసు పెట్టించడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది… అవునూ, ఈ కలెక్టర్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ..?! జవాబు దొరకని ప్రశ్న..!!
- హెడింగులో అనురాగం అనే పదాన్ని వాడటానికి కారణం ఏమిటంటే..? హైకోర్టు మందలించాలని ఆదేశిస్తే… తనను అక్కడి నుంచి బదిలీ చేసి, ఏకంగా రోడ్లు, రవాణా శాఖ స్పెషల్ సెక్రెటరీగా పంపించారని తాజా వార్త..! ఇది మందలింపా..? ప్రోత్సాహకమా..?
Share this Article