.
ఒక సినిమా వివాదాల్ని రేకెత్తించి, తలనొప్పులు క్రియేట్ చేసినా… అడ్డంగా జనం తిరస్కరించినా… ఇంకే వైఫల్యం కనిపించినా సరే… ఫస్ట్ బాధ్యత వహించాల్సింది నిజానికి దర్శకుడే… కెప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి…
కానీ ఈరోజుల్లో ఫాఫం రాజమౌళి వంటి ఒకరిద్దరు దర్శకుల్ని మినహాయిస్తే… అంతా హీరోలు చెప్పినట్టే కదా నడవాల్సింది… ఒక్క కథేమిటి..? హీరోయిన్లు ఎవరో, ఐటమ్ డాన్సర్ ఎవరో, ఎవడు పాటలు రాయాలో, ఎవడు స్టెప్పులు కంపోజ్ చేయాలో దగ్గర నుంచి పాటల ఎంపిక, పాటల రచయిత, గాయకులు, చివరకు ఏ పాత్రకు ఎవరో… సెట్‌లో ప్రొడక్షన్ బాయ్స్ ఎవరో కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారు…
Ads
హీారోల కాళ్ల దగ్గర పాకుతోంది ప్రతి భాషా ఇండస్ట్రీ… సో, తలనొప్పులు క్రియేటయితే మరి ఎవరు బాధ్యత వహించాలి..? ఎవరో ఒకరు బకరా కావాలి కదా… అందుకని అన్నింట్లో జోక్యం చేసుకుని, సినిమా చీదేస్తే మాత్రం హీరోలు కూడా దర్శకుల్నే నిందిస్తున్నారు… మన తెలుగు మెగా, సూపర్, బంపర్ స్టార్లు కూడా..! ఇప్పుడు ఇదే ప్రశ్న మలయాళ ఇండస్ట్రీలో చర్చను రేకెత్తిస్తోంది…
మోహన్‌లాల్ వంటి సూపర్ స్టార్ నటించే భారీ సినిమా అంటే… మలయాళంలో భారీ సినిమాలు అత్యంత అరుదు కాబట్టి… చాలా జాగ్రత్తలు అవసరం… మొన్న ఏకంగా లూసిఫర్ సీక్వెన్స్ ఎంపురాన్‌లో 17 సీన్లు కత్తిరించి, విలన్ పేరు మార్చి, ఏకంగా మోహన్‌లాల్ ప్రేక్షకులకు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది… ఖచ్చితంగా తలదించుకునే విషయమే…
ఐతే అందరూ దర్శకుడు పృథ్విరాజ్ సుకుమార్‌ను, రచయిత మురళి గోపిని నిందించారు… ఈ పరిణామాలకు టీమ్ మొత్తం షాక్ తిన్నది… కానీ ఎవరో ఒకరు బకరా కావల్సిందే… కాకపోతే పృథ్విరాజ్ కూడా తక్కువేమీ కాదు, సినిమాకు దర్శకుడు, నటుడు కూడా… ఎటొచ్చీ రచయిత మురళి గోపిని నమ్మారు అందరూ… వివాదం రేకెత్తాక కూడా అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పుకున్నాడు తను…
మరోవైపు పృథ్విరాజ్ తల్లి తన కొడుకును అనవసరంగా బలిపశువును చేస్తున్నాడంటూ మోహన్‌లాల్ మీద నిందలు వేసింది… వెరసి టీమ్ ఇప్పుడు చెల్లాచెదురైనట్టే… మోహన్‌లాల్ ఇప్పట్లో ఆ రచయితను దగ్గరకు రానివ్వడు, ఎస్, ఈ ఎంపురాన్ సీక్వెల్, అంటే లూసిఫర్-3 ఇక లేనట్టే లెక్క… ఒకసారి మనస్పర్థలు వచ్చాక మళ్లీ టీమ్‌గా జట్టుకట్టడం కష్టం…
నిజానికి టీమ్ లీడర్‌గా పృథ్వీరాజ్ ఎంత బాధ్యుడో… ఒకటికి నాలుగుసార్లు తన సినిమా ఏ గతిన పోతుందో చూసుకోవల్సిన మోహన్‌లాల్ కూడా బాధ్యుడే… గెలుపు, సక్సెస్ క్రెడిట్ తీసుకునేవాడు తప్పులకూ తల వంచాల్సిందే… కాకపోతే ఈ మొత్తం వివాదంలో మురళి గోపి బాధ్యతారాహిత్యమే ప్రధానం… బలవంతంగా కథలో కొన్ని సీన్లు కావాలని ఇరికించాడు తన భావజాలం కొద్దీ… అది ఎదురుతన్నింది… అదీ సంగతి…
నో నో, మోహన్‌లాల్ స్క్రిప్టులో వేలు పెట్టడు, టీమ్‌ను నమ్ముతాడు అని తన పర్సనల్ టీమ్ చెబుతోంది… కానీ ఈ రోజుల్లో అది కుదరదు… తెలుగు సినిమాల విషయానికి వస్తే… పుష్ప-2 అనుకున్నట్టు రావడం లేదని, బోలెడు అదనపు వ్యయంతో హీరో అల్లు అర్జున్ అనేక సీన్లను రీషూట్ చేయించాడు, నెలలకొద్దీ లేటు…
ఏవైనా వివాదాలొస్తే సుకుమార్‌ను నిందించేవారా..? తననే బకరాను చేసేవారో కాదో తెలియదు గానీ… అంతా సాఫీగా జరిగి, బంపర్ హిట్ కొట్టి సుకుమార్ బతికిపోయాడు… లేకపోతే మరో పృథ్విరాజ్ సుకుమారన్ అయ్యేవాడేమో..!!
Share this Article