.
ఆర్ఎస్ఎస్ సారథి మోహన్ భగవత్‌కూ బీజేపీ సారథి మోడీకి నడుమ చాలాకాలం అగాధం కొనసాగడం అందరికీ తెలిసిందే… మోడీ మీద భగవత్ పలుసార్లు పరోక్షంగా పంచులు కూడా వేశాడు, 75 ఏళ్ల వయో పరిమితి వంటివి కూడా…
మొత్తానికి సంధి కుదిరినట్టుంది… కొన్నాళ్లుగా మళ్లీ ఆర్ఎస్ఎస్ పట్టు పెరిగింది పార్టీపై, ప్రభుత్వంపై..! ఆమధ్య రాజ్యసభ నామినేటెడ్ సభ్యత్వాలు, గవర్నర్ల ఎంపికల్లోనూ అది కనిపించింది…
Ads
కారణాలు ఏవైతేనేం… ఉపరాష్ట్రపతి పదవి నుంచి జగదీప్ ధన్‌ఖడ్‌ను రాజీనామా చేయించి మరీ, రాత్రికిరాత్రే ఇంటికి పంపించేశాడు మోడీ… ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఏకంగా ఓ ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌ను తీసుకురాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఢిల్లీ సర్కిళ్లలో…
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలో మోడీ నివాసం – ఆర్ఎస్ఎస్ కొత్త బిల్డింగుల నడుమ తిరుగుతూ ఏవో కీలక ప్రతిపాదనల మీద మధ్యవర్తిత్వం చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి తెలుసు కదా…
ఇంతకీ ఉపరాష్ట్రపతి పోస్టుకు హఠాత్తుగా వినిపిస్తున్న ఆయన ఎవరూ అంటే..? శేషాద్రి రామానుజ చారి… తంజావూరు బ్రాహ్మణ మూలాలు… పుట్టింది ముంబైలో… నాలుగేళ్ల వయస్సు నుంచే సంఘ్ శాఖకు వెళ్లడం అలవాటున్న ఆయన ఎమర్జెన్సీ బాధితుడు, జైలుపాలయ్యాడు కూడా…
బీకామ్, ఎల్ఎల్‌బి, ఎంఏ, పీహెచ్‌డీ… చాన్నాళ్లు ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్‌కు ఎడిటర్… ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు తను… గతంలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో విదేశీ వ్యవహారాల సెల్ అధిపతి తను…
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP)లో పాలన సలహాదారుగా కూడా ఉన్నాడు… దక్షిణ సూడాన్‌లోని జుబాలో పనిచేస్తున్నాడు… ఇదీ తన నేపథ్యం..,
- ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ (INSS) డైరెక్టర్ (ఇంటర్నేషనల్ అఫైర్స్)…,
- ఫోరం ఫర్ స్ట్రాటజిక్ & సెక్యూరిటీ స్టడీస్ (FSSS) డైరెక్టర్…,
- ఫోరం ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ (FINS) సెక్రటరీ జనరల్…,
- అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం పరిశోధన- సమాచార వ్యవస్థల నాన్-అఫీషియో సభ్యుడు…
- క్రానికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఫర్ ఎడ్యుకేషన్ & అకడమిక్ రీసెర్చ్ (CSIEAR) డైరెక్టర్…
- వినియోగదారులు- పెట్టుబడిదారుల రక్షణ సొసైటీ ఉపాధ్యక్షుడు కూడా…
మోడీ ఆర్ఎస్ఎస్ సూచించే ఈ పేరుకు ఆమోదముద్ర వేస్తాడా..? ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ముందుకు తీసుకొస్తున్నాడా తెలియదు గానీ… ఏకపక్ష నిర్ణయం మాత్రం ఉండకపోవచ్చు…
ఎందుకంటే, ఎంపీల సంఖ్యాబలం రీత్యా బీజేపీకి ఎన్డీయే పక్షాల అభిప్రాయం, సమ్మతి కూడా అవసరం అవుతుంది… బహుశా ఈ విషయంలోనే… పలు పార్టీలతో సత్సంబంధాలున్న వెంకయ్య నాయుడు, ఇతర సీనియర్ నేతల సేవలు తీసుకుంటున్నారేమో..?!
Share this Article