ఉద్యమ పార్టీ… ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలకు చిరునామాగా నిలిచి, పోరాటంలో నిలిచి, తరువాత ఫక్తు రాజకీయ పార్టీగా మారి, పదవుల కోసం పాకులాడి… అవినీతి అక్రమాలకు పేరుపడి… ఓ కుటుంబసభ్యుడు అవినీతి కేసుల్లో జైలుపాలై… పార్టీ మనుగడే ప్రశ్నార్థకమైంది..! హబ్బా… కేసీయార్ పార్టీ గురించి కాదండీ బాబూ… శిబూ సోరెన్ కుటుంబ పార్టీ గురించి..!
జార్ఖండ్ ముక్తి మోర్చా… ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడింది… పోరాడింది… తరువాత కేసీయార్ పార్టీలాగే మారిపోయింది అది వేరే సంగతి… ఏపీ, తెలంగాణను కాంగ్రెస్ అత్యంత అపరిపక్వ ధోరణితో విడదీసింది గానీ జార్ఖండ్‌ను బీజేపీ సాఫీగా విడదీసింది అప్పట్లో… ఆ ఉద్యమనేతకు (జార్ఖండ్ బాపు, జార్ఖండ్ జాతిపిత, జార్ఖండ్ తొలి ముఖ్యమంత్రి అనే డొల్ల నామధేయాలతో ఆయన్ని ఎవరూ పిలవరు…) ముగ్గురు కొడుకులు, ఓ బిడ్డ…
Ads
ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన పెద్ద కొడుకు దుర్గా సోరెన్ 39 ఏళ్లకే మరణించాడు… ఆయన భార్య పేరే సీతా సోరెన్… దుర్గా సోరెన్ తరువాత హేమంత్ సోరెన్… మొన్నటిదాకా సీఎం, ఇప్పుడు జైలులో ఖైదీ… మరో కొడుకు బసంత్… జేఎంఎం యువమోర్చా అధ్యక్షుడు… నిజానికి దుర్గా సోరెన్ బతికి ఉంటే జార్ఖండ్ రాజకీయాలు వేరేగా ఉండేవి…
శిబూ సోరెన్ రకరకాల కేసులు ఎదుర్కొన్నాడు, ప్రస్తుతం 80 ఏళ్లు… తన మాటేమీ సాగదు పార్టీలో… హేమంత్ తన వారసత్వ పగ్గాలు తీసుకున్నప్పుడు, పార్టీ తన ఆధీనంలోకి వచ్చినప్పుడు దుర్గా సోరెన్ భార్య, అంటే హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్‌లో తీవ్ర నిరాశ… భర్త మరణం తరువాత ఆ పార్టీ పగ్గాలు తన చేతుల్లోకి వస్తాయని ఆశించింది… ఆమె యాక్టివ్ పొలిటిషియన్… మూడుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి రాజ్యసభ సభ్యురాలు…
హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయ్యాక సీతా సోరెన్ సొంత పార్టీలోనే రెబల్‌గా మారింది… హేమంత్ అవినీతి అక్రమాల మీద తరచూ మామకు (గురూజీ బాబా) ఫిర్యాదులు చేసేది… గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేసింది… ఆమెకు పార్టీలోనే ఓ సపరేట్ గ్రూపు… కొందరు ఎమ్మెల్యేలు కూడా ఆమెతో ఉన్నారు… ఆమెకు ముగ్గురు బిడ్డలు… రాజశ్రీ, జయశ్రీ, విజయశ్రీ.., ఇద్దరు బిడ్డలు తండ్రి పేరిట దుర్గా సోరెన్ సేన ఏర్పాటు చేశారు… దాని లక్ష్యం అవినీతి, అక్రమాలకు వ్యతిరేక పోరాటం… పరోక్షంగా బాబాయ్ హేమంత్ సోరెన్ గ్రూపు మీదే..!
హేమంత్ సోరెన్ జైలుపాలయ్యాక ఆయన భార్య, అంటే సీతా సోరెన్ తోడికోడలు కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రి కుర్చీలో రబ్దీదేవిలా కూర్చోబెడతారనీ, జైలు నుంచే హేమంత్ పాలిస్తాడనీ అనుకున్నారు… కానీ సీతా సోరెన్ తను సీఎం కావాలనుకుంది… శృతి కుదరలేదు సహజంగానే… ఒక్కసారి పార్టీ, ప్రభుత్వం ఆమె చేతుల్లోకి వెళ్తే అంతే సంగతులు… సో, తమ కుటుంబానికి వీరవిధేయుడు అనుకున్న చంపయ్ సోరెన్‌కు సీఎం చాన్సిచ్చాడు… మిత్రపక్షాలూ సరేనన్నాయి…
మొన్న సుప్రీంకోర్టు ఓ క్లారిటీ ఇచ్చింది కదా… వోట్లకు అవినీతికిపాల్పడే ప్రజాప్రతినిధులూ శిక్షార్హులే అని… ఈ సీతా సోరెన్ ఓ స్వతంత్రుడికి డబ్బు తీసుకుని మద్దతునిచ్చిందనే కేసు పెండింగులో ఉంది, అది విచారణకు రానుంది… ఇక హేమంత్ తనను పార్టీలో ఎదగనివ్వడనీ అర్థమైంది… దాంతో జేఎంఎంకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వెంటనే బీజేపీలో చేరిపోయింది…
ఇది బీజేపీకి బూస్టప్… అంతేకాదు, కాంగ్రెస్, జేఎంఎంకు పెద్ద దెబ్బ… పరిస్థితులు ఇలాగే ఉంటే, పలచబడిన పార్టీ పరువు, హేమంత్ జైలు, ఆర్గనైజ్ చేసేవాళ్లు లేక… కుటుంబమూ చీలిపోయి… జేఎంఎం మనుగడే కష్టం… క్రమేపీ ఆ రాష్ట్రంలో బీజేపీ ఇంకా బలపడి, చేజిక్కించుకోనుంది… ‘14 ఏళ్లుగా పార్టీ కోసం వర్క్ చేస్తుంటే, నన్ను కించపరుస్తున్నారు, నాకు గౌరవం లేదు, నాకూ నా బిడ్డలకూ వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు… పార్టీ వీడక తప్పడం లేదు’ అంటోంది సీతా సోరెన్…
‘శిబూ సోరెన్ ఆశయాలు, ప్రజలు కోరుకునే జల్, జంగల్, జమీన్ ఆశలూ నెరవేరడం లేదు… ఎటుచూసినా సహజ వనరుల దోపిడీ… ఇంకెన్నాళ్లు..?’ అని ప్రశ్నిస్తోంది సీతా సోరెన్… ఆమె అలాగే ఎమ్మెల్యేగా ఉంటే, బీజేపీ సపోర్ట్, చీలిక రాయబేరాలతో ఆమెను మరో షిండేలా సీఎం కుర్చీపై కూర్చోబెడుతుంది బీజేపీ అనుకున్నారు అందరూ… కానీ కథ వేరే రూట్‌లో పోతోంది…!! ఎలాంటి ఉద్యమ పార్టీ చివరకు అవినీతి ఊబిలో కూరుకుపోయిన కుటుంబ పార్టీగా చివరకు ఏ తీరాలకు చేరుతున్నదో కదా… హబ్బా… ఈ కథ శిబూ సోరెన్ కుటుంబం గురించే..!!
Share this Article