.
పలు విశ్లేషణలు చూస్తుంటే నిన్నటి సుప్రీం కోర్టు తీర్పు మీద ఆశ్చర్యం కలుగుతోంది… అనేక సందేహాలూ వ్యక్తమవుతున్నాయి… మోడీ సర్కారు చేతకానితనమూ కనిపిస్తున్నదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి…
కొందరు ల్యాండ్ మార్క్ తీర్పు అని మెచ్చుకుంటున్నారు… అదేసమయంలో సుప్రీంకోర్టు ఓ గీత దాటిందనే విమర్శలూ వస్తున్నాయి… స్థూలంగా మోడీ వైపే అందరి వేళ్లూ చూపిస్తున్నాయి… ఎందుకంటే..?
Ads
కొలీజియం… తన నియామకాలు, తన పదోన్నతులు, తన బదిలీలు అన్నీ సుప్రీంకోర్టు కొలీజియమే చూసుకుంటుంది… చివరకు జడ్జిల మీద ఆరోపణలు వచ్చినా సరే సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల్ని ఎంటర్ కానివ్వడం లేదు… ఇది స్వయంప్రతిపత్తి దాటిన వ్యవహారం అనుకోవాలా..?
కొలీజియం స్థానంలో నేషనల్ జుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు ప్రతిపాదించిన బిల్లును సుప్రీంకోర్టు అడ్డంగా కొట్టేసింది… మోడీ కిక్కుమనలేదు, ఈరోజుకూ కొలీజియమే సుప్రీం… చివరకు ఓ హైకోర్టు జడ్జి ఇంట్లో వందల కోట్ల కరెన్సీ కట్టలు కనిపించినా కేంద్రం కిక్కుమనకూడదు…
ఇప్పుడు సుప్రీంకోర్టు ఏకంగా రాష్ట్రపతికే ఆంక్షలు పెడుతోంది… అదేమంటే రాజ్యాంగం అదే చెబుతున్నది అంటోంది… కాదు, రాజ్యాంగం అలా చెప్పలేదు… పైగా మన దేశంలోని కీలకమైన వ్యవస్థలపై చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టింది… ప్రతి కీలక వ్యవస్థ తమ గౌరవాన్ని కాపాడుకుంటూనే ఇతర వ్యవస్థలను గౌరవించాలి…
ఒకరి అధికార పరిధుల్లోకి మరొకరు వెళ్లకూడదు… డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సారథ్యంలో రచించబడిన మన రాజ్యాంగం అత్యున్నత ప్రమాణాల్ని నిర్దేశించింది అలా… కానీ సుప్రీంకోర్టు ఈ నడుమ తాను సుప్రీం అన్నట్టు వ్యవహరిస్తుండటమే ఆశ్చర్యకరం…
ఎక్కడో చదివాను… రాష్ట్రపతికీ ఆంక్షలు, పరిమితులు, షరతులు పెడుతున్న తాజా తీర్పులో అమెరికా, పాకిస్థాన్ రాజ్యాంగాలను ఉదహరించిందట… మరీ పాకిస్థాన్ రాజ్యాంగాన్ని…!!!
పైగా రాష్ట్రపతికి వీటో అధికారం లేదని చెబుతోంది సుప్రీంకోర్టు… మన వ్యవస్థలో అల్టిమేట్ రాజ్యాంగపదవి రాష్ట్రపతే… చివరకు ఈ సుప్రీం జడ్జిల ప్రమాణ స్వీకారం చేయించేదీ రాష్ట్రపతే… సరే, సపోజ్, సుప్రీం ఏదో చెప్పింది, మునుపెన్నడూ లేని రీతిలో గవర్నర్, రాష్ట్రపతి ప్రమేయం లేకుండా తమిళనాడు బిల్లులు ఆమోదం పొందాయి…
కానీ వాటికి స్క్రూటినీ ఏది…? రేప్పొద్దున ఏ రాష్ట్రమైనా అలా బిల్లుల్ని 3 నెలలు దాటగానే గెజిట్ నోటిఫై చేసేసి, అమల్లోకి తెచ్చుకోవచ్చా..? అది అస్తవ్యవస్థకు దారితీయదా..? లేక సుప్రీం ఓ కొత్త రాజ్యాంగాన్ని రాస్తున్నదా..?
ఎస్… తమిళనాడు, బెంగాల్, కేరళ ఎట్సెట్రా చాలా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల చేష్టలు వివాదాల్ని క్రియేట్ చేస్తున్నాయి… ఈ కోణంలో హోం మంత్రి అమిత్ షా ఫెయిల్యూర్ స్పష్టం… వ్యవస్థల నడుమ ఘర్షణను నివారించాల్సిన శాఖ తనదే…
ఇప్పుడిది ఏకంగా సుప్రీం కోర్టే తనే సుప్రీం అని చెప్పుకునేదాకా దారితీసింది… పోనీ, నేషనల్ జుడిషియల్ కమిషన్, జడ్జిల అవినీతి వంటి వ్యవహారాల్లో ప్రజలు వోట్లేసి గెలిపించిన పార్లమెంటే సుప్రీం అని నిరూపించుకునే అడుగులు ఏమైనా వేసిందా మోడీ సర్కారు..? నిల్..!
రాజ్యాంగంలో As Early As Possible అని రాసి ఉంటే… అది 3 నెలలు అని సుప్రీం బాష్యం చెప్పడం ఏమిటో న్యాయనిపుణులే చెప్పాలి… ఓ నిర్ణీత కాలవ్యవధి అవసరం, ఈమేరకు చట్టాల్లో సవరణలు చేయాలని సుప్రీం సూచిస్తే బాగుండేది… కానీ మొత్తం సిస్టమ్‌ను తన చేతుల్లోకి తీసుకుంది…
ఓ మిత్రుడు అడిగాడు… సరే, ఒకవేళ కావాలని ఓ బిల్లును రాష్ట్రపతే 3 నెలలు దాటి ఆపేసింది, సదరు రాష్ట్రం సుప్రీంను ఆశ్రయించింది… రాష్ట్రపతిపై సుప్రీం ఏం యాక్షన్ తీసుకోవాలి..? ఆ బిల్లు డీమ్డ్ టు బి క్లియర్డ్ అని భావించాలా..? మరిక గవర్నర్లు, రాష్ట్రపతి పోస్టులు దేనికి..? మేమే సుప్రీం అనే ఈ ధోరణిలో పార్లమెంటు అధికారాల పరిధి ఏమిటి…?
రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదాలు లేకుండానే తమిళనాడు ప్రభుత్వం మొత్తం 10 చట్టాలని గెజిట్ నోటిఫై చేసింది! భారత దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి… సుప్రీంకోర్టు తీర్పు నిజంగానే మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టు… అప్పుడే అయిపోలేదు… వక్ఫ్ చట్టం విచారణకు రాబోతున్నది త్వరలో… కథ పాకాన పడబోతున్నదా..?!
Share this Article