భారతదేశ ఎయిర్ ఫోర్స్ చరిత్రలో మొదటిసారిగా ఒక మహిళ వెపన్ సిస్టమ్ ఆపరేటర్ గా నియమితురాలు అయ్యింది ! WSO [Weapon System Operator] లేదా ముద్దుగా విజ్జో [WIJJOs]గా పిలుస్తారు. మొదటిసారిగా ఒక మహిళా ఆఫీసర్ ఈ ఘనత సాధించింది. ఫ్లయిట్ లెఫ్టినెంట్ Tejaswi Ranga Rao [తేజస్వి రంగారావ్ ] ఆమె పేరు…. ప్రస్తుతం లదాఖ్ దగ్గర మోహరించిన Su-30 MKI స్క్వాడ్రన్ లో జాయిన్ అయ్యింది. ఇంతకీ ఈ విశిష్టత ఏమిటంటే..?
వెపన్ సిస్టమ్ ఆపరేటర్ అంటే ఏమిటి ?
వెల్ ! మల్టీ రోల్ ఫైటర్ జెట్ విమానాలలో రెండు సీట్లు తప్పనిసరిగా ఉంటాయి. ఉదా: Su-30MKI మరియు అమెరికన్ మల్టీ రోల్ జెట్ ఫైటర్ అయిన F-15 E Strike Eagle లు… ముందు సీట్లో ఆయా జెట్ ఫైటర్ పైలట్ కూర్చుని విమానాన్ని నడుపుతాడు. వెనక సీట్లో మాత్రం వెపన్ సిస్టమ్ ఆపరేటర్ కూర్చుంటాడు. యుద్ధ సమయంలో దాడి కోసం కాకుండా కేవలం సిచుయేషన్ ఎలా ఉందో పరిశీలించడానికి వెళ్లేటప్పుడు మాత్రం వెనక సీట్లో నావిగేటర్ కూర్చుంటాడు.
Ads
వెపన్ సిస్టమ్ ఆపరేటర్ పని చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఫైటర్ జెట్ కి అనుసంధానం అయి ఉన్న ఎలెక్ట్రానిక్ సెన్సార్లని గమనించడం, అదే సమయంలో పైలట్ కి సూచనలు ఇవ్వడం చేయాల్సి ఉంటుంది… టార్గెట్ ని డిటెక్ట్ చేసిన తరువాత మిసైల్ ని ప్రయోగించడం కూడా WSO చేయాల్సి ఉంటుంది. యుద్ధ సమయంలో అక్కడి పరిస్థితిని గ్రౌండ్ కంట్రోల్ కి వివరించడం కూడా WSO పని.
శత్రు భూభాగంలోకి ప్రవేశించాక సర్ఫేస్ to ఎయిర్ మిసైల్ ని ఎవరన్నా ప్రయోగించారా అన్న విషయాన్ని గమనిస్తూ పైలట్ తో పాటు గ్రౌండ్ కంట్రోల్ కి కూడా అప్డేట్స్ ఇస్తుండాలి. Su-30 MKI కి రాడార్ అప్రోచింగ్ వార్నింగ్ సిస్టమ్ లేదు కాబట్టి అన్ని వైపులా WSO చూస్తూ మిసైల్ అప్రోచ్ గురించి పైలట్ కి సమాచారం ఇస్తూ ఉండాలి. అవసరం అయితే చాఫ్స్ లేదా ఇతర కౌంటర్ మెజర్స్ ని ప్రయోగించాల్సి ఉంటుంది. సాధారణంగా WSO లకి బేసిక్ పైలట్ ట్రైనింగ్ కూడా ఇస్తారు అత్యవసర పరిస్థితుల్లో తన ఫైటర్ జెట్ ని తిరిగి స్థావరానికి చేర్చడానికి…
**********************
జెట్ ఫైటర్ నడపడానికి పైలట్ కి ఎలాంటి కఠోర శిక్షణ ఇస్తారో వెపన్ సిస్టమ్ ఆపరేటర్ కి కూడా కఠినమయిన శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయిన ప్రతి 10 మందిలో ఒక్కరు మాత్రమే చివరకి ఎంపిక అవుతారు. సిమ్యులేటర్ మీద నిజంగా యుద్ధ సమయంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో అచ్చం అలాంటి కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి వెపన్ సిస్టమ్ ఆపరేటర్ కి పరీక్ష పెడతారు.
ప్రతిసారి నూటికి నూరుపాళ్లు విమానాన్ని కాపాడుతూ పైలట్ తో పాటు గ్రౌండ్ కంట్రోల్ కి రిపోర్ట్ చేస్తూ అవసరం అయినప్పుడు ఎలెక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్ ని వాడుతూ తమని తాము రక్షించుకుంటూ ఎదురు దాడి చేసి సురక్షితంగా ఎయిర్ బేస్ కి తిరిగి రాగలగిన వాళ్ళనే తుది ఎంపిక చేస్తారు. అదే సమయంలో WSO ఆపరేటర్ బ్లడ్ ప్రెజర్ ఎలా ఉందో కూడా పరీక్షిస్తారు. వొత్తిడిలోనూ నిబ్బరంగా తనకి ఇచ్చిన బాధ్యతని 100% విజయవంతంగా పూర్తి చేయగలిన వాళ్ళనే సెలెక్షన్ చేసి బాధ్యత అప్పగిస్తారు.
అలాంటి కఠినమయిన శిక్షణ విజయవంతంగా పూర్తి చేసి ఫైనల్ సెలెక్షన్ అయి బాధ్యత తీసుకున్న మొదటి మహిళా WSO తేజస్వి రంగారావ్ !ఇప్పుడు నేరుగా లడక్ దగ్గర ఉన్న సుఖోయ్ 30 స్క్వాడ్రన్ లో విధులు నిర్వహించడానికి బయలుదేరింది. ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎలాంటి ఛాలెంజ్ ని అయినా సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది తేజస్వి !
భారతదేశపు ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి ఫ్రంట్ లైన్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ అయిన Sukhoy Su 30-MKI మీద పనిచేయాలనే ఆశ అందరికీ ఉంటుంది కానీ అర్హత మాత్రం అతి కొద్ది మందికే ఉంటుంది! తేజస్వి రంగారావ్ గారికి అభినందనలు తెలుపుదామా !
Share this Article