Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?

June 30, 2025 by M S R

.

Director Devi Prasad.C. ... అప్పట్లో మద్రాస్ స్టూడియోల్లో షూటింగ్స్ జరిగేటప్పుడు షాట్ గ్యాప్స్‌లో నటీనటులందరూ చెట్ల క్రింద కుర్చీలలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వుండేవారు. కొత్తగా వెళ్ళిన నాలాంటివారికి ఆ దృశ్యాలు కన్నులపండుగలా వుండేవి.

ఓరోజు వాహినీ స్టూడియోలో ఫ్లోర్ బైట కూర్చునివున్న సూపర్‌స్టార్ కృష్ణ గారు అసిస్టెంట్ తో “సుండలోడు” ఇంకా రాలేదా అంటుంటే “నాలుగవుతుంది కదా వచ్చేస్తాడు” అంటున్నారు గిరిబాబు గారు నవ్వుతూ.

Ads

అంతకుముందే ఓరోజు సంగీత దర్శకులు చక్రవర్తి గారు ఏ.వీ.యం. చెట్టియార్ బిల్డింగ్‌లోని తన కంపోజింగ్ రూమ్‌లో “రేయ్ “సుండలాయన” వచ్చాడేమో చూడు” అంటుంటే “సుండల్‌క్కారన్ పదినొన్ను మణిక్కు వరువార్ సార్” అని ఎవరో సమాధానం చెప్పగా విన్నాను.

విజయాగార్డెన్ రికార్డింగ్ ధియేటర్ దగ్గరా మ్యుజీషియన్స్ “సుండలాయన” గురించి మాట్లాడుకోవటం విన్నాను.
అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
అసలదేం పేరు విచిత్రంగా అనుకున్నాను.

అంతమంది నోట్లో తరచూ ఆ పేరు వినపడుతోంది కనుక ఆ వ్యక్తి ఎవరో ప్రముఖుడో లేదా ముఖ్యమైన వ్యక్తో అయ్యుంటాడనుకున్నాను.
కానీ ఓ రోజు….

.

.
ఏ.వీ.యం. స్టూడియోలో కృష్ణ గారు, గొల్లపూడి గారు, గిరిబాబు గారు మరికొందరు కూర్చుని మాట్లాడుకుంటుండగా  “సుండలోడు” వచ్చాడు అన్నారెవరో.
ఆ పక్కకు చూశాను.
తెల్ల చొక్కా తెల్లని పంచె ధరించిన ఓ వ్యక్తి సైకిల్ మీదొచ్చి ఆగాడు.
నుదుటిపైన తెల్లటి విభూతి, బొట్టు క్రింద పెద్ద కుంకుమబొట్టు పెట్టుకుని,ఉన్నాడతను.

సైకిల్ క్యారేజ్‌కి ఓ పక్క పెద్ద స్టీల్‌ క్యాన్ మరోపక్క పెద్ద గుడ్డ సంచీ కట్టేసి ఉన్నాయి. హ్యాండిల్‌కి మరో పెద్ద గుడ్డ సంచీ కట్టేసి వుంది.
ఆర్టిస్ట్‌ల అసిస్టెంట్స్ అతని దగ్గరికి వెళ్ళగానే సైకిల్ స్టాండ్‌ వేసి స్టీల్ క్యాన్ ఓపెన్ చేశాడు.
అందులో నిండా తాళింపు వేసిన శనగ గుగ్గిళ్ళున్నాయి. పెద్ద గుడ్డ సంచీ ఓపెన్ చేస్తే అందులో ఘుమఘుమలాడే నేతి బొబ్బట్లు దొంతరలుగా పేర్చి కనిపించాయి.

అప్పుడే ఎవరో చెప్పగా అర్ధమైంది “సుండలోడు”కి అర్ధం.
శనగ గుగ్గిళ్ళని తమిళంలో “సుండల్” అంటారట. (తెలుగులోనూ శొండెలు అంటారు పలుచోట్ల)
మరో సంచీలో నుండి అరిటాకులు తీసి ఓ గరిటెతో గుగ్గిళ్ళు ఓ రెండు బొబ్బట్లు వేసిస్తున్నాడతను. అతనికి డబ్బులిచ్చి వాటిని తీసుకొచ్చి ఆర్టిస్ట్‌లకిచ్చారు అసిస్టెంట్స్.

కృష్ణ గారితో సహా అందరూ వాటి రుచిని భలే ఆస్వాదిస్తూ తింటున్నారనిపించింది.
సహజంగా షూటింగ్‌లో మధ్య మధ్య శ్నాక్స్ లాంటివి ఇస్తూనే వుంటారు ప్రొడక్షన్‌ బోయ్స్.. వాటిని వదిలేసి గుగ్గిళ్ళు బొబ్బట్లు కోసం ఎదురుచూడటం ఆశ్చర్యంగా అనిపించేది నాకు. నేను కూడా రుచి చూశాక ఆ ఎదురుచూపులు సబబే అనిపించింది.

జూనియర్ ఆర్టిస్ట్‌లు అక్కడక్కడా చెట్ల క్రింద కూర్చొని అవి తింటూ కబుర్లు చెప్పుకోవటం తరచూ కనిపించే దృశ్యం ఆ రోజుల్లో.
ఓసారి వాహినీ స్టూడియోలో “అమితాబ్‌ బచ్చన్” గారు కూడా ఆ బొబ్బట్లు రుచి చూస్తుండగా నేను చూశాను.
ఆ రోజుల్లో వాహినీ, ఏ.వి.యం, విజయా గార్డెన్స్ ల్లో షూటింగులు, రికార్డింగ్‌లు చేసిన వారందరికీ ” సుండలాయన” సుపరిచితమే.

తినుబండారాలు అమ్మే ఎవరినీ లోపలికి అనుమతించేవారు కాదు.
ఎందుకో తెలియదు గానీ “సుండలోడు” ఒక్కడు మాత్రం దానికి మినహాయింపు. యధేచ్చగా తిరిగి అమ్ముకొనేవాడు.
ప్రొద్దున్న ఓ గంటన్నర, మధ్యాహ్నం ఓ గంటన్నర వచ్చి అమ్ముకుని వెళ్ళిపోయేవాడు. ఒక్కసారి కూడా గుప్పెడు గుగ్గిళ్ళు రెండు బొబ్బట్లు కూడా మిగిలిపోయి ఇంటికి వెళ్ళింది లేదట.

కొందరు అతనితో పాండీ బజార్‌లో షాప్ పెట్టిద్దామనుకున్నా ఒప్పుకోలేదట. తన తండ్రి నుండి 18 ఏళ్ళ వయసులో ఆ వ్యాపారం నేర్చుకున్నాననీ, ఆ స్టూడియోల్లో తప్ప మరెక్కడా అమ్మననీ తన సైకిల్ వదలననీ చెప్పేవాడట.
ఇప్పుడా సుండలాయన ఎక్కడ ఎలా ఉన్నాడో గానీ మా ఆవిడ నేతిబొబ్బట్లు చేసిన ప్రతిసారీ తప్పక గుర్తుకొస్తాడు…. ______ దేవీ ప్రసాద్.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…
  • నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!
  • కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
  • తెలంగాణ ప్రజల చెవుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబేజీ పూలు..!!
  • జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
  • పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
  • ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
  • ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions