.
నీటియుద్ధం చేస్తా… అసెంబ్లీకొచ్చి రేవంత్ రెడ్డిని కడిగేస్తా… పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై దుమ్ము రేపుతా… పాలమూరులో మీటింగు పెడతా… తోలు తీస్తా, చీరి చింతకు కడతా అంటున్నాడు కదా కేసీయార్…
అసలు ద్రోహం చేసిందే కేసీయార్ అని కాంగ్రెస్, బీజేపీలు కావు… లెఫ్ట్ పార్టీలకు ఏ సోయీ లేదు… సాక్షాత్తూ ఆయన బిడ్డే చెబుతోంది… పదేళ్ల పాలన తీరును దగ్గరుండి మరీ చూసిన ప్రత్యక్ష సాక్షి అసలు నిజాల్ని చెబుతూ… అసలు జలద్రోహి ఎవరో స్పష్టంగా చెబుతోంది తెలంగాణ ప్రజానీకానికి…!
Ads
ఆమె అటు కేసీఆర్‌పైన, ఇటు హరీశ్‌రావుపైనా నిప్పులు చెరిగింది… అదే ఉమ్మడి పాలమూరు గడ్డ మీద, నాగర్ కర్నూల్ వేదికగా కవిత చాలా చేదు చీకటి నిజాల్ని వెల్లడించింది… అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం పెద్దగా వేరే నిజాల్ని చెప్పనక్కర్లేదు, కవిత మాటల్ని, కేసీయార్ అండ్ టీమ్‌కు స్పష్టంగా ఓసారి వినిపిస్తే చాలు…
- ‘‘బేసిన్లు లేవ్… భేషజాల్లేవ్… అంటూ వైఎస్ జగన్‌తో దోస్తీ కారణంగా కేసీఆర్ అప్పట్లో జగన్ తెలంగాణ నీటి హక్కుల్ని కాజేసి, దోచుకుపోతున్నా మాట్లాడలేదు… ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, ఆ పార్టీకి చెందిన నేతలు గానీ అడ్డుకోలేదు… కోర్టుల్లో కేసులు వేయలేదు…

తెలంగాణ జాగృతి చొరవతో స్థానిక రైతులు కేసులు వేశారు.., దాంతో తప్పనిసరై ఎన్జీటీ ఆ ప్రాజెక్టు నిర్మాణానికి బ్రేకులు వేసింది… విధిలేక బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంప్లీడ్ కావాల్సి వచ్చింది… కేసీఆర్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడో పెద్ద మిస్టరీ…
కృష్ణా జలాల్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అన్యాయమే జరిగింది… అసలు యుద్ధం జరిగిందీ… నీళ్ళలో నిప్పు రవ్వలు వచ్చిందీ… నీటి హక్కుల కోసమే… కానీ పదేళ్లలో కృష్ణా ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో నీటి హక్కులనే కోల్పోతున్నాం, పదేండ్లలో జరిగింది అదే…

- పోతిరెడ్డిపాడుకు గతంలో 45 వేల క్యూసెక్కుల చొప్పన నీరు వెళ్తే, ఇప్పుడు అది 90 వేల క్యూసెక్కులకు పెరిగింది… రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును రోజుకు 3 టీఎంసీల చొప్పున తరలించేలా ప్లాన్ చేసినా తెలంగాణ నుంచి కనీసం ప్రతిఘటన లేదు… చివరకు 299 టీఎంసీలు చాలంటూ ఒప్పందంపై కేసీయార్ సంతకం చేయడం ఒక నష్టం కాగా… కృష్ణా ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో ఆ మేరకైనా నీటిని వాడుకోలేకపోవడం బీఆర్ఎస్ చేసిన తప్పిదం…
కాళేశ్వరం ప్రాజెక్టును ఉరుకులు, పరుగులు పెట్టించినట్లుగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలోనూ కేసీఆర్ వ్యవహరించలేదు… దీంతో వెనకబడిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగానికి అన్యాయం జరిగింది… ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో మనకు దక్కాల్సిన కృష్ణా జలాల్లో వాటాను కోల్పోయినట్లయింది… ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులు జరిగితే మనకు ఇప్పుడు నష్టమే జరుగుతుంది…
సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ హడావిడిగా వట్టెం రిజర్వాయర్‌కు అనుసంధానంగా ఉన్న పంప్‌హౌజ్‌లో ఒక మోటార్‌ను ఆన్ చేశాడు… కానీ ఆ నీటిని పారించేలా కాల్వల వ్యవస్థే లేదు… బీఆర్ఎస్ హయాంలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీరు పారినట్లు గులాబీ లీడర్లు గొప్పగా చెప్పుకుంటున్నా, వారు హామీ ఇచ్చిన 30 లక్షల ఎకరాల సంగతేంటి..?
అసలు డిండి ప్రాజెక్టుకు నీరు ఎక్కడి నుంచి తీసుకోవాలనే సోర్స్ విషయమే పదేండ్లయినా తేలలేదు… తెలంగాణకు జూరాల లైఫ్ లైన్, దీన్ని వదిలిపెట్టి పాలమూరు ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి వాటర్ సోర్స్ పెట్టుకోవడం తప్పు…
- పాలమూరు ప్రాజెక్టులో మొదటి పంప్ హౌజ్‌ను ఎల్లూరు దగ్గర తొలుత ఓపెన్ పంప్ హౌజ్‌గా నిర్మాణం చేయాలని భావించినా… చివరకు అండర్‌గ్రౌండ్ గా మార్చి, హరీశ్‌రావు కమిషన్ల కక్కుర్తితో కాంట్రాక్టర్‌తో లాలూచీ పడ్డాడు… కల్వకుర్తి ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం జరగొద్దని ఓపెన్ పంప్‌హౌజ్‌గా డిజైన్ చేసినా, చివరకు అండర్‌గ్రౌండ్‌గా మార్చడంతో కల్వకుర్తిలోని థర్డ్, ఫిఫ్త్ పంపులు డ్యామేజ్ అయ్యాయి…
దీంతో ఇప్పటికీ కల్వకుర్తిలో మూడు పంపులే పనిచేస్తున్నాయి… మోటార్లు రిపేర్ చేయడానికి కూడా అవకాశాల్లేవు… వీటికి మిషన్ భగీరధను లింక్ చేయడంతో ఒక్క రోజు రిపేర్ పనులు జరిగినా వందలాది గ్రామాలకు తాగడానికి నీటి సరఫరా ఆగిపోతుంది…’’ ఇలా కేసీయార్ పాలనలో కృష్ణాజలాల్లో తెలంగాణకు ఎంత ద్రోహం జరిగిందో సోదాహరణంగా చెబుతూ పోయింది కవిత… టు బి ఫ్రాంక్... ఆమె ఆరోపణలకు హరీష్ రావు గానీ,కేసీయార్ గానీ, కేటీయార్ గానీ జవాబులు చెప్పలేని నిజాలు అవి...

Share this Article

