.
ఈరోజు పత్రికల్లో చిన్నగా ఎక్కడో కనీకనిపించనట్లుగా ఉంది ఓ వార్త… ఒక లేడీ డాన్ మీద ప్రభుత్వం పీడీ యాక్ట్ పెడితే, ఆమె కోర్టుకెక్కితే… పీడీ యాక్ట్ సమర్థనీయమే, తప్పులేదు అని హైకోర్టు కొట్టేసింది ఆమె పిటిషన్‌ను… ఇదీ ఆ వార్త సారాంశం…
హైదరాబాదులో పెద్ద లేడీ డాన్ అట, ఇంతకీ ఎవరబ్బా ఆమె..? ఆరా తీస్తే పెద్ద చరిత్రే ఆమెది… పెద్ద గంజాయి నెట్‌వర్క్… ధూల్‌పేట అడ్డా… పేరు అంగూర్ బాయ్ (అలియాస్ అరుణ బాయ్)…
Ads
ధూల్‌పేట్ ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలలో కీలక వ్యక్తి… “గంజాయి డాన్” అని కూడా పిలుస్తారు… ఆమెపై ధూల్‌పేట్, మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్ వంటి ప్రాంతాలలో వివిధ ఎక్సైజ్, సివిల్ పోలీస్ స్టేషన్లలో అనేక (30 వరకు) గంజాయి అమ్మకాల కేసులు నమోదయ్యాయి… ఆమె గతంలో కూడా అనేక కేసులలో జైలు శిక్ష అనుభవించింది…
కుటుంబ నేపథ్యం…: ఆమె కుటుంబం మహారాష్ట్రకు చెందిన వలసదారులు… తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వీళ్లు గుడుంబా (నాటు సారా) వ్యాపారం చేసేవాళ్లు… 2014లో ఆ వ్యాపారం మూతపడిన తర్వాత గంజాయి హోల్‌సేల్, రిటైల్ వ్యాపారంలోకి దిగారు…
అరెస్టు, పీడీ యాక్ట్…: చాలా కాలం పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగిన అంగూర్ బాయ్‌ను 2024 డిసెంబర్‌లో ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు *ఆపరేషన్ ధూల్‌పేట్’లో భాగంగా అరెస్టు చేశారు…
ఎన్నిసార్లు అరెస్టు చేసినా బెయిల్‌పై బయటకు వచ్చి, మళ్లీ వ్యాపారం కొనసాగిస్తుండటంతో, పోలీసులు ఆమెపై పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్ట్‌ను అమలు చేయాలని ప్రతిపాదించారు.,, హైదరాబాద్ కలెక్టర్ ద్వారా 2025 ఏప్రిల్‌లో ఆమెపై పీడీ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి…
కోర్టులో చుక్కెదురు…: కలెక్టర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అంగూర్ బాయ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది… అయితే, 2025 అక్టోబర్‌లో ఆ పిటిషన్‌ను కొట్టివేసింది, ఆమెపై పీడీ యాక్ట్ కొనసాగించాల్సిన అవసరం ఉందని తీర్పు ఇచ్చింది…
అంగూర్ బాయ్ కుటుంబం మొత్తం గంజాయి వ్యాపారంలోనే మునిగి ఉంది… అంగూర్ బాయ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు 10 నుంచి 15 మందిపై కూడా గంజాయి దందాకు సంబంధించిన ఐదు నుంచి పది కేసులు వరకు నమోదై ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు…
వారు ఎన్నిసార్లు అరెస్టు అయినా, బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ అదే వ్యాపారాన్ని కొనసాగిస్తుండటంతో, ఎక్సైజ్ శాఖ అంగూర్ బాయ్‌పై పీడీ యాక్ట్‌ను ప్రతిపాదించింది…
అంగూర్ బాయ్ కుటుంబం గంజాయిని ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల నుండి తక్కువ ధరలకు సేకరించి, హైదరాబాద్‌లో అధిక ధరలకు విక్రయిస్తూ కోట్లాది రూపాయలు లాభాలు ఆర్జించింది… ఇది ఒక వ్యవస్థీకృత గంజాయి దందా… దీని వెనుక ఓ పెద్ద నెట్‌వర్క్, గాంజా సిండికేట్… వందల కోట్ల టర్నోవర్ అట…
విలాసవంతమైన జీవితం…: ఈ అక్రమ సంపాదనతో ఆమె హైదరాబాద్ శివార్లలో ఖరీదైన ఫామ్ హౌస్‌లు కలిగి ఉన్నట్లు, ఒకసారి ఏకంగా ₹20 లక్షల ఖర్చుతో పుట్టినరోజు పార్టీ కూడా నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి…
రక్షణ ఏర్పాట్లు…: పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఆమె ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు, కుక్కలతో గస్తీ, నలుగురు బౌన్సర్లు వంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకుంది… సిమ్ కార్డులు మార్చడం, తెలిసిన ఫోన్ వాడకపోవడం వంటి పద్ధతులతో టెక్నికల్ ఇంటెలిజెన్స్‌కు కూడా చిక్కకుండా తప్పించుకు తిరిగేది…
Share this Article