Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఐపీఎల్ క్రికెటర్లు..! ఓ అమ్మకపు సరుకు… బాధపడే అర్హత కూడా లేదు..!!

May 9, 2024 by M S R

లక్నో ఐపీఎల్ టీం అధినేత (లక్నో సూపర్ జెయింట్స్) సంజీవ్ గోయెంకా హైదరాబాద్ ఐపీఎల్ టీం మీద ఘోరంగా ఓడిపోయాక తమ టీంలోని క్రికెటర్ కేఎల్ రాహుల్ మీద అరిచాడు, కేకలేశాడు, బహిరంగంగానే తూలనాడాడు… అందరూ చూశారు… రోజంతా మీడియా, సోషల్ మీడియా దీన్నే చర్చించింది…

రాహుల్, అలా తిట్లు తింటావేమిట్రా, ఛల్, రిజైన్ చేయి, సిగ్గు లేదా, వెళ్లిపో అంటూ బోలెడు సలహాలు… తను ఆల్రెడీ ఒక ఒప్పందంలో బందీ అయ్యాడని తెలియదు పాపం… అలా వదిలి వెళ్లిపోతే ఇంకెవడూ తమ టీముల్లోకి తీసుకోడు… సరే, గోయెంకాకు క్రికెట్ ఆడటం రాదు, గేమ్ ప్లాన్ తెలియదు, పైగా తెర వెనుక సంప్రదింపులు, మందలింపులు, మార్పులు గట్రా ఉండాలి, కానీ బహిరంగంగా ఇలా దురుసుగా వ్యవహరించడం వాడి చిల్లరతనానికి తార్కాణం… కుసంస్కారం…

ఓ బలమైన వ్యాపార కంపెనీని లీడ్ చేస్తున్న వ్యక్తి నుంచి ఇలాంటి ప్రవర్తన ఆశ్చర్యమే… పైగా తమ గ్రూపు (RPSG) భిన్న రంగాల్లో వ్యాపారాల్ని నిర్వహిస్తూ ఉంటుంది… కోల్‌కత్తాలోని మార్వాడీ ఫ్యామిలీలో పుట్టిన ఆయన ఇండియా టాప్ 100 ధనికుల్లో 83వ వాడు… ఐపీఎల్ టీమే కాదు తనకు ఐఎస్ఎల్ ఫుట్ బాల్ టీం కూడా ఉంది… పేరు మోహన్ బగాన్ సూపర్ జెయింట్… ఐఐటీ ఖరగ్పూర్, పద్మ అవార్డుల కమిటీల్లోనూ మెంబర్… చాలా యాక్టివిటీ ఉంటుందిలెండి, మరి ఈ అదుపు తప్పిన ఆవేశం ఏమిటి..?

Ads

ఇక రియాలిటీలోకి వెళ్దాం… ఐపీఎల్ అనేది ఓ దందా… వినోద వ్యాపారం… వేల కోట్లు… జోరుగా బెట్టింగులు… ఐపీఎల్ టీముల్లో బాగా పేరుమోసిన, డబ్బుచేసిన వ్యాపారులు పెట్టుబడులు పెడతారు… ఎక్కడెక్కడి వాళ్లనో వేలంలో పాడుకుంటారు… అనగా కొనుక్కుంటారు… జస్ట్, పందెం కోళ్లు అవి… రేసు గుర్రాలు అవి… పోనీ, క్రికెట్ మార్కెట్‌లో కొనుక్కోబడిన సరుకు… అంత డబ్బు పోసి కొనుక్కున్న సరుకు సరిగ్గా లేకపోతే, గుర్రాలు పరుగెత్తకపోతే చిరాకెత్తదా..? తిట్టిపోశాడు… అమ్మడుబోయిన సరుక్కి బాధపడే అర్హత కూడా లేదు…

వీళ్లేమీ దేశం కోసం ఆడటం లేదు… ఆ ఎమోషన్ కూడా జనానికి అవసరం లేదిక్కడ… పోనీ, ఆటను ఆటగా చూడాలి అనే అంతిమ సత్యం కూడా ఈ పెట్టుబడిదారులకు ఉండదు, ఆశించలేం… అమ్ముడుపోయిన వాడు అసలే ఆ నీతులు చెప్పకూడదు… కాకపోతే వీళ్లను కొనుక్కున్న ఒక్కో ఓనర్ ఒక్కోరకంగా డీల్ చేస్తుంటాడు… సింపుల్… కోట్లు పెట్టిన రేసుగుర్రం ఆశించినట్టు పరుగెత్తకపోతే ఉన్మాదం ఆవరించిన క్షణంలో దాన్ని కాల్చిచంపిన వాళ్లూ ఉన్నారట… పందెం కోళ్లూ అంతే కదా, నిరాశపరిస్తే కసకసా… అంతే…

కోట్లు పెట్టిన ఓనర్లకు కూడా ఉద్వేగాలుంటాయి కదా మరి… హైదరాబాద్ టీం కావ్య పాప ప్రతి బంతికీ తన మొహంలో ఎన్నిరకాల భావాల్ని ప్రదర్శిస్తుందో అందరూ చూస్తున్నారు, రకరకాల మీమ్స్ ఆమె మీద… ఒక ఇండియా సిమెంట్స్ శ్రీనివాసనో, ఒక రిలయెన్స్ ముఖేష్ అంబానో నిండుగా, గంభీరంగా గమనిస్తూ ఉంటారు తప్ప, ఆటలో వేళ్లుకాళ్లు పెట్టరు… వాళ్లకు ఐపీఎల్ టీం కూడా ఓ కంపెనీ… అవసరమైనప్పుడు సమీక్ష, మార్పులు ఉంటాయి, అంతే…

అన్నట్టు ఈ ఆర్పీ సంజీవ్ గోయెంకా (ఆర్పీఎస్జీ) గ్రూపు ఎన్నిరకాల వ్యాపారాల్లో ఉందో తెలుసా..? పవర్ (ఉత్పత్తి, పంపిణీ), మైనింగ్ (కోల్), ఐటీ, మీడియా (మ్యూజిక్, న్యూస్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్), ఫుడ్, రిటెయిల్, ఆయుర్వేద ప్రొడక్ట్స్, మెడికల్, క్రీడలు (టేబుల్ టెన్నిస్, ఫుట్ బాల్, క్రికెట్), ప్లాంటేషన్స్… ఇలా చాలా చాలా… మరేమిటీ ఈ కుసంస్కారం అంటారా..? భలేవారే, డబ్బుకూ సంస్కారానికీ సంబంధం ఏముంది..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions