జైలర్ చూశారా..? అందులో ఇద్దరు హీరోలు అని చెప్పుకున్నాం కదా… ఒకరు రజినీకాంత్, మరొకరు సంగీత దర్శకుడు అనిరుధ్… వీళ్లకుతోడు మలయాళ మోహన్‌లాల్, కన్నడ శివరాజకుమార్, హిందీ జాకీ ష్రాఫ్, తెలుగు సునీల్ కూడా ఎంతోకొంత అదనపు ఆకర్షణలు… అంతేనా..? తమన్నా, రమ్యకృష్ణ ఎట్సెట్రా ఎక్సట్రా… మరొక హీరో ఉన్నాడు… తను విలన్‌గా చేసిన వినాయకన్… ఇప్పుడు అందరూ తన గురించీ చెప్పుకుంటున్నారు…
అందరికీ తెలిసిందే కదా… విలనీ బాగా పండితేనే హీరో అంతగా ఎలివేట్ అవుతాడు… అందుకే పాపులర్ సినిమాల్లో వీలైనంతవరకూ విలనీ మీద కూడా కాన్సంట్రేట్ చేస్తారు దర్శకులు… హీరో అంటే మేకల్ని, కోళ్లను చంపేవాడు కాదు… పులుల్ని, సింహాల్ని చంపేవాడు… అందుకే విలన్ గట్టిగా ఉండాలి… జైలర్ సినిమాలో విలన్ రజినీకాంత్ హీరోయిజానికి దీటుగా నిలబడ్డాడు… అదే చెప్పబోయే విశేషం…
రఫ్ లుక్, క్రూరమైన మొహం, భీకరమైన చూపులు, ఓ మాసిన లుంగీ, చొక్కా… జనం భయపడిపోయే దేశవాళీ విలన్… ఈ పాత్ర కూడా సినిమాలో బాగా ఎలివేటైంది… దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ విలన్ పాత్రకు వినాయకన్‌ను సరిగ్గా ఎంపిక చేసుకున్నాడు… మలయాళ ప్రేక్షకులకు ఈయన పరిచయమే… ఈ సినిమాతో తను సౌత్ ఇండియా ప్రేక్షకులందరికీ చేరువయ్యాడు ఇప్పుడు…
Ads
ఈయన ఎంపికకూ ఓ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉంది… పేరు చెప్పకుండా రజినీకాంత్ మొన్నామధ్య ఏమన్నాడంటే… జైలర్ సినిమాలో ఎవరైనా స్టార్ లేదా కొత్త నటుడు ఉండాలని అనుకున్నాడట… రొటీన్ విలన్ వేషాలు వేసే వాళ్లు గాకుండా ఓ డిఫరెంట్ విలన్ కావాలని కోరుకున్నాడట… దర్శకుడు నెల్సన్ ఓ సౌత్ స్టార్ పేరు సూచించాడట… తను రజినీకి మంచి మిత్రుడేనట… సో, బాగానే ఉంటుంది అనుకుని ఫోన్ చేశాడు… ఒకసారి కథ వినాల్సిందిగా చెప్పి దర్శకుడిని పంపించాడట…
తరువాత రజినీయే పునరాలోచనలో పడ్డాడు… స్టార్‌ను తీసుకొచ్చి విలన్‌గా పెడితే బోలెడు పరిమితులు ఉంటాయి… ఆ పాత్రతో ఎలాపడితే అలా వ్యవహరించలేం, తగినంత స్వేచ్ఛ ఉండదు… పైగా తను విలన్‌ను కొట్టే సీన్స్ కూడా ఉన్నాయి… సో, స్టార్ మిత్రుడు అనే ఆలోచన నుంచి బయటపడి, తనే ఆ స్టార్‌కు ఫోన్ చేసి, వద్దులే బ్రదర్ అని చెప్పాడట… స్టార్ మిత్రుడు అంటే మోహన్‌బాబు కావచ్చు అనుకున్నారు చాలామంది… ఆ ఇద్దరి మధ్య స్నేహం అందరికీ తెలిసిందే కదా…
కానీ మోహన్‌బాబు రఫ్ విలనీకి ఇప్పుడు సూట్ కాడు… కానీ రజినీకాంత్ ప్రస్తావించింది కమలహాసన్ గురించట… యాభయ్యేళ్లుగా తమిళ ఇండస్ట్రీలో తన ప్రత్యర్థి తనే, స్నేహితుడు తనే… ఇద్దరూ కలిసి నటించి 35 ఏళ్లు దాటిపోయింది… నిజంగా ఈ కాంబో కుదిరి ఉంటే కథ వేరే ఉండేది… కానీ వర్కవుట్ కాలేదు… రజినీ ఆలోచించిన విధానం కూడా కరెక్టే… కమల్ గనుక విలనీ పోషిస్తే హీరోగా రజినీకి చాలా పరిమితులు అడ్డుపడేవి… హీరో ఎలివేట్ కావడానికి విలన్ పవర్‌ఫుల్‌గా ఉండాలి, కానీ హీరోను డామినేట్ చేస్తే..?
అందుకే రజినీ, నెల్సన్ కొత్త ముఖం కోసం అన్వేషించి, ఇదుగో ఈ వినాయకన్ ని పట్టుకున్నారు. ఈ కొత్త ముఖాన్ని తెచ్చుకుని స్టార్ ని చేశారు. ఈ వినాయకన్ ఎవరో తెలుసా..? ఓ యాక్టర్, ఓ సింగర్, ఓ కంపోజర్, ఓ కొరియోగ్రాఫర్… బహుముఖ ప్రజ్ఞ… మనకు కొత్త… కానీ మలయాళంలో 1995 నుంచీ ఉన్నాడు… సహాయ పాత్రలు, కమెడియన్ పాత్రలు వేసేవాడు… అన్నట్టు, తను ఓ తెలుగు సినిమాలో కూడా ఉన్నాడు… 2006 నాటి అసాధ్యుడు సినిమాలో…
సినిమాల్లోకి రావడానికి ముందు ‘బ్లాక్ మెర్క్యురీ’ అనే డాన్స్ గ్రూపు నిర్వహించేవాడు… మైకేల్ జాక్సన్ ని ఇమిటేట్ చేసేవాడు… ఇందుకేనేమో ‘జైలర్’ లో విలన్ గా చేస్తూ… బాగా హై వస్తే అనుచరులతో కలిసి డాన్స్ చేస్తాడు… ఓ ఐశ్వర్యారాయ్ పాటకి కూడా డాన్స్ చేసి పడేశాడు… చంపడంలో శాడిస్టిక్ ఆనందాన్ని పొందే పాత్ర… అనుచరుణ్ని కింద పడేసి, ఛాతీ మీద బాసింపట్టు వేసుక్కూర్చుని, సుత్తితో తాపీగా బాదుతూ ఎంజాయ్ చేస్తాడు… ప్రేక్షకుడి ఒడలు జలదరించే విలనీ… అందుకే రజినీ హీరోయిజం అంతగా ఎలివేటైంది..!!
Share this Article