క్రమేపీ ఓ సగటు నాసిరకం షోలాగా మారిపోతున్న ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ సినిమా సాంగ్స్ కంపిటీషన్ షోలో ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు… ఏ టీవీ షో అయినా సరే, తెర వెనుక నిపుణులను గుర్తించదు… ఎంతసేపూ పాడేవారికి ఆహారావాలు, ఓహోగీతాలతో భజన తప్ప… క్రమేపీ గానంపై నిశిత, శాస్త్రీయ విశ్లేషణ నాటి ఎస్పీ బాలుతోనే అంతరించిపోయినట్టుంది…
ఇప్పుడు అన్ని టీవీల్లోనూ ఓ డబ్బా విశ్లేషణలు… వేరే టీవీ మ్యూజిక్ షోలలో అనంత శ్రీరామ్, సునీత, రాహుల్ సిప్లిగంజ్, మంగ్లి, కల్పన,మనో ఎట్సెట్రా ఎవరు జడ్జిలుగా ఉన్నా సరే, పాటల సరైన శాస్త్రీయ విశ్లేషణ లేదు, ఉండటం లేదు, ఉండబోదు… మరీ సునీత తీర్పులు అదో రకం…
సరే, గాయకులకు మార్కులు, సోషల్ మీడియాలో వోట్లు అనేది ఓ మాయా ప్రపంచం… మళ్లీ ఆ డిబేట్‌లోకి వెళ్లడం లేదు ఇక్కడ… సోషల్ మీడియా వోట్లు అంటేనే అదొక బిగ్‌బాస్ తరహా ఓ చెత్తా ఆర్మీలు, టీమ్స్, వోట్ల మేనేజ్‌మెంట్… అసలు ప్రతిభ అ మాయకు దెబ్బతిని బావురుమంటుంది… మన షణ్ముఖ ప్రియ అంతే, మొన్నటి ఆహా ఐడల్ షోలో అమెరికన్ తెలుగు శృతి వరకూ…
Ads
ఇదంతా ఒక ఎత్తు… ఒక సినిమా పాటకు సాహిత్యం, ట్యూన్, మంచి గాయనీగాయకులు ఎంత ముఖ్యమో, ఆర్కెస్ట్రా సహకారం కూడా అంతే ముఖ్యం… రికార్డింగ్ స్టూడియోల్లో వేరు, కంప్యూటర్లు కూడా శృతులు, గమకాలను సరిదిద్దేస్తున్నయ్… టేకులుంటయ్… కానీ ఒక లైవ్ షోలో అవన్నీ కుదరవు… అఫ్‌కోర్స్ ట్రాకులతో నడిపించే టీవీ మహానుభావులూ ఉన్నారు…
కానీ ఆహా ఇండియన్ ఐడల్ ఓ కొత్త సంప్రదాయాన్ని, సత్సంప్రదాయాన్ని ఆరంభించింది… కారకుడు థమన్… గుడ్… ఎంతసేపూ అన్ని షోలలో తెర వెనుకే ఉంచేసే ఆర్కెస్ట్రా సభ్యులను కూడా గుర్తించి, మెచ్చుకుని, అవార్డులు ఇవ్వడం… నిజానికి ఈ అర్కెస్ట్రా సాయి టీం అర్హులే… వీళ్లలో గిటారిస్ట్, రిథమ్ ప్లేయర్ పవన్, కీబోర్డు ప్లేయర్ సాయి, వయోలిని కామాక్షిలతోపాటు శ్రీకీర్తి, కేశవ్‌రామ్‌లతో టీవీ9 ఓ ప్రోగ్రామ్ చేసింది… అంతకుముందు కామాక్షి ప్రధాన పాత్రధారిగా ఆహా సీజన్ 3 లాంచింగ్ కూడా బ్రహ్మాండంగా, వినూత్నంగా ఆర్గనైజ్ చేశారు, అక్కడా వీర యాంకరిణి సుమ వచ్చి ఏదేదో మొనాటనస్ అరుపులతో వాగుతుందనే భయాందోళనలకు భిన్నంగా…!
టీవీ9లో కూడా కామాక్షి స్పష్టమైన డామినేషన్… నిజంగానే మంచి ప్రతిభ… ముద్దుగా, పద్ధతిగా, కాలు మడిచిపెట్టుకుని, కూర్చుని, ఓ వయోలిని సరస్వతిలా రక్తికట్టిస్తుంది… సాయి ఈ టీంకు లీడర్… 11 మ్యూజికల్ వాయిద్యాలలో ప్రతిభ ఉందట, గ్రేట్… షోలో తరచూ కీబోర్డు, ఫ్లూట్‌తో కనిపిస్తుంటాడు… మరోవైపు పవన్ రిథమ్ ప్లేలో టాప్… (కుర్చీ మడతపెట్టి పాటకు వీళ్లనే వాడుకున్నాడట థమన్…) ప్రతి ఎపిసోడ్‌లో ఈవారం మ్యూజిషియన్ పేరిట ఏదో చిన్న అవార్డు కూడా ఇప్పిస్తుంటాడు థమన్… అవును, తెర మీద ప్రదర్శితం కావల్సిన ప్రతిభే కదా…!!
అసలు ఈ కామాక్షి ఎవరు..? బహుశా సాయికో, పవన్‌కో రిలేటివ్ కావచ్చు, లేదా కుటుంబ సభ్యురాలే కావచ్చు అనుకున్నారు సంగీత ప్రియులు… కానీ కాదట… ఆమె వీడియోలు ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో చూసి… ఆహా షోకు వయోలినిస్ట్ కావాలనగానే ఆమెను అదే సోషల్ మీడియా వేదికగా అప్రోచ్ అయిపోయి, ఈ టీంలోకి తెచ్చుకున్నారట… అన్నట్టు పవన్, సాయి ఇద్దరూ స్వయానా అన్నదమ్ములు..!!
Share this Article