.
టి జె ఎస్ జార్జ్ అంటే ఇప్పటితరానికి తెలియకపోవచ్చు. దేశం గర్వించదగ్గ జర్నలిస్ట్. అంతర్జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న రచయిత. విద్యావేత్త. పద్మభూషణ్ మొదలు అనేక అవార్డులు పొందిన వ్యక్తి.
ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంగ్ల దినపత్రికలో “పాయింట్ ఆఫ్ వ్యూ” పేరిట పాతికేళ్ళపాటు వారం వారం ఆయన రాసే కాలం ఆంధ్రప్రభలో తెలుగులోకి అనువాదమై అచ్చయ్యేది. 1997 ప్రాంతాల్లో అలా టి జె ఎస్ జార్జ్ కలం నాకు పరిచయమయ్యింది. వారం వారం ఆ కాలం చదవడంతో ఏదో కొత్త చూపు వచ్చినట్లనిపించేది.
Ads
ఆ మాటే పులకింతగా నా సీనియర్ యాధాటి కాశీపతికి చెబితే… జార్జ్ ఇంగ్లిష్ చదువు ఇంకా బాగుంటుంది అని ఆ వచన మాధుర్యం రుచిని అలవాటు చేయించారు. రాజకీయ, సామాజిక విషయాలను కార్యకారణ సంబంధాలతో జార్జ్ విశ్లేషించే తీరు పాఠకులను కట్టిపడేస్తుంది. ఆలోచించండి అని వెంటపడుతుంది. కేవలం ప్రశ్నలే కాకుండా వాటికి సమాధానాలను వెతికిపెడుతుంది.
“క్రికెట్ సందోహంలో బెంగళూరు ఉక్కిరిబిక్కిరి అవుతున్నవేళ… గుల్బర్గాలో గుక్కెడు నీళ్ళు దొరక్క ఊపిరాగే మనుషులగురించి, తలలు వాల్చిన పంటపొలాల గురించి చెబితే ఎవరైనా వింటారా?” అని మొదలుపెడతారు జార్జ్. వెంటనే మనం క్రికెట్ ను వదిలి గుల్బర్గాకు వెళ్ళిపోతాం.
“న్యాయమెప్పుడూ న్యాయంగా న్యాయంలో ఉండదు. వాదనాబలంలో ఉంటుంది. నోరున్నవాడు గెలిచి… నోరులేనివాడు ఓడిపోవడంకంటే అన్యాయం మరొకటి ఉంటుందా?” అన్న జార్జ్ ప్రశ్నకు మనం సమాధానం వెతుక్కోవాల్సిన పనిలేకుండా ఆయనే ఉదాహరణలతో వివరిస్తారు.
మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణల నుండి ప్రభుత్వాలు పక్కకు తప్పుకుని ప్రయివేటు చేతుల్లో పెట్టాక హైవేల్లాంటివి భవిష్యత్తులో ప్రయివేటుకు బంగారు బాతుగుడ్లు అయి… ప్రజలకు ఎలా పెనుభారమవుతాయో 1999 నాటికే జార్జ్ స్పష్టంగా అంచనా వేశారు. “యుగయుగాలుగా మనం నడిచిన దారి ఇక మనది కాదు;
తరతరాలుగా ప్రాంతాలమధ్య వారధిగా ఉన్న దారి ఇక మనది కాదు;
భిన్న సంస్కృతులను కలగలిపిన దారులు ఇక మనవి కావు;
మనం నడిచి వచ్చిన దారి ఇక మనది కాదు;
మనం ప్రయాణించాల్సిన దారి ఇక మనది కాదు;
ప్రభుత్వ దారి ప్రయివేటుపరం అయ్యాక ఆ దారిలో అడుగుకో రేటు చెల్లించకపోతే… అడుగు తీసి అడుగు వేయగలమా?”
ఇది వార్తో, వ్యాఖ్యో, అభిప్రాయమో, సంపాదకీయమో, కవిత్వమో లేక అన్నిటికీ మించి భవిష్యత్తు చెప్పిన కాలజ్ఞానమో ఎవరికి వారు తేల్చుకోవచ్చు- ప్రస్తుత జాతీయ రహదారుల టోల్ వసూళ్ళ అనుభవాలను ముందుపెట్టుకుని.
బెంగళూరులో ఒకసారి యాదాటి కాశీపతి ద్వారా జార్జ్ ను కలిసి కాసేపు మాట్లాడే అదృష్టం దొరికింది. “మిమ్మల్ను చదవడం ఒక వ్యసనంలా తయారయ్యింది సార్! ప్రతి అక్షరంలో ఎంతో భావాన్ని దట్టిస్తారు”- అని తెలుగులో చదివిన ఒక వ్యాసాన్ని రెఫర్ చేశాను. అయితే ఆ క్రెడిట్ ట్రాన్స్లేటర్ కు ఇవ్వు. బహుశా నా ఇంగ్లిష్ కంటే ఆయన తెలుగు బాగున్నట్లుంది అని చాలా సింపుల్ గా చెప్పారు.
నాలుగయిదు ఆర్టికల్స్ కోట్ చేస్తే అయితే ఇంకో కాఫీ తాగాలి అని మురిసిపోయారు. జార్జ్- కాశీపతి ఒక గంటపాటు ఇంగ్లిష్ దినపత్రికల్లో ప్రఖ్యాత కాలమ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే…అందరికీ రోజుకు 24 గంటలే ఉంటాయి…వీళ్ళకు ఇంతింత చదవడానికి, చదివింది గుర్తు పెట్టుకోవడానికి ఎలా కుదురుతోందని ఆశ్చర్యపోయాను.
కొస మెరుపు:-
జార్జ్ ఇంగ్లిష్ శీర్షికను వారం వారం తెలుగులోకి అనువదించిన జర్నలిస్ట్ అప్పటి ఆంధ్రప్రభ (బెంగళూరు డెస్క్)లో సీనియర్ జర్నలిస్ట్ బి. వేంకటేశ మూర్తిది మా హిందూపురమే. నా శ్రేయోభిలాషి. జర్నలిజం భాషలో నాకు మెళకువలు నేర్పిన గురువు. జీవితంలో ఒక్కసారైనా మూర్తి సార్ లా అందమైన హెడ్డింగులు పెట్టాలని, ఆయనలా గంగాప్రవాహంలా తెలుగు వచనం రాయాలని ఆరాటపడుతూ ఓడిపోయిన రోజులు ఇప్పుడు గెలిచిన రోజుల్లానే అనిపిస్తున్నాయి.
జార్జ్ ఇంగ్లిష్ కాపీ చేతికి రాగానే పంచభక్ష్య పరమాన్నాలు దొరికినట్లు ఉండేది మధూ! అని ఆయన ఇప్పటికీ పరవశంగా చెబుతూనే ఉన్నారు. ఓహ్! ఏమి ఎత్తుగడ? ఏమి ముగింపు? సరళ భాషలో ఎన్నెన్ని హొయళ్ళు? జార్జ్ ను చదవడం దానికదిగా ఒక పరవశం. ఆయన రాతలను అనువదించడం ఒక అదృష్టం- అంటారు మూర్తి.
పి వి నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయి లాంటి మేరునగ లీడర్లు జార్జ్ ను అభిమానించే రీడర్లు.
07-05-1928లో కేరళలో పుట్టిన జార్జ్ 2025 అక్టోబర్ 3 న 97 ఏళ్ళ వయసులో బెంగళూరులో కన్నుమూశారు. ఆరు దశాబ్దాల జర్నలిజం కెరీర్లో ఆయన ఎన్నెన్నో ఉన్నత పదవుల్లో పనిచేశారు. జాతీయ, అంతర్జాతీయ పత్రికలకు ఎడిటోరియల్ అడ్వయిజర్ గా పనిచేశారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, నర్గిస్ మీద పుస్తకాలు రాశారు. విభిన్న కోణంలో బెంగళూరు బయోగ్రఫీ పుస్తకం రాశారు.
ఒక విషయాన్ని 360 డిగ్రీల్లో ఎలా చూడాలో, విషయానికి తగిన భాషను ఎలా ఎంచుకోవాలో తెలుసుకోవాలంటే జార్జ్ ను చదవాలని మాకు సీనియర్లు చెప్పేవారు. అలాంటి జార్జ్ కు ఏమివ్వగలం- ఈ నాలుగు మాటల అక్షరాంజలి తప్ప.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article