.
పెద్దలు దోగిపర్తి సుబ్రహ్మణ్యం ఒక ప్రశ్న వదిలారు… ఏకలవ్యుడు ఎలా మరణించాడు…?
అవున్నిజమే, మరణించాడు..? అందరికీ తెలిసిన కథ ఏమిటంటే… ద్రోణుడి వల్ల భీకరమైన కులవివక్షకు గురైన వాళ్లలో ప్రథములు కర్ణుడు, ఏకలవ్యుడు… సరే, ఇద్దరి జీవితకథలూ వేర్వేరు మార్గాలు…
Ads
ఏకలవ్యుడు గురుదక్షిణగా ద్రోణుడి కుటిల కోర్కె కారణంగా కుడి బొటనవేలు అప్పగిస్తాడు… అక్కడితో ఏకలవ్యుడి కథ ముగుస్తుంది చాలావరకు… కానీ తరువాత ఏమిటి..?
రకరకాల కథనాలున్నాయి… సెర్చుతుంటే ఒకటి ఆసక్తికరంగా కనిపించింది… అది ఆరుద్ర పరిశోధన వ్యాసం పేరిట… (ఇది ప్రామాణికం కాకపోవచ్చు, అభూతకల్పనలు, అబద్ధాలు కావచ్చు, కానీ చదవబుల్…)
తను అర్జునుడికి హామీ ఇచ్చాడు, ప్రపంచంలోకెల్లా విలువిద్యా నిపుణుడిని చేస్తానని… సో, ఏకలవ్యుడి కారణంగా అది నెరవేరదని భావించి, కుట్రతో ఏకలవ్యుడిని నిర్వీర్యం చేయడానికి కుడి వేలు దక్షిణగా అడుగుతాడు అనేది ఒక వాదన…
కాదు, ఒక కుక్కను చూసి, అది తనను చూసి అరచింది అనే చిన్న కారణానికి, దాని నోట్లోకి 7 బాణాలు వేసి, కోపాన్ని అదుపులో ఉంచుకోలేని, ధర్మం, అధర్మం తేడా తెలియకుండా అధర్మం వైపు మొగ్గే అతని వద్ద ఇంతటి విలువిద్య ఉంటే లోకానికి, ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుందని ద్రోణుడు భావించాడు అనేది మరో వాదన…
రెండోది కవరింగు… మొదటిదే కాస్త రీజనబుల్… తరువాత ఏకలవ్యుడు జరాసంధుడి దగ్గర చేరతాడు… తనకు విశ్వాసపాత్రుడిగా, సైన్యాధికారిగా వ్యవహరిస్తాడు… రుక్మిణీ స్వయంవరం సమయంలో జరాసంధుని కోరిక మేరకు, శిశుపాలుడికి మరియు రుక్మిణీదేవి తండ్రియైన భీష్మకుడికి మధ్యవర్తిగా వ్యవహరించాడు. కానీ నిష్ఫలం…
తరువాత ఒకసారి జరాసంధుని సైన్యంతో యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడిపైకి ఏకలవ్యుడు ఒక రాయి విసరడంతో శ్రీకృష్ణుడే అతన్ని చంపివేశాడనేది ఒక కథనం…
అసలు ఏకలవ్యుడు ఎవరు..? ఒక రాజు కొడుకు… పుట్టినప్పుడు, అతని జాతకం బాగాలేకపోతే, దుశ్శకునాలు కలిగితే, అతణ్ణి కులభ్రష్టుడిగా భావించి అడవులలో వదలిపెడతారు… ఏకలవ్యుడు అడవులలో భిల్లుల మధ్య పెరిగి, నిషాద జాతులలో చేరాడు. ఇతని తండ్రి దేవశ్రవుడు, వసుదేవునికి మూడవ తమ్ముడు.
(హరివంశం) ఏకలవ్యుడు నిషాదుడు (బోయవాడు) అంటుంది వ్యాసభారతం. ఇతను ఎరుకలవాడు అంటుంది కవిత్రయ భారతం.! తండ్రి నిషాదరాజైన హిరణ్యధన్వుడు అని వ్యాసుడంటే, ఎరుక రాజైన హిరణ్యధన్వుడని నన్నయ చెబుతాడు. నిజానికి ఏకలవ్యుడు, వేటగాళ్ళ రాజు, నిషాద వ్యత్రజ హిరణ్యధనుస్సు చేత పెంచబడ్డాడని అర్ధమవుతుంది…
ఏకలవ్యుడి వృత్తాంతంలో ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. ఈ సందేహాలన్నీ ‘హరివంశం’లో పరిష్కారమైనట్లు కొందరి అభిప్రాయం. ఆరుద్ర పరిశోధించి పేర్కొన్నట్లు ‘ఏకలవ్యుడు- కృష్ణుడు- పాండవులు రక్త సంబంధీకులు’.
యాదవ రాజైన శూరుడికి స్వయానా మనవళ్లు! ఇతడి భార్య మారిష. వీరికి తొమ్మిదిమంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు పుట్టారు. అందులో ఏకలవ్యుడి తల్లయిన శృతదేవ శూరుడి రెండో కూతురు. నాల్గవది కుంతి. అంటే వీరికి పుట్టిన ఏకలవ్యుడు, పాండవులు అన్నదమ్ములన్నమాట!
శూరుడి మొదటి కొడుకు వసుదేవుడు. రెండవవాడు దేశశ్రవుడు. ఏకలవ్యుడు కృష్ణులది బావ- బావమరదుల వరసన్నమాట. ఆరుద్ర తన వ్యాసపీఠంలోని ‘ఏకలవ్యుని పుట్టుపూర్వోత్తరాలు’ అనే వ్యాసంలో పాండవులకు ఏకలవ్యునికి మధ్యగల చుట్టరికాన్ని, ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో ఏకలవ్యుడు పాల్గొనడాన్ని పేర్కొని ధృవీకరించారు.
ఏకలవ్యుడి తండ్రి హిరణ్య ధన్వుడు (కేకయరాజు). తల్లి శ్రుతదేవ.”హరివంశం” గ్రంధ ప్రకారం ఏకలవ్యుడు పాండవులకు రెండవ పెదతల్లి కొడుకు, కృష్ణుడి రెండో మేనత్త కొడుకు.అనగా పాండవులకు వరుసకు సోదరుడు… (ఏ తీవ్రమైన కులవివక్షకు గురయ్యారో ఆ కర్ణుడు, ఆ ఏకలవ్యుడు నిజానికి ఆ కుంతి రక్తమేనన్నమాట…)
ఒక తెలుగు సినిమాలో ఏకలవ్యుడి చెల్లెల్ని కర్ణుడు పెళ్లి చేసుకున్నట్లుగా చూపించారు. ముందు పేర్కొన్న ప్రకారమైతే ఏకలవ్యుడు, కర్ణుడు అక్కచెల్లెళ్ల పిల్లలు. కాబట్టి సినిమాలో చూపించింది అసంబద్ధం!
ఏకలవ్యుడు కూడా మగధ దేశాధిపతి జరాసంధ చక్రవర్తి కొలువులో సేనాధిపతిగా పనిచేసాడు. ఏకలవ్యుడు బలరామునితో గదా యుద్ధం చేసి చివరిలో ఒక దీవిని చేరి తలదాచుకున్నట్లు హరివంశ కధనం….. కాదు, కాదు, కురుక్షేత్రంలో కౌరవుల తరఫున యుద్దం చేసి వీరమరణం పొందాడనీ అంటారు… ఎన్ని కథనాలో,..!!
Share this Article