ఇంతకీ వైఎస్‌ను ఎవరు హతమార్చారు..? ఎందుకు..? వాళ్లే ఆయన బిడ్డ షర్మిల మీద కూడా ఎందుకు కక్షగట్టారు..? జగన్‌కు కూడా లేని పట్టింపు షర్మిలకు ఎందుకు కలుగుతోంది..? ఏపీ రాష్ట్రం మొత్తాన్ని వైఎస్ నామమయం చేస్తున్న జగన్ ఆయన మరణకారకుల్ని వదిలేశాడా..? ఎవరో తనకు తెలుసా..? క్షమించాడా..? ఇవన్నీ పక్కన పెడితే… సాక్షాత్తూ వైఎస్ బిడ్డ స్వయంగా మా నాన్న మరణం వెనుక కుట్ర అని చెబితే, తనకూ ముప్పు ఉందని చెబుతుంటే… రెండు తెలుగు రాష్ట్రాల్లో వీసమెత్తు చర్చ లేదేమిటి..? పొలిటికల్, జర్నలిస్ట్, బ్యూరోక్రాట్, లీగల్ సర్కిళ్లలో కూడా చడీచప్పుడు లేదేమిటి..?
……. ఇదుగో ఇన్ని ప్రశ్నలు చుట్టుముడుతున్నయ్ నిన్నటి నుంచీ…! రిలయెన్స్ గ్యాస్‌కు సంబంధించిన ఏదో అంశంలో వైఎస్‌కూ అంబానీకి నడుమ ఏదో తగాదా వచ్చింది, అంతే, పైకి లేచిన వైఎస్ హెలికాప్టర్ మళ్లీ తిరిగిరాలేదు అంటూ అప్పట్లో బోలెడు విమర్శలు… ఏదో టీవీ చానెల్‌లో ఏదో వార్త ఇలాగే వస్తే రాష్ట్రమంతా రిలయెన్స్ స్టోర్లపై దాడులు కూడా జరిగాయి… కానీ అదే అంబానీ ఇప్పుడు జగన్‌కు ఆత్మీయుడు, ఆయన మనిషిని జగన్ రాజ్యసభ సభ్యుడిని కూడా చేశాడు… సో, అంబానీ కుట్ర ఏమీ లేదని జగన్ అంగీకరిస్తున్నట్టే అనుకోవాలిగా… ఈ సంగతి షర్మిలకు కూడా తెలిసే ఉంటుందని అనుకోవాలిగా… మరెవరు ఆయన్ని హతమార్చారు..?
మరి సాక్షాత్తూ తన చెల్లె తన నాన్న మరణం ఓ కుట్ర అని తాజాగా చెబుతున్నప్పుడు… కేసీయార్ లైట్ తీసుకోవచ్చుగాక, కానీ ఏపీ సీఎం జగన్ వెంటనే స్పందించి, విచారణకు ఆదేశించలేదెందుకు..? మెరికల్లాంటి పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఎందుకు ఏర్పాటు చేయలేదు..? పోనీ, సీబీఐ విచారణను ఎందుకు అడగలేదు..? కీలకమైన ప్రశ్న ఏమిటంటే..? షర్మిల ఇప్పుడు ఎవరికి కంటగింపుగా మారింది..? ఎందుకు..? రాజకీయ సంబంధ హత్యేనా అది..?
Ads
నిజానికి ఆమె రాజకీయం వల్ల ప్రయోజనం ఎవరికనేది ప్రజలకు తెలియదు… ఎవరు విడిచిన బాణమో ప్రజలకు తెలియదు… ఎందుకు తిరుగుతున్నదో ప్రజలకు తెలియదు… ఏపీ అన్న మీద కోపముంటే చెల్లె తెలంగాణలో రాజకీయం చేయడం ఏమిటో ఎవరికీ అర్థం కాదు… ఇదొక మార్మిక పాదయాత్ర… ప్రతి పొలిటిషియన్ పాదయాత్ర వెనుక స్పష్టమైన సంకల్పం, ఉద్దేశం, ప్రణాళిక ఉంటయ్… ఇది అలా కూడా లేదు… ప్రస్తుత పరిస్థితుల్లో రాజన్న పాలనను తీసుకొస్తా అనేది తెలంగాణలో ఓ శుష్కనినాదమేనని ఆమెకూ అర్థమవుతోంది… ఐనా తిరుగుతూనే ఉంది… నిజానికి ఆమె ఎవరికీ థ్రెట్ కాదు… మరెవరు ఆమెపై కక్షగట్టినట్టు..?!
నిన్న జర్నలిస్టు శ్రావణి తనను అడిగింది… ‘‘నాన్న హత్యపై సందేహాలుంటే విచారణకు డిమాండ్ చేయలేదెందుకు..?’’… ఇదీ ప్రశ్న… సూటిగా ఉంది… ‘‘అసలే మా కుటుంబాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోంది… విచారణ అడిగినా పట్టించుకోరు కదా, అందుకే సైలెంటుగా ఉన్నాం…’’ అని బదులిచ్చింది షర్మిల… సరే, నిజమే అనుకుందాం… కోర్టును ఆశ్రయించి ఉండాల్సింది కదా మరి..? ఆ కాంగ్రెస్ మీదే ఎదురుదాడికి దిగవచ్చుగా, ఎలాగూ సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు, అన్ని సవాళ్లకూ సిద్ధమైనప్పుడు, సీబీఐ కేసులు పెడుతున్నప్పుడు, ఇంకా కాంగ్రెస్ ఏం చేసి ఉండేది..?
ఆ కాంగ్రెస్ కుప్పకూలిపోయి, మోడీ గద్దెనెక్కి ఇన్నేళ్లు అవుతోంది… జగన్ కుటుంబం పట్ల ఆయనకేమీ ద్వేషం, కోపం లేవు కదా… పైగా కాంగ్రెస్‌ను కార్నర్ చేసేందుకు వైఎస్ హత్య ఉపయోగపడే పక్షంలో మోడీ ఊరుకునేవాడు కాదు కదా… మరి ఇన్నేళ్లుగా మళ్లీ వైఎస్ హత్యపై దర్యాప్తును ఎందుకు డిమాండ్ చేయలేదు..? హఠాత్తుగా తండ్రి హత్య కుట్ర అని ఆరోపించడం ద్వారా ఆమె ఆశిస్తున్నదేమిటి..? అదీ పాదయాత్ర రాజకీయ ఉద్దేశాల్లాగే ఓ అంతుచిక్కని, జవాబు దొరకని మార్మిక ప్రశ్న…!!
Share this Article