కర్నాటక విద్యార్థి ఒకరు ఉక్రెయిన్‌లో మరణించాడు… రష్యా సైన్యం ప్రయోగించిన ఓ క్షిపణి కారణంగా… వేలాది మంది విద్యార్థులు ఇంకా అవస్థలు పడుతున్నారు… సరిహద్దులు దాటలేక, ఇండియాకు తిరిగిరాలేక భయాందోళనల నడుమ బిక్కుబిక్కుమంటున్నారు… మోడీ ప్రభుత్వం వాళ్ల సత్వర తరలింపు కోసం ప్రయత్నిస్తోంది… ఇవీ వార్తలు… మధ్యలో మళ్లీ రాజకీయాలు… వాటికి సిగ్గూశరం ఉండవుగా…
కానీ ఓ మౌలికమైన ప్రశ్న మాత్రం చర్చల్లోకి రావడం లేదు… అసలు ఇన్ని వేల మంది ఆఫ్టరాల్ ఓ చిన్న దేశానికి ఎందుకు వెళ్లారు..? ఉక్రెయిన్ మాత్రమే కాదు, పాత రష్యా దేశాల్లో, రష్యాలో, చైనాలో కలిపి లక్షల మంది విద్యార్థులున్నారు… నానా కష్టాలూ పడుతున్నారు… ఎందుకు..? ఇండియాలో వైద్యవిద్య దొరకదు కాబట్టి, చౌకగా చదువుకోవచ్చుననే భావనతో మనవాళ్లు ఆయా దేశాలకు వెళ్తున్నారు…
బైపీసీ స్ట్రీమ్ తీసుకున్నవాడికి వేరే దిక్కులేదు కాబట్టి… ఇండియాలోనే చదవాలంటే ప్రైవేటుగా ఎంబీబీఎస్ సీట్లు చాలా ఖరీదు కాబట్టి… మన కాలేజీల్లో సీట్ల సంఖ్య తక్కువ కాబట్టి… ఎస్, ఇక్కడే అసలు పాయింట్… వీథికో ఇంజనీరింగ్ కాలేజీ ఉంటుంది కదా… ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పుట్టుకొస్తున్నారు కదా… ఇతరత్రా విద్యాంశాలూ అందుబాటులో ఉంటున్నయ్ కదా… మరి డాక్టర్లు ఎందుకు తయారు కావడం లేదు..?
Ads
బుర్రల్లేని నాయకుల వల్ల… సిగ్గులేని బ్యూరోక్రాట్ల వల్ల…… ప్రపంచంలోకెల్లా అత్యంత దరిద్రమైన విద్యాసంబంధ సంస్థ ఏదంటే… మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా…! ఇన్ని ప్రభుత్వాలు మారినయ్, వైద్యవిద్య తీరు మారదు… ఢిల్లీలోనే వందల మంది ఐఏఎస్‌లు, ప్రణాళికవేత్తలు కోట్ల ప్రజాధనాన్ని ఆరగించేస్తుంటారు… వైద్యవిద్య తీరు మారదు… అక్కడ మోడీ ఉన్న, ఇంకెవరో ఉన్నా… అసలు విద్య గురించి ఆలోచించిందెవరు..?
అప్పుడెప్పుడో కూర్చిన సిలబస్… అదే అయిదేళ్లు… హౌస్ సర్జెన్సీ… అరకొర పీజీ సీట్లు… కావాలంటే కోట్లు… గ్రామీణ భారతమే కాదు, పట్టణాల్లో కూడా మామూలు డాక్టర్లు లేరు ఇప్పుడు… చిన్న అవసరానికీ కార్పొరేటు హాస్పిటల్… జేబులు ఖాళీ… హైదరాబాదులో స్పెషలిస్టులయితే సగటు కన్సల్టేషన్ ఫీజు 500… జ్వరానికో, నొప్పికో వైద్యం చేసేవాడు లేడు…
ఎంసీఐలో ఒక్కడికీ బుర్ర లేదు అని చెప్పడానికి బీడీఎస్ కోర్సు పెద్ద ఉదాహరణ… ఎంబీబీఎస్ సరే, దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ కేవలం దంతవైద్యం అట… సరే, అదే సమయంలో కళ్లు, ఇతర అంగాలు, అంటువ్యాధులు, సుఖవ్యాధులు, లైఫ్ స్టయిల్ డిసీజెస్, ప్రాథమిక చికిత్స, వైకల్యాలు వంటి అంశాల్లో డిగ్రీ కోర్సులు ఎందుకు ప్లాన్ చేయలేదు..? జనరల్ మెడిసిన్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సు ఎందుకు పెట్టకూడదు..?
సర్జరీలు అనే పార్ట్ తీసేసి, మిగతా మెడికల్ సైన్స్ అలాగే ఉంచేసి… మూడేళ్ల డిగ్రీ కోర్సును ప్రైవేటు వాళ్లకు అప్పగించి చూడండి… పోనీ, బోలెడు కార్పొరేటు హాస్పిటల్స్ వందల పడకలతో వైద్యం చేస్తున్నాయి కదా, వాటికి అనుబంధంగా మెడికల్ కాలేజీలు పెట్టుకోవడానికి విధానాల్ని సరళీకరించండి… నర్సింగ్, ఫిజియోథెరపీ కోర్సుల్లాగే జనరల్ వైద్యం కూడా ప్రవేశపెట్టండి… సంప్రదాయ యూనివర్శిటీల్లో ఎలాగూ వేల కోట్లు పోస్తున్నారు, కానీ దేశ వాస్తవ అవసరాలకు తగినట్టు మార్పులు మాత్రం ఏ ప్రభుత్వానికీ చేతకాదు..
కొన్ని నిజాలు… 1) పోయినసారి 15 లక్షలపైచిలుకు విద్యార్థులు నీట్ రాస్తే… అందులో 8.8 లక్షల మంది పరీక్ష పాసయితే… అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య కేవలం 88 వేలపైచిలుకు… అంటే కేవలం పదిశాతం… 2) ఒక్క ఉక్రెయిన్‌లోనే దాదాపు 19 వేల మంది మన దేశ విద్యార్థులున్నారు… 3) 284 ప్రభుత్వ కాలేజీల్లో 43 వేల సీట్లు ఉండగా, 269 ప్రైవేటు కాలేజీల్లో 41 వేల సీట్లు… మెరిట్ ఉన్నాసరే, సీటు వచ్చినా సరే ఆ చదువు ఖరీదే… 4) ప్రతి దేశం 2024 నాటికి ప్రతి వెయ్యిమందికి ఒక డాక్టర్ ఉండేలా ప్రయత్నించాలని WHO చెబుతోంది…
పోనీ, వివిధ దేశాలకు వెళ్లి వైద్యవిద్య అభ్యసించి వచ్చేవారు ఏమైనా సంతోషంగా ఉన్నారా..? లేదు..! మళ్లీ వాళ్లకు గుర్తింపు ఇవ్వడానికి వేరే పరీక్ష… దాని పేరు FMGE… NExt అని మార్చబోతున్నారు దాన్ని… అందులో చాలామంది (ఓ అంచనా ప్రకారం 80 శాతం) ఫెయిల్… పీజీ సీట్లు దొరకవు… మరి వాళ్లంతా ఏం చేయాలి..? వీళ్లెవరూ ఇక్కడ వైద్యం చేయడానికి వీల్లేదు… విదేశాల్లో చదివిన పిల్లల్లో అధికులు ఇక్కడ అర్హత పరీక్షలో ఫెయిల్ అవుతున్నారు అని వైద్య ఆరోగ్య మంత్రి Pralhad Joshi ఓ పిచ్చికూత కూశాడు నిన్న… అంతేతప్ప సమస్య మూలాల్లోకి వెళ్లే సోయి తనకూ లేదు…
ఈ దురవస్థకు అసలు కారణం… కేంద్ర ప్రభుత్వం, ప్రణాళికసంఘం అసమర్థత… ఇక్కడే విద్యావకాశాలు పెరగకపోవడం, పెంచకపోవడం… ఇప్పుడు చెప్పండి… ఉక్రెయిన్‌లో ఆ విద్యార్థి మరణానికి అసలు కారకులు ఎవరు..?! తను ఎలా మరణించాడనేది కాదు ప్రశ్న… ఉక్రెయిన్‌కు ఎందుకు వెళ్లాడనేదే అసలు ప్రశ్న…!! దీని మీద మన సొసైటీలో కనీసచర్చ కూడా జరగడం లేదు… అది చికిత్స లేని అసలు రోగం..!!
Share this Article