.
ఒక వార్త చదవండి ముందుగా…
రేవతి మృతితో మాకేం సంబంధం… హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంధ్య థియేటర్ ఓనర్
Ads
పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు…
ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చింది… పైగా ప్రీమియర్ షో మేం నిర్వహించలేదు… ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారు…
అయినా మా బాధ్యతగా బందోబస్తు కల్పించాం… అలాంటి మాపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయం అని పేర్కొన్నారు…
పక్కా తప్పించుకునే బాధ్యతారాహిత్యం… తెలంగాణ పోలీసు శాఖ, ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించాల్సిన కేసు ఇది…
- ఆ సినిమాకు అడ్డగోలు రేట్లు పెంచుకోవడానికి అనుమతించిన బాధ్యుడు ఎవరు..? దీని వెనుక లోపాయికారీ వ్యవహారం ఏముంది..?
- ఎడాపెడా ఇష్టమున్న సంఖ్యలో బెనిఫిట్, ప్రీమియర్ షోలకు అనుమతించిన అధికారి ఎవరు..? వాళ్ల మీద ఎందుకు చర్యలు ఉండకూడదు..? తాంబూలిచ్చాం, తన్నుకుచావండి అనే ఆ ధోరణికి బాధ్యుడు ఎవరు..?
సరే, ఇచ్చారు పో… అల్లు అర్జున్ వస్తున్నట్టుగా పోలీసులకు సదరు థియేటర్ ఎందుకు సమాచారం ఇవ్వలేదు..? అది బాధ్యతారాహిత్యం కాదా..? డిస్ట్రిబ్యూటర్లు ప్రీమియర్ షోలు నిర్వహించారు సరే, కానీ ఎందులో..? నీ థియేటర్‌లో కాదా..? నీకు బాధ్యత లేదా..?
ఒక మహిళ మృతి అంత తేలికగా తీసిపడేసేదిగా కనిపిస్తోందా మీకు..? సరే, థియేటర్ తప్పుంది సరే, డిస్ట్రిబ్యూటర్ తప్పుంది సరే… మరి అల్లు అర్జున్ తప్పు లేదా..?
బాధ్యతారహితంగా ఒక థియేటర్‌కు వచ్చేయడమేనా..? అసలే హీరోలను దేవుళ్లుగా పూజించే మూర్ఖాభిమానులున్న సమాజం మనది… వాళ్ల నుంచి వందల కోట్లు దండుకోవడమే తప్ప వీసమెత్తు సామాజిక బాధ్యత ఉండొద్దా..?
మా బాధ్యతగా బందోబస్తు కల్పించాం అని థియేటర్ చెబుతోంది… ఎవరు..? టికెట్ క్యూలను నియంత్రించే ఉద్యోగులతోనా..? అది సరిపోతుందా..? ఖచ్చితంగా రేవతి మృతికి ప్రథమ బాధ్యత థియేటర్ యాజమాన్యానిదే… తరువాత డిస్ట్రిబ్యూటర్‌ది… తరువాత అల్లు అర్జున్‌ది… లాఠీ చార్జ్ చేసేంత పరిస్థితి అదుపు తప్పుతుందని గమనించాక కూడా… అదనపు బలగాలను రప్పించి, షో రద్దు చేయడానికి పూనుకోని పోలీసులది కూడా తప్పే…
టికెట్ రేట్ల పెంపు, అడ్డగోలు షోలకు అనుమతించిన రేవంత్ రెడ్డి సర్కారు కూడా దోషే… ఓ దిశ, ఓ దశ లేకుండా పాత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే వ్యవహరిస్తే… ఇక వాళ్లకూ వీళ్లకూ తేడా ఏమున్నట్టు..? అసలు బెనిఫిట్ షోల ఆదాయంపై వినోదపన్ను ఏమైనా వస్తుందా..? అహోబిలం మఠమేనా..? ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి ముందుగా..!!
Share this Article