.
ఒక షార్ట్ న్యూస్ యాప్‌లో ఈ వార్తకు హెడింగ్ ‘రేవతిని చంపిందెవరు..?’
ఎవరు ఆ రేవతి..? నిన్న పుష్ప-2 ప్రీమియర్ షో చూడటానికి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లింది ఆమె…
Ads
వాళ్లది దిల్‌సుఖ్‌నగర్… భర్త భాస్కర్, కొడుకు శ్రీతేజ్, బిడ్డ శాన్వికతోపాటు వెళ్లింది… అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నాడనే సమాచారంతో విపరీతంగా జనం వచ్చారు… తొక్కిసలాట, ఉద్రిక్తత… పోలీసులు లాఠీచార్జి చేసినా అదుపులోకి రాలేదు…
ఫలితంగా ఆమె కన్నుమూసింది… కొడుకు హాస్పిటల్‌లో చావుబతుకుల్లో ఉన్నాడు… ఇదీ విషాదం… ఇక ఆ వార్త హెడింగ్… రేవతిని చంపిందెవరు? అనేది కరెక్టేనా..? కరెక్టే… ఆ చావు ఓ హత్యే… ఐతే ఎవరు హంతకులు..?
– అల్లు అర్జున్… తను ఎక్కడికి వెళ్లినా జనం విరగబడుతున్నారు… మొన్న ప్రిరిలీజ్ షోకు వచ్చిన జనం సాక్ష్యం… పుష్ప-2 మీద విపరీతమైన కృత్రిమ హైప్ క్రియేట్ చేయబడి ఉంది… ఆ స్థితిలో ప్రీమియర్ షోకు, అసలే ఫుల్లు రద్దీ ఉండే థియేటర్ల జంక్షన్‌కు తను వెళ్లడం తప్పు…
– అసలే ప్రీమియర్లకు ఎక్కువగా ఉన్మాదాభిమానం ఉండే ఫ్యాన్స్ వస్తారు… డాన్సులు, కేకలు, నినాదాలు, జోష్ వేరు… మాస్ వాతావరణం ఉంటుంది… మరి అక్కడికి బన్నీ ఎందుకు వెళ్లినట్టు..? ఫ్యాన్స్ కేకలు వింటూ ఆనందించడానికా…? కానీ ఏ మూల్యానికి…?
– ఇలా జరుగుతుందని ఊహిస్తామా అనేది సరైన సమర్థన కాదు… అలా వెళ్లకపోయి ఉండటమే సరైనది…
– నిజానికి ఇలాంటి ప్రీమియర్లకు కుటుంబాలతో, ఆడవాళ్లతో వెళ్లవద్దనే అందరూ సలహాలు ఇస్తారు… పైగా ఇద్దరు చిన్నపిల్లలు… ఆ షోకు వెళ్లడం ఒకరకంగా ఆ కుటుంబం తప్పు కూడా… (నాలుగు రోజులు ఆగితే బోలెడంత ఖాళీ థియేటర్లలో… లేదంటే ఓటీటీ ఉండనే ఉంది… ఎందుకీ తొందరపాటు..?)
– ఇన్నాళ్లూ సంధ్య థియేటర్‌కు ఇలాంటి చరిత్ర లేదు… అల్లు అర్జున్‌ను ఆహ్వానించి, అనుమతించి తప్పు చేశాడు ఆ ఓనర్ ఎవరో గానీ…
– పుష్ప సీక్వెల్ నిర్మాతల ఎదుట సాగిలబడి… అడ్డగోలు రేట్లు పెట్టి… ఎడాపెడా ప్రీమియర్ షోలకు అనుమతించి… అవీ ఇష్టారాజ్యం టైమింగులతో… ప్రిరిలీజుకు వందల పోలీసులతో బందోబస్తులు పెట్టి… ప్రభుత్వం ఎందుకు ఊడిగం చేసినట్టు..? ఏ ప్రజాప్రయోజనం ఉంది దీనిలో..? నాలుగు డబ్బులు సంపాదించుకునే నిర్మాతల యావకు పోలీసులు ఎందుకు సహకరించినట్టు..?
– సరే, చేశారు… సంధ్య థియేటర్ వద్ద అదే బందోబస్తు, ముందస్తు జాగ్రత్తలు ఎందుకు లేవు..? అసలు అల్లు అర్జున్ అక్కడికి రావడానికి పోలీస్ పర్మిషన్ ఉందా..? అవసరమా..? పరిస్థితి అదుపు తప్పాక లాఠీఛార్జి చేశారు, కానీ అక్కడి దాకా రానివ్వడమే తప్పు కదా… ఈ విషాదం తరువాత కేసు నమోదు చేశారు… ఇలాంటి కేసుల్లో ఏదీ ఎప్పుడూ తేలదు… వార్త రాసుకోవడానికి తప్ప..!!
– హీరోలను దైవస్వరూపుల్ని చేస్తూ, ఆకాశానికెత్తుతూ, వాళ్ల పట్ల క్రేజ్ పెంచుతుూ… దాంతో కోట్లకుకోట్లు మింట్ చేసుకునే ఇండస్ట్రీ పెద్దలది కూడా తప్పే… థియేటర్లు, ఎగ్జిబిటర్ల సిండికేట్ వైఫల్యమూ ఉంది… (అసాధారణంగా నిన్న ఈనాడు కూడా ఓ పెద్ద వ్యాసం రాయడం ఆశ్చర్యాన్ని కలిగించింది… ప్రి-రిలీజ్ ప్రమోషనా..?)
– ఇలా అరయక కర్ణుడీల్గె అనేకుల చేతన్… అవును, రేవతి చావుకు… కాదు, హత్యకు ఎందరో హంతకులు… అందరికీ అశుభాకాంక్షలు..! హాస్పిటల్‌లో విషమస్థితిలో ఉన్న ఆ పిల్లాడు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆశిస్తూ… ( ఆ నిర్మాత ఎవరో గానీ… ఉసురు ఖాయం… ఇంతకుమించి మనం ఇంకేమీ చేయలేం కాబట్టి…)
.
Share this Article