.
ఓ డిజిటల్ పత్రికలో బ్యానర్ హెడింగ్… “కట్ చేస్తే”… సూపర్… ఆప్ట్ హెడింగ్ ఇది… సినిమా భాషలోనే ఉంది… నిజంగానే సీన్ కట్ చేస్తే…. మొత్తం సీనే మారిపోయింది…
రేవంత్ రెడ్డి ఇగో దెబ్బతిన్నది, ఇండస్ట్రీ తీరుతో తను చాలా అసంతృప్తితో ఉన్నాడు, తన ముఖ్యమంత్రిత్వాన్ని అసలు ఇండస్ట్రీ గుర్తించడం లేదు, పైగా వేదికల మీద ఇన్‌సల్ట్ చేస్తున్నారు అనే వాదనలు ఎన్ని ఉన్నా…
Ads
నాగార్జున ఫంక్షన్ హాల్ కూల్చివేత, మోహన్‌బాబు ప్లస్ కొడుకులపై కేసుల నమోదు, పుష్పరాజ్ అరెస్టు, సమంత-కేటీయార్ ఇష్యూలో నీచ వ్యాఖ్యలు… అన్నీ చకచకా జరిగిపోతూ… హైదరాబాదులో సినిమా పరిశ్రమకు ఇక శుభం కార్డు పడ్డట్టే అనే ప్రచారం దాకా వెళ్లిపోయింది…
అబ్బ, మొనగాడురా, తోపు… మబ్బుల్లో తామే దేవుళ్లమని పిచ్చి భ్రమల్లో విహరించే ధన పిశాచాల్ని నేల మీదకు దింపాడు రేవంత్, కాళ్ల దగ్గరకు రప్పించుకున్నాడు అని పొగిడినవాళ్లూ ఉన్నారు… ఆహా, ఇకనైనా కాస్త సినిమా ఇండస్ట్రీ అరాచకం, తుచ్ఛమైన కథాంశాలు, వెగటు సీన్లు, విలనిజం గ్లోరిఫికేషన్, జనం దోపిడీ తదితర సాంస్కృతిక పొల్యూషన్ తగ్గుతుందని భావించిన అల్ప సంతోషులూ ఉన్నారు…
మోహన్‌బాబు అరెస్టు తప్పదు, బన్నీ బెయిల్ రద్దు తప్పదు అనే దాకా ఊహాగానాలు సాగాయి… ఎస్, సీన్ కట్ చేస్తే… ఒకవైపు ఢిల్లీలో ఓ బలమైన లాబీయింగ్, ఇక్కడ దిల్ రాజు అనే పక్కా వ్యాపారి రంగంలోకి దిగడంతో సీన్ ఛేంజ్… ప్రస్తుతానికి ఈ అల్పపీడనం తీరం దాటిందనే వాతావరణమే కనిపిస్తోంది…
పైకి చూడబోతే… తప్పయిపోయింది… ఫైర్ ఫ్లవర్ అయింది… పుష్పరాజ్ తలదించి, నేలకు దిగాడు… విక్టిమ్ ఫ్యామిలీకి 2 కోట్ల ‘ పరిహారం ‘…. మృతురాలు రేవతి భర్త ద్వారా కేసు వాపస్ అట… అంతేనా..? అర్జెంటుగా దిల్ రాజు ఇండస్ట్రీ ముఖ్యులతో ప్రభుత్వ ముఖ్యులతో భేటీ ఏర్పాటు చేశాడు… ఈ రోజే…
పొద్దున్నే ఓ షార్ట్ న్యూస్ యాప్‌లో ఓ సమాచారం… 36 మంది బృందం ప్రభుత్వ ముఖ్యులను కలుస్తుందట… హీరోలు వెంకటేశ్, నితిన్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ అట… దర్శకులు త్రివిక్రమ్, హరీశ్ శంకర్, అనిల్, బాబీ, వంశీ… నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ అట…
నిర్మాతలు, సిండికేట్ల సభ్యులు సరే, కానీ ఈ జాబితాలోని హీరోలు, దర్శకుల రేంజ్ ఏమిటో రేవంత్‌కు తెలుసా..? వీళ్లా ఇండస్ట్రీని శాసించేది..? ఫాఫం, రేవంత్… సరే, సీన్ కట్ చేశారు… కానీ ఈ మొత్తం వ్యవహారంలో, ఈ మొత్తం సినిమా కథలో పిచ్చి బకరాలు అయ్యింది ఎవరు…? ఇంకెవరు..? జనం… ప్రేక్షక జనం…
ఈ రాజీలు చెల్లించిన మూల్యం ఎంత..? లోలోపల ఏం జరిగిందనే లోగుట్టు పెరుమాళ్ళకెరుక… తెర అసలు బాగోతాలన్నీ తెర వెనుకే కదా జరిగేది..! నిజంగానే సీన్ డ్రమెటిక్, సినిమాటిక్ మార్పులు కనిపిస్తే, ఆ ప్రభావాన్ని వేరే కోణాల్లో చూడాల్సి ఉంది… ఇదే దిల్ రాజు మళ్లీ ఇదే ప్రభుత్వంతో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు… అడ్డగోలు టికెట్ రేట్ల పెంపు, ఎక్కువ షోల పట్ల సానుకూలతకు దింపగలిగితే…
ఫస్ట్ ఇజ్జత్ కోల్పోయేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం… అంతేకాదు, ఏ ప్రభుత్వమైనా సరే మేం వంచగలం, దించగలం అని ఇండస్ట్రీ పెద్దలు తలలు, కాలర్లు ఎగరేసే సిట్యుయేషన్… పైన చెప్పుకున్న ఇండస్ట్రీ దుర్లక్షణాలన్నీ మరింత పెచ్చరిల్లడం ఖాయం…
‘‘సంధ్య థియేటర్ తొక్కిసలాట- ఒక పుష్పరాజ్’’ అనే ఈ కథలో రేవతి, శ్రీతేజ్ బాధితులే, విషాదమే… కానీ అంతిమంగా బాధితులు ఎవరు..? ఇంకెవరు..? సొసైటీయే…!! డియర్ రేవంత్ రెడ్డి సాబ్… ఈ సినిమా హిట్టా..? ఫ్లాపా..?! పుష్ప2 మార్క్ థియేటర్ వసూళ్ల లెక్కల్లో కాదు, సర్కారు జనంలో కోల్పోయే పరువు లెక్కల్లో…!!
ఎహె, కాదు, కాదు… అసలు కథ ముందుంది, ఇది చిన్న ట్విస్ట్ మాత్రమే, సీక్వెల్ కోసం వేచిచూడండి అంటావా..? గుడ్… గో ఎహెడ్..!!
Share this Article