గగన్ నారంగ్, మేరీ కోమ్, సైనా నెహ్వాల్, పీవీ సింధు, మీరాబాయ్ చాను, లవ్లీనా బోర్గెయిన్.. వీళ్లంతా ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించిన వాళ్లే. ఒకప్పుడు ఇండియన్ అథ్లెట్లు ఒలింపిక్స్‌కు వెళ్లామా.. వచ్చామా అన్నట్లు ఉండేది. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో కేడీ జాదవ్ రెజ్లింగ్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచాడు. ఆ తర్వాత 1996లో లియాండర్ పేస్ టెన్నిస్‌లో, 2000లో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్‌లో బ్రాంజ్ గెలిచే వరకు మనకు వ్యక్తిగత పతకాలే రాలేదు.
2008లో అభినవ్ బింద్రా తొలి సారి వ్యక్తిగత గోల్డ్ మెడలిస్ట్‌గా చరిత్ర సృష్టించాడు. 2004 ఏథెన్స్ ఒలంపిక్స్ వరకు ఇండియాకు వస్తే ఒకటి లేదంటే సున్నా.. అంతకు మించి పతకాలు గెలవడం గగనమే అయ్యేది. బీజింగ్‌లో మాత్రం తొలి సారి మూడు పతకాలు గెలిచింది. అభినవ్ బింద్రా షూటింగ్‌లో గోల్డ్ గెలవగా.. విజేందర్ సింగ్ బాకింగ్స్‌లో, సుశీల్ కుమార్ రెజ్లింగ్‌లో కాంస్య పతకాలు గెలిచారు.
2012 నుంచి రాత ఎలా మారింది?
2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత అథ్టెట్లు ఆరు పతకాలు గెలిచారు. అంతకు ముందు ఏం జరిగింది? ఇండియాలో టాలెంట్ ఉన్నా.. ఎంకరేజ్ చేసే వాళ్లు తక్కువ. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలను చదివించడమే భారం. ఇక వాళ్లకు క్రీడల్లో శిక్షణ ఎక్కడ ఇప్పించగలరు. మన దేశంలో క్రికెట్‌కు తప్ప వేరే క్రీడల వైపు వెళ్లినా.. స్పాన్సరర్లు అంత త్వరగా ముందుకు రారు. నువ్వు ఏదైనా అంతర్జాతీయ వేదిక మీద పతకం సాధిస్తే తప్ప క్రీడాకారుల వెంట పడరు.
Ads
ఈ పరిస్థితిని గమనించిన భారత బిలియర్డ్స్ ప్లేయర్ గీత్ సేథీ, బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాశ్ పదుకొనెలు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఓజీక్యూ) అనే నాన్ ప్రాఫిట్ స్పోర్ట్స్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ వీరేన్ రస్కీనా ప్రస్తుతం ఓజీక్యూకి ఎండీ అండ్ సీఈవోగా ఉన్నారు. 2010లో టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్, చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఈ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్‌లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా చేరారు.
మంచి టాలెంట్ ఉండి.. పతకం సాధించే సత్తా ఉన్న క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇప్పించడమే ఈ ఓజీక్యూ ప్రధాన లక్ష్యం. నాణ్యమైన కోచ్‌లు, ఆహారం, కిట్లు ఈ సంస్థ క్రీడాకారులకు ఉచితంగానే అందించింది. విదేశీ కోచ్‌లను ఓజీక్యూ నిధులతో ఏర్పాటు చేసింది. ఓజీక్యూకు మొదటి నుంచి జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్ తోడుగా ఉంది.
2012 ఒలింపిక్స్ టార్గెట్‌గా అనేక మంది క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణను ఇప్పించింది. ఈ క్రమంలో విజయ్ కుమార్ (షూటింగ్), గగన్ నారంగ్ (షూటింగ్), సైనా నెహ్వాల్ (బ్యాడ్మింటన్), మేరీ కోమ్ (బాక్సింగ్) పతకాలు గెలిచారు. లండన్ ఒలింపిక్స్‌లో 6 పతకాలు రాగా.. అందులో నాలుగు పతకాలు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ద్వారా శిక్షణ పొందిన వారే గెలవడం గమనార్హం.
2016 రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు సిల్వర్ గెలవడం వెనుక కూడా ఓజీక్యూ సంస్థ ఉన్నది. సింధుకు అవసరమైన తోడ్పాటును ఓజీక్యూ అందించింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మీరాబాయ్ చాను, రవికుమార్ దహియా, పీవీ సింధు, లవ్లీనా బోర్గెయిన్ వెనుక ఉన్నది కూడా ఓజీక్యూనే.
ఇండియాలో సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), ఐవోఏ (ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్) ఉన్నా.. అవి ప్రత్యేకంగా ఒక క్రీడాకారుడిపై కోట్లాది రూపాయలు వెచ్చించవు. పైగా అక్కడ ఉండే రాజకీయాలు అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలోనే ఓజీక్యూ తెరపైకి రావడం.. సత్తా చాటే అవకాశం ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణను ఇప్పించడంతో భారత్ పతకాల వేట షురూ అయ్యింది. కేవలం సాధారణ క్రీడాకారులకే కాకుండా పారాలింపిక్స్‌లో పాల్గొనే వారికి కూడా ఓజీక్యూ అండగా నిలుస్తోంది. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ తరపున ఒక గోల్డ్, ఏడు సిల్వర్, రెండు బ్రాంజ్ పతకాలను పారాలింపియన్స్ గెలవడం వెనుక ఓజీక్యూనే ఉన్నది.
వినేశ్ ఫొగట్‌కు అండగా..
భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ ప్యారీస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరుకున్నది. స్వర్ణం లేదా రజతం పక్కా గెలిచే అవకాశాలు ఉన్నాయి. రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా వినేశ్ రికార్డు సృష్టించింది. అయితే ఐదేళ్ల నుంచి వినేశ్ ఫొగట్‌కు అన్ని రకాలుగా ఓజీక్యూ అండగా ఉన్నది. 2018లో వినేశ్ కోసం హంగేరియన్ కోచ్ వోలర్ అకోస్‌ను నియమించింది. టెక్నికల్ కోచ్‌గా వోలర్‌కు అత్యంత అనుభవం ఉన్నది. అతని భార్య కూడా రెజ్లరే. రెండు సార్లు ఆమె హంగేరీ తరపున ఒలింపిక్స్‌లో పాల్గొన్నది. 2018 నుంచి వినేశ్‌కు పర్సనల్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని ఖర్చు మొత్తం ఓజీక్యూ భరించింది.
టోక్యో ఒలింపిక్స్‌లో వినేశ్ విఫలం అవడంతో ఇదే కోచ్‌పై రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్ తీవ్రమైన విమర్శలు చేశాడు. వినేశ్‌కు వోలర్ సరిగా కోచింగ్ ఇవ్వలేదని.. అతడు కోచ్‌గా పనికి రాడని మీడియా ముందు నోరు పారేసుకున్నాడు. అయినా సరే వినేశ్ కోరిక మేరకు ఓజీక్యూ అతడినే కోచ్‌గా కంటిన్యూ చేసింది. హంగేరి, బెంగళూరు, మొహలీ తదితర ప్రాంతాల్లో వినేశ్ కోచింగ్ సాగింది.
గత ఏడాది రెజ్లర్ల నిరసనల ఫలితంగా చాలా కాలం కోచింగ్‌కు దూరంగా ఉన్నది. అయినా సరే కోచ్ వోలర్ ఆమెకు వెన్నంటి ఉన్నాడు. నిన్న రాత్రి సెమీస్‌లో వినేశ్ గెలవగానే వోలర్ ఒక్కసారిగా కంటతడి పెట్టాడు. ఆరేళ్లు ఆయన పడని మాట లేదు.. అతడిని తిట్టని రెజ్లింగ్ ఫెడరేషన్ సభ్యుడు లేడు. కానీ వినేశ్, ఓజీక్యూ పెట్టుకున్న నమ్మకాన్ని వోలర్ వమ్ము చేయలేదు.
రాహుల్ ద్రవిడ్ పాత్ర ఏంటి?
మన క్రీడాకారుల కోసం విదేశీ కోచ్‌లను తీసుకొని రాగలం.. కానీ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ఉన్న స్పోర్ట్స్ సెంటర్లను ప్రభుత్వమే నిర్మించాలి. క్రికెట్ స్టేడియంలను అడిగితే వెంటనే స్థలాలు ఇచ్చే ప్రభుత్వాలు.. ఇతరులు ఎవరైనా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామంటే వెంటనే ఒప్పుకోదు. ఈ క్రమంలో కర్ణాటకా రాష్ట్ర బ్యాడ్మింటన్ చాంపియన్ వివేక్ కుమార్ ఒక అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సెంటర్ నిర్మించాలని భావించారు.
గతంలో ఆయనకు ప్రకాశ్ పదుకునే బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటులో అనుభవం ఉంది. దీంతో క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్, బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాశ్ పదుకొనె సహకారంతో బెంగళూరులో 16 ఎకరాల విస్తీర్ణంలో పదుకొనె-ద్రవిడ్ సెంటర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సెలెన్స్ (పీడీసీఎస్ఈ)ని 2017లో ఏర్పాటు చేశారు.
అంతర్జాతీయ స్థాయి క్రీడా సౌకర్యాలు ఈ సీఎస్ఈలో ఉన్నాయి. ఫిఫా ప్రమాణాలతో నిర్మించిన ఫుట్‌బాల్ గ్రౌండ్, ఐసీసీ ఆమోదించిన క్రికెట్ గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం, ఇతర క్రీడల కోసం ప్రత్యేక నిర్మాణాలు ఇందులో ఉన్నాయి. ఓజీక్యూ ప్రతిపాదించిన క్రీడాకారులతో పాటు ఇతర టాలెంటెడ్ అథ్లెట్లకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు.
అభినవ్ బింద్రా నేతృత్వంలో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ కూడా ఉన్నది. క్రీడాకారులకు కేవలం శిక్షణ మాత్రమే కాకుండా మెంటల్ హెల్త్, స్పోర్ట్స్ సైన్స్ వంటి ఇతర విభాగాల్లో కూడా పూర్తి స్థాయి శిక్షణ ఇస్తారు. పడుకొనె, రాహుల్ ద్రవిడ్ ఈ సెంటర్ కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వినేశ్ ఫొగట్, లక్ష్య సేన్‌లు ఒలింపిక్స్ కోసం ఇక్కడే సన్నద్దం అయ్యారు. అంతే కాకుండా అనేక మంది ఔత్సాహిక క్రీడాకారులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు.
ప్రభుత్వాలు చేయాల్సిన పనిని కొందరు మాజీ ఒలింపియన్లు, క్రీడాకారులు చేస్తుండటం గమనార్హం. వివిధ కార్పొరేట్ కంపెనీల నుంచి నిధులు సమకూర్చుకొని ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచేలా క్రీడాకారులను తయారు చేస్తున్నారు. క్రికెట్‌లో పెట్టుబడి పెడితే కోట్లాది రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నా.. రాహుల్ ద్రవిడ్ మాత్రం ఇతర క్రీడల్లోని ఆణిముత్యాలను వెలికితీసే పనిలో తాను భాగస్వామి అయ్యాడు.
రాబోయే రోజుల్లో ఓజీక్యూ, పీడీసీఎస్ఈ ద్వారా మరిన్ని పతకాలు గెలవడం ఖాయమే. ఇలాంటి సెంటర్లు ప్రతీ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే.. ఇండియా కూడా ప్రతీ ఒలంపిక్స్‌లో డబుల్ డిజిట్ మెడల్స్ సాధించే స్థాయికి తప్పకుండా ఎదుగుతుంది. [ కవర్ ఫోటో : ఫొగట్‌కు కోచింగ్ ఇస్తున్న వోలర్ ] {Article :: జాన్ కోరా }
Share this Article