.
నూరు సంవత్సరాల క్రితం, టెన్నిస్ ఆటను మహిళలు పరిశుభ్రమైన తెల్లని స్కర్ట్‌లు మరియు టీ-షర్టులలో ఆడుతుంటే…, ఒక భారతీయ మహిళ తెల్లని సాంప్రదాయ చీరె ధరించి ఆ ఆటను ఆడింది… స్పూర్తిదాయక విజయాల్ని కూడా పొందింది… ఆమె పేరు మెహెర్‌బాయ్ టాటా…
పార్సీ శైలిలో చీరె ధరించినప్పటికీ, ఆమె కోర్టు మీద అద్భుతమైన చురుకుదనాన్ని ప్రదర్శించింది. భారతదేశంలోని వివిధ టోర్నమెంట్‌లలో ఆమె 60 కంటే ఎక్కువ బహుమతులను గెలుచుకుంది.
Ads
మెహెర్‌బాయ్ 1879 అక్టోబర్ 10న బొంబాయిలో జన్మించింది. ఆమె తండ్రి హోర్ముస్‌జీ జె. భాభా…, ఉన్నత విద్య కోసం ఇంగ్లండ్‌కు వెళ్లిన మొదటి పార్సీలలో ఒకరు. ఆమె కుటుంబం బెంగళూరుకు మారినప్పుడు, ఆమె బిషప్ కాటన్ స్కూల్‌లో చదువుకుంది… అక్కడ ఆమెను “మెహ్రీ” అనే ముద్దు పేరుతో పిలిచేవారు…
1884లో, ఆమె తండ్రి మైసూర్‌లోని మహారాజా కాలేజీకి ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. అతని మార్గదర్శకత్వంలో, మెహ్రీ ఆంగ్లం, లాటిన్‌లో రాణించింది… సైన్స్ తరగతులకు కూడా హాజరైంది. 16 సంవత్సరాల వయస్సులో ఆమె మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది…
టాటా కుటుంబంలోకి ప్రవేశం
1898 ఫిబ్రవరి 14న, మెహెర్‌బాయ్ టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ స్థాపకుడు జమ్‌సెట్జీ ఎన్. టాటా పెద్ద కుమారుడు దొరాబ్‌జీ టాటాను వివాహం చేసుకుంది. ఆయన 1900లో తన భార్యకు 245.35 క్యారెట్ల జూబ్లీ డైమండ్‌ను బహుమతిగా ఇచ్చాడు, దానిని ఆమె ముఖ్యమైన సామాజిక కార్యక్రమాలకు హాజరైనప్పుడు గర్వంగా ధరించేది…
అయితే, తర్వాత ఆమె ఆ డైమండ్‌ను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (టిస్కో) కోసం నిధుల సేకరణ కోసం విక్రయించింది. ఆమె నిస్వార్థ చర్య ఆమె కుటుంబ సభ్యులచే ఎంతగానో ప్రశంసించబడటమే గాకుండా టాటా గ్రూప్ కంపెనీల ఉద్యోగుల ప్రేమను, కృతజ్ఞతను సంపాదించింది.
దొరాబ్‌జీ ఎవరు…?
ఆమె భర్త దొరాబ్‌జీ కూడా గొప్ప విజయాలు సాధించిన వ్యక్తి. అతను క్రీడలను ఎంతగానో ఇష్టపడేవాడు, భారతీయ ఒలింపిక్ ఉద్యమం ఏర్పాటులో మార్గదర్శకుడు. 1920లో భారతదేశం తొలిసారిగా ఒలింపిక్ క్రీడలలో పాల్గొనడానికి నిధులు సమకూర్చడంలో, భారత బృందాన్ని పంపడంలో అతను కీలక పాత్ర పోషించాడు…
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు, దొరాబ్‌జీ క్రికెట్‌లో రాణించాడు, చాలా సంవత్సరాలపాటు ఆ ఆటను ఆడాడు. అతను పార్సీ జింఖానా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు, ఇంగ్లండ్‌లోని ఇండియన్ జింఖానా క్రికెట్ క్లబ్‌కు స్పాన్సరర్…
ఆయన భార్య మెహెర్‌బాయ్ టాటా 1923లో ఆ క్లబ్‌లో మొదటి మహిళా సభ్యురాలైంది. అంటే…ఇది క్రికెట్ పవిత్ర స్థలిగా ఎంచే లార్డ్స్ లో మేరీలీబోన్ క్రికెట్ క్లబ్ (MCC) మహిళలను సభ్యులుగా అంగీకరించడానికి 75 సంవత్సరాల ముందు జరిగింది…
దొరాబ్‌జీకి బ్రిటిష్ రాజు గౌరవం…
1910లో, భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి అతను చేసిన కృషికి గాను బ్రిటిష్ రాజు కింగ్ ఎడ్వర్డ్ VII దొరాబ్‌జీ టాటాను నైట్ బిరుదుతో సత్కరించారు. అప్పటి నుండి ఆయన సర్ దొరాబ్‌జీ టాటాగా, మెహ్రీ లేడీ మెహెర్‌బాయ్ టాటాగా పిలువబడ్డారు..
మెహెర్‌బాయ్ చీరె ధరించడంలో చూపిన గర్వం అనేక దేశభక్తి కలిగిన ప్రేక్షకుల నుండి ప్రశంసలను, ప్రేమను సంపాదించింది. ఆడనప్పుడు, ఈ జంట కొన్నిసార్లు వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ పోటీలను ఆసక్తిగా చూసేవారు. అటువంటి సందర్భాలలో కూడా, ఆమె ఎల్లప్పుడూ తెల్లని చీరెల్లోనే కనిపించేది…
1929లో, చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్, సాధారణంగా సర్దా యాక్ట్ అని పిలువబడే చట్టం అమలులోకి వచ్చింది. దీనికి ఎక్కువ ఘనత భారతదేశంలోని మహిళా ఉద్యమకారులకు, అందులో లేడీ మెహెర్‌బాయ్ టాటాకు కూడా దక్కుతుంది. ఆమె దీని కోసం భారతదేశంలో మరియు విదేశాలలో చురుకుగా ప్రచారం చేసింది…
మధ్య వయస్సులో ఆమెకు లుకేమియా సోకినట్లు నిర్ధారణ అయింది మరియు ఆమె నార్త్ వేల్స్‌లోని రూతిన్‌లో ఒక నర్సింగ్ హోమ్‌లో చేరింది, అక్కడ ఆమె 1931 జూన్ 18న కన్నుమూసింది. ఒక సంవత్సరం తర్వాత, సర్ దొరాబ్‌జీ టాటా తన భార్య మెహెర్‌బాయ్ జ్ఞాపకార్థం లేడీ టాటా మెమోరియల్ ట్రస్ట్‌ను స్థాపించాడు…
ఈ ట్రస్ట్ రక్త సంబంధ వ్యాధులపై శాస్త్రీయ పరిశోధనలకు నిధులు సమకూరుస్తుంది, ముఖ్యంగా లుకేమియాపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఎప్పుడూ తెల్ల చీరె ధరించిన ఈ భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి, ఆమె భర్త చేసిన కృషి ఇప్పటికీ వేలాది దేశవాసుల ముఖాల్లో సంతోషాన్ని మరియు ఉపశమనాన్ని తెప్పిస్తోంది… (ఒక ఇంగ్లిషు స్టోరీకి ఓ నాసిరకం అనువాదం ఇది…)
Share this Article