‘‘ఏమైంది సార్… సీఎం ఎవరో తేల్చలేక సిగపట్లు, అగచాట్లు… రోజుకు పదిసార్లు ఆ కేసీయారే నయం అనుకునేలా చేస్తారు కాంగ్రెసోళ్లు’’ అని ఓ మిత్రుడు మెసేజ్ పెట్టాడు… ఒకింత నిజమే… కానీ కాంగ్రెస్‌కు వోటేసినవాళ్లకు తెలియదా..? అది కాంగ్రెస్ అని… ఇదంతా కాంగ్రెస్‌లో సహజమేనని… కేసీయార్‌ను వద్దనుకునే కదా, బీజేపీ కూడా బీఆర్ఎస్ బాపతేనని తెలిసే కదా, కాంగ్రెస్‌ను గెలిపించుకుంది…
ఐనా ఇదేమైనా కుటుంబ పార్టీనా..? తాత కాకపోతే తండ్రి, తండ్రి కాదంటే కొడుకు, కొడుకు వద్దంటే మనమడు… లేదా బిడ్డలు, లేదా అల్లుళ్లు… ఇదేమైనా రాజరికమా..? అదొక జాతీయ పార్టీ… ఆశావహులు చాలామంది… గెలిచిన 64 మందికీ సీఎం కావాలనే ఆశ ఉంటుంది… గెలవనివాళ్లకూ ఉంటుంది… కుర్చీలో కూర్చోగానే ఎమ్మెల్సీ అయిపోయి పెత్తనాలు చేయవచ్చు… అసలు ఆశలు లేనివారెవరు… రాజకీయాల్లో లేనివాళ్లకూ సీఎం కావాలనే ఆశ, కల ఉంటుంది… కల గంటే తప్పేముంది..?
ఐనా మొన్న గెలిచిన మూడు రాష్ట్రాల్లో సీఎంలు ఎవరో అంతటి బీజేపీయే ఖరారు చేయలేకపోతోంది కదా… రాజస్థాన్‌లో రాణి వసుంధర రాజె పెంటపెంట చేస్తోంది ఆల్‌రెడీ…
Ads
నిజం చెప్పాలంటే… బీజేపీలో, కాంగ్రెస్‌లో ఇన్నేళ్లూ కేసీయార్ కోవర్టులదే రాజ్యం… రేవంతుడొక్కడే కాంగ్రెస్‌లో కేసీయార్‌తో ఢీ అంటే ఢీ అన్నాడు… మొండి, ఏటికి ఎదురీదగలడు… కాకపోతే నోటిదూల ఎక్కువ… మరీ ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రస్తుతం రేవంత్ అవసరం కాంగ్రెస్‌కు ఉంది, కాంగ్రెస్ కాదనుకుంటే రేవంత్ ఏం చేస్తాడనేది అనూహ్యం… బీజేపీ (ఏబీవీపీ), టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్… తనకు ఈ పార్టీలన్నీ పరిచితాలే…
పైగా తను పీసీసీ పగ్గాలు చేపట్టాకే పార్టీకి ఊపొచ్చింది… రాష్ట్రమంతా తిరిగాడు… ఈ ఉత్తమ ఉత్తుత్తి రెడ్డిలు తమ చేతుల్లో పీసీసీ పగ్గాలు ఉన్నప్పుడు ఏం ఉద్దరించారు..? కొత్తగా కోమటిరెడ్డిలు ఏం ఉద్దరిస్తారు..?
కాంగ్రెస్ గనుక తనను సీఎం చేయకపోతే, రేవంత్ ఊరకే కూర్చుంటాడని అనుకోలేం… తన తత్వం వేరు… సొంత కుంపటి పెడతాడా..? పెట్టాలని అనుకుంటే మూడింట రెండొంతులు చీల్చాలి… అంటే దాదాపు 44 మంది… అది సాధ్యమేనా..,? సరే, సాధ్యమే అనుకుందాం… కానీ మెజారిటీ సరిపోదు కదా… ఇంకా 16 మంది కావాలి… బీఆర్ఎస్ నుంచి అంతమందిని కొనడం అసాధ్యం… బీజేపీకి కూడా 8 మందే ఉన్నారు, మజ్లిస్ కేసీయార్ దోస్తేనాయె…
పోనీ, ఓ కొత్త పార్టీ ఏర్పాటు చేసి, పరిస్థితులు అనుకూలించేదాకా సైలెంటుగా ఉంటాడా..? దాంతో వచ్చే ఫాయిదా ఏముంది..? అధికారంలోకి వచ్చే చాన్స్ లేకపోతే తన వెంట ఏ ఎమ్మెల్యే రాడు… సో, వస్తే గిస్తే బీఆర్ఎస్ నుంచి హరీష్ రావాలి, తను వచ్చే పరిస్థితే వస్తే షిండే అవుతాడు తప్ప, రేవంత్‌కు ఎందుకు ఉపయోగపడతాడు…? ఐనా కేసీయార్ యాక్టివ్‌గా ఉన్నన్నిరోజులూ హరీష్ ఆ మామ వెంబడే ఉంటాడు… అందులో డౌట్ లేదు… ఓ మిత్రుడు ఓ ఉదాహరణ చెప్పాడు… అదేమిటంటే..?
‘‘అస్సోం సీఎం హిమంత విశ్వ శర్మ… మొదట్లో కాంగ్రెసే… స్టేట్‌లో సిట్యుయేషన్ చెప్పాలని రాహుల్ ఇంటికెళ్తే, పెంపుడు కుక్కకు బిస్కెట్లు వేస్తూ అసలు ఈ నాయకుడిని దేకలేదు… అవమానంతో అస్సోం తిరిగి వెళ్లిన ఈయన్ని బీజేపీ పికప్ చేసుకుంది… పార్టీ సిద్ధాంతం ప్రకారం ముందుగానే సీఎం అభ్యర్థిగా చెప్పలేం కానీ నువ్వే తదుపరి సీఎం అన్నారు… ఇది అద్వానీ బీజేపీ కాదు కదా… ఇప్పుడున్నది అమిత్ షా బీజేపీ కదా…
తరువాత ఏం జరిగింది..? కాంగ్రెస్ మట్టిగరిచింది… ఎవరిని రాహుల్ దేకలేదో ఆయన ఏకంగా అస్సోం సీఎం అయ్యాడు… సో, కాంగ్రెస్ అవసరమున్న నాయకుల్ని కాపాడుకోవాలే తప్ప వేరే గత్యంతరం లేదు… కాంగ్రెస్ ఏదో ఊడబొడుస్తుందని అనుకున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మట్టిగరిచింది… ఈ స్థితిలో తెలంగాణలో కూడా చెడగొట్టుకుంటే దానికే నష్టం…’’
సో, ఏ కాస్త తప్పుటడుగు వేసినా కేసీయార్ ఫామ్ హౌజ్ నుంచి బయటికి వస్తాడు… తొక్కేస్తాడు… మళ్లీ కాంగ్రెస్ లేవడం కష్టం… పార్టీకి రాబోయే జనరల్ ఎలక్షన్లలో డబ్బులు సర్దాల్సింది కర్నాటక, తెలంగాణ మాత్రమే… రాహుల్‌కు ఇవన్నీ అర్థం చేసుకునేంత సీన్ లేదు, కానీ డీకే శివకుమార్‌కు తెలుసు… తనే ఇప్పుడు పార్టీలో చక్రధారి… అందుకే తెలంగాణ గెలుపును ఈనగాచి నేల పాలు కానివ్వడు…
అంటే రేవంత్ మరో హిమంత అవుతాడా..? కాడు, కాలేడు… అదేదో ఎన్నికలకు చాలా ముందు జరిగి ఉండాల్సింది… ఉన్న రెడ్లను, రాబోయే రెడ్లనే తెలంగాణ బీజేపీ కాపాడుకోలేదు… చేరికల కమిటీ చైర్మన్ ఈటల కూడా ఉంటాడో లేడో తెలియదు… పార్టీలో పాతుకుపోయిన నేతలు మిగతావాళ్లను రానివ్వరు, రానివ్వలేదు… దీన్ని ప్రక్షాళన చేయాల్సిన బీజేపీ అలాంటి వాళ్లకే మళ్లీ కిరీటాలు పెట్టింది… సో, ఇప్పుడున్న స్థితిలో రేవంత్‌ను వద్దనుకుంటే రేవంత్ చేయగలిగేది ఏమీలేదు… రేవంత్ గనుక పార్టీని వద్దనుకుంటే పార్టీ కూడా చేయగలిగేది ఏమీ లేదు…
కానీ రాహుల్ నుంచి స్పష్టమైన హామీ ఉంది కాబట్టి, సీఎల్పీ మీటింగ్ కూడా తననే సీఎం కావాలని కోరింది కాబట్టి… రేవంత్ మాత్రమే సీఎం అవుతాడని మనం అనుకోవాల్సిందే… ఈరోజు రేపు అష్టమి నవమి కాబట్టి, దశమి పూట తను సీఎం కాబోతున్నాడని అనుకోవాల్సిందే… కాకపోతే ఈ సిట్యుయేషన్స్ గమనిస్తూ… ఫామ్ హౌజ్‌లో కూర్చున్న కేసీయార్ పకపకా నవ్వుతూ ఉంటాడు బహుశా…
Share this Article