మజ్లిస్ గనుక సిటీ మొత్తం పోటీచేసినా…. సమయానికి కొన్ని ఏరియాల్లో సెటిలర్లు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వకపోయినా… ఎన్నికలకు బీజేపీకి మరో నెల వ్యవధి దొరికినా……. మొన్నటి గ్రేటర్ కథ వేరే ఉండేది…! కేసీయార్ పార్టీకి ఎంత నామర్దా ఉండేదో, ఎంత నామోషీ అయ్యేదో… పతనం ఎక్కడికి దిగజారేదో ఊహించుకోవాల్సిందే… తెలంగాణవాదం అమితంగా ఉండే దుబ్బాకలో బీజేపీ ఎలా గెలిచింది..? గ్రేటర్లో అధికార పార్టీ ఎందుకంత దెబ్బతిన్నది..? బోలెడు విశ్లేషణలు, సూచనలు, సలహాలు గట్రా నడుస్తూనే ఉన్నయ్… కారణాల్లో అతిముఖ్యమైంది కేసీయార్ పాలనతీరుపై ప్రజల వ్యతిరేకత… మిగతావన్నీ తరువాత చెప్పుకునే కారణాలు మాత్రమే… మరి ఆ వ్యతిరేకత ఎందుకొచ్చింది… బోలెడు కారణాలు… వాటిల్లో రీసెంటు ముఖ్యమైన కారణాలు… ఎల్ఆర్ఎస్, ధరణి, రిజిస్ట్రేషన్ల బంద్ ఎట్సెట్రా…
ఏ ప్రభుత్వమైనా ఈ కరోనా పీడదినాల్లో ప్రజలకు అండగా ఉండాలని అనుకుంటుంది… అప్పోసప్పో చేసి, నిధులు కూడగట్టి బండి నడిపించడానికి ట్రై చేస్తుంది… అది ప్రభుత్వ బాధ్యత కూడా… కష్టకాలంలో అండగా ఉండకపోతే అది సంక్షేమ ప్రభుత్వం అని ఎలా అనిపించుకుంటుంది..? ఈమాత్రం కూడా ఈ ప్రభుత్వం ఆలోచించలేదు… ప్రజలపై భారం మోపడానికి రెడీ అయిపోయింది… గతంలో నగరాలకే పరిమితమైన లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీంను ప్రతి పట్టణం, ప్రతి ఊరి దాకా పాకించారు… ఆస్తుల సర్వే అన్నారు… వ్యవసాయేతర భూములకూ పాస్ పుస్తకాలు అన్నారు… అసలు ఏం జరుగుతున్నదో జనానికి అంతుపట్టని అయోమయాన్ని ఒక్కసారిగా కమ్మేశారు…
Ads
ఎలాగోలా నాలుగు డబ్బులు జమచేసుకుని, ఆడపిల్ల పెళ్లి కోసమో, పిల్లల చదువుల కోసమో మదుపు చేస్తే… కొన్నిచోట్ల భూమి అసలు విలువకు ఎక్కువ కట్టేలా క్రమబద్ధీకరణ రేట్లు, చివరి గడువులు… తరమడాలు… క్రమబద్ధీకరణ చేయించుకోకపోతే ఇక రిజిస్ట్రేషన్లు ఉండవ్, కొనేవాడు ఉండడు అంటూ బెదిరింపులు… ఈ ఒత్తిడి కోసం వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల బంద్… ఇది జనం గురించి ఆలోచించే ప్రభుత్వమేనా అసలు..? పైగా దీనికి ప్రతి స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమర్థనలు, పత్రికల్లో యాడ్స్… ప్రచారాలు… ఇది జనంలో బాగా అసంతృప్తికి దారితీశాయి… ఎల్ఆర్ఎస్ ఇంకా రాబోయే రోజుల్లో కేసీయార్ బండిని నిండా ముంచేయబోతోంది… మధ్యతరగతిలో దానిపై తీవ్ర వ్యతిరేకత ఉంది…
కనీసం జనం ఏమని అనుకుంటున్నారో కూడా తెలుసుకునే దిక్కులేదు… వేలాదిమంది కొలువులు పోయినయ్, జీతాలు కత్తిరించబడ్డయ్, చిన్న వ్యాపారాలు మూతపడ్డయ్, జనం అలోలక్ష్మణా అంటున్నారు… ఈ స్థితిలో ఈ ఎల్ఆర్ఎస్ పిడుగులు అవసరమా..? కనీసం ఒక్కసారైనా జనం కోణం నుంచి ఆలోచించిందా ఈ ప్రభుత్వం…? ధరణి కుప్పకుప్ప అయిపోయింది… అది సరిగ్గా పనిచేయదు… దీని కోసం ఏనాటి నుంచి తిప్పలు పడుతున్నారో గుర్తుందా ఈ సర్కారుకు..? ఎందుకు సరిదిద్దలేకపోతోంది..?
పైగా కొత్త రెవిన్యూ చట్టం పేరిట ఊరూరా టాంటాం ప్రచారాలు… కేసీయార్ ఫోటోను తలపై గంపలో మోస్తున్న రైతు… కేసీయార్‌కు మొక్కుతున్న ఆడ రైతు ఫోటో… పత్రికల్లో యాడ్స్… అసలు ఆ చట్టం చేసినవారైనా చెబుతారా దాని నిజమైన ప్రయోజనాలు ఏమిటో..? అది ఊరూరా రైతుల ఇంట్లో సిరులు కురిపించిందట… ఆనందాతిరేకాన్ని కలిగించిందట… ఇదే అతి ప్రచారం అంటే…! నగరం నుంచి ఊరు దాకా పాలన అంటేనే రెవిన్యూ వ్యవస్థ… దాని మీద అకారణ ద్వేషంతో… ప్రక్షాళన, సంస్కరణ బదులు మొత్తమే రద్దు చేయాలన్నట్టుగా చర్యలు… మొత్తం పాలన డిస్టర్బ్ అయిపోలేదా..?
అసలు జనం మూడ్ ఏమిటో, ప్రభుత్వం మీద, పార్టీ మీద జనం ఏమనుకుంటున్నారో ఒక్కసారి థర్డ్ పార్టీ ప్రైవేటు ఏజెన్సీతో సర్వే చేయించుకోలేకపోయిందా ఈ సర్కారు..? లేక తమ బలం మీద, తమ వ్యూహాల మీద అతి నమ్మకమా…? పోనీ, ఈ ధరణి, ఎల్ఆర్ఎస్, బీపీఎస్, సకల ఆస్తుల సర్వేలు, రిజిస్ట్రేషన్ల నిలిపివేత వంటి తప్పుడు సలహాలు ఇచ్చిందెవరు..? కేసీయార్‌ను పూర్తిగా తప్పుదోవ పట్టించింది ఎవరు..? తన కళ్లకు గంతలు కట్టిందెవరు..? ఈ ప్రశ్నలపై కేసీయార్లోనే అంతర్మథనం మొదలైంది… ఉద్యమకారుడి నుంచి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందడమే కేసీయార్‌కు అసలు దెబ్బ… తను జనం కోణం నుంచి ఆలోచించడం మరిచిపోయాడు… అది ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది తనకు కూడా… జనంలో తన మీద వ్యతిరేకత ఎందుకు పెరిగిందో, ముందుగా ఈ ధరణి, ఈ ఎల్ఆర్ఎస్ కథలేమిటో తవ్వుతున్నాడు… ఎవరిపైనో బలమైన వేటు పడుతుంది… అది పాలన యంత్రాంగం చీఫ్ పై కూడా పడొచ్చు… దిద్దుబాటు అనే దిశలో కేసీయార్ గండ్రగొడ్డలి పట్టుకుని ఎంతమేరకు సీరియస్‌గా అడుగులు వేస్తాడు అనేదే అసలు ప్రశ్న…!!
Share this Article