.
మహాభారతంలో వినిపించే ఓ ప్రశ్న జగత్ ప్రసిద్ధం … ద్రౌపది కురుసభకు వేసిన ప్రశ్న… ధర్మరాజు తనను జూదంలో ఓడిన విషాదంపై వేసిన ప్రశ్న… నన్నోడి తన్నోడెనా..? తన్నోడి నన్నోడెనా..?
లగచర్లలో భూసేకరణ రద్దు అనే వార్తలో సర్కారు నిర్ణయం చదివాక చటుక్కున మెదిలిన ప్రశ్న అదే… నిజానికి స్థూలంగా భూసేకరణ మొత్తం రద్దు అని కాదు… ఫార్మా కోసం భూసేకరణ రద్దు, కానీ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు ఉంటుంది… దానికి విడిగా వేరే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తారు…
Ads
టెక్నికల్‌గా ఏమున్నా సరే… ఇక్కడ మేం చేసింది తప్పే, ఫార్మా పేరిట మా అడుగులు తప్పే అని ప్రభుత్వం లెంపలేసుకుంటున్నదా..? ఆ అల్లర్ల వెనుక కేటీయార్ ఉన్నాడని చెప్పారు కదా మరి… నో, నో, మాదే తప్పు, కేటీయార్ పోరాటంలో తప్పులేదు అని అంగీకరిస్తున్నట్టేనా..?
డీకే అరుణ పోరాటం ఫలించిందని బీజేపీ… మా ప్రయత్నాలు, మా నిరసన ఫలించాలయిన వామపక్షాలు కూడా ఓన్ చేసుకుంటున్నాయి… ఐనా..? నిజంగా ప్రభుత్వం మెడలు వంచాయా ప్రతిపక్షాలు..? జనం ఉరిమితే ప్రభుత్వం దిగిరాకతప్పదనే నిజానికి ఓ సంకేతమా..? అవునూ, కేటీయార్ గెలిచాడా..? రేవంత్ గెలిపించాడా..?
జనం తిరుగుబాటు వెనుక ఉన్న కేటీయార్ గెలిచాడు అనుకోవాలా..? జనాన్ని కన్విన్స్ చేయలేక చివరకు రద్దు నిర్ణయానికే మొగ్గిన ప్రభుత్వమే మరో కోణంలో ఓడిపోయింది అనుకోవాలా..? ఏది నిజం..?
సరే, గెలుపోటముల మాటెందుకు గానీ… తప్పుల్ని అంగీకరించి, దిద్దుకునే బ్రాడ్ మైండెడ్, డెమొక్రటిక్, పీపల్స్ ప్రభుత్వం మాది అని కూడా కనీసం చెప్పుకునే సోయి లేదు ప్రభుత్వానికి రాజకీయంగా…! అలా చెప్పుకుంటే మొదట తప్పు చేశామని అంగీకరించినట్టే అవుతుంది కదా… సో, ఈ మొత్తం వ్యవహారంలో పార్టీల రాజకీయాలు కాదు… గెలిచింది ప్రజలు… బాధితులం అవుతామనే సోయి… ఉమ్మడి పోరాటం…
ఇథనాల్ ఫ్యాక్టరీ కథ వేరు… అదొక ప్రైవేటు ఫ్యాక్టరీ… అనుమతించకూడని ఇథనాలేతర ఉత్పత్తులకూ తనే పర్మిషన్ ఇచ్చాడు అని తాజాగా అధికారపక్షం నుంచి వినిపించే ఆరోపణ… ఎందుకు..? అది మాజీ మంత్రి శ్రీనవాసయాదవ్ కొడుకు, అల్లుడు భాగస్వాములుగా ఉన్న కంపెనీ కాబట్టి అట..! నో, నో, అది శ్రీనివాస యాదవ్‌ది కాదు, మాది అంటాడు పుట్టా సుధాకర్ యాదవ్…
తను టీడీపీ… గతంలో టీటీడీ అధ్యక్షుడిగా ఎంపికై, కొన్నాళ్లకే రాజీనాామా చేశాడు… శ్రీనివాస్ యాదవ్, సుధాకర్ యాదవ్ వియ్యంకులే కదా… సరే, తను టీడీపీ కదా… అంటే చంద్రబాబు మనిషే కదా… చంద్రబాబు రేవంత్‌రెడ్డికి శ్రేయోభిలాషే కదా… ప్రత్యర్థి కాదు కదా… ఐనా ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు అన్నాడేమిటి..?
కేసీయార్ అక్రమంగా ఇచ్చిన అనుమతులు కాబట్టి రద్దు చేశారా..? శ్రీనివాస్ యాదవ్ రాజధాని నగరంలో కాంగ్రెస్‌కు తస్మదీయుడే కాబట్టి ఆ కోణంలో రద్దు చేశారా..? జనంలో మనం పలుచన కావడం దేనికి అనుకుని ప్రజాకోణంలో రద్దు చేశారా..? ఏ కోణంలో చూసినా సరే, ఇదీ జనం గెలుపే…!! ఇంతకీ ఈ రెండు అంశాల్లోనూ రాజకీయంగా గెలిచింది ఎవరు..? ఓడింది ఎవరు..? అసలు ఇందులో గెలుపు అంటే ఏమిటి..?!
Share this Article