ఆ చైనావాడు ఎంత బుకాయించినా… ఆ చైనా భక్తగణం ఇక్కడ ఎన్ని వక్రబాష్యాలతో చైనాను వెనకేసుకొస్తున్నా… ఆ WHO వాడు కూడా ఏ ప్రలోభంతోనో చైనాకు దాసోహం అంటున్నా… ప్రపంచాన్ని –ంక నాకించేసిన కరోనా వైరస్ చైనా వాడి సృష్టేననీ, వుహాన్ ల్యాబులో తయారు చేసే జీవాయుధం లీకై విశ్వమంతా వ్యాపించిందనీ ఇప్పుడు ప్రతి దేశమూ నమ్ముతోంది… గత ఏడాది జనవరిలోనే మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నాం… వుహాన్ మీద రకరకాల వార్తలు వస్తూనే ఉన్నయ్… ఈ స్థితిలో వైరస్ వ్యాప్తి మీద వచ్చిన పలు సినిమాల్ని జనం మళ్లీ మళ్లీ చూస్తున్నారు… మాట్లాడుకుంటున్నారు, సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు… రాబోయే ఫ్యామిలీ మ్యాన్ మూడో సీరీస్ కూడా దానిపైనే అని చెబుతున్నారు దర్శకులు… ప్రత్యేకించి చైనా వాడు వైరస్‌ను జీవాయుధంగా ప్రయోగించడం అనే పాయింటు మీదే వచ్చిన ఓ సినిమా ‘సెవెంత్ సెన్స్’…
ధర్మప్రచారం కోసం బోధిధర్ముడు ఒంటరిగా చైనా వెళ్తాడు… ధర్మప్రచారానికి వెళ్లేవాళ్లకు మార్షల్ ఆర్ట్స్‌లోనూ, సంప్రదాయ వైద్యంలోనూ ప్రవేశం, నైపుణ్యం అప్పట్లో సహజం… చైనాలోని ఓ పల్లెలో వైరస్ వ్యాప్తి చెందుతూ జనం పిట్టల్లా పడిపోతుంటారు… మందు లేదు, బతికి ఉన్నవాళ్లను సైతం బయటపడేసి రావడమే… తల్లి వదిలేసిన ఓ చిన్న పిల్లను బోధిధర్ముడు తను ఉంటున్న ఓ గుహలోకి తీసుకువెళ్లి, చికిత్స చేసి రక్షిస్తాడు… క్షేమంగా తీసుకొచ్చి ప్రజలకు చూపిస్తాడు… ఈ సీన్లన్నీ సినిమా విడుదలైన పదేళ్ల తరువాత ఇప్పుడు చూస్తున్నా సరే, బాగా కనెక్టవుతాయి మనకు… ఆ పల్లె మీదపడిన దుండగులను ఒక్కడే నిలువరించి, పారిపోయేలా కొట్టడం… అక్కడి వాళ్లందరికీ యుద్ధవిద్యలో శిక్షణ ఇవ్వడం… తరువాత బోధిధర్ముడి నిర్యాణం వరకూ సినిమా భలే ఉంటుంది… ఎటొచ్చీ…
Ads
సినిమాలో మనకు నీరసం తెప్పించే అంశాలు కొన్ని ఉన్నయ్… దర్శకుడు మురుగదాస్ ఎక్కడెక్కడ దారితప్పాడంటే..? హీరోయిన్గా శృతిహాసన్ ఎంపిక, ఆమెను తెర మీద చూస్తున్నంతసేపూ విసుగు కలుగుతుంది… మరోవైపు సూర్య తనదైన శైలిలో ఇరగదీసేస్తుంటాడు… బోధిధర్ముడి వారసుల డీఎన్ఏ ఆధారంగా మళ్లీ అప్పటి ‘‘శక్తిమంతుల్ని’’ సృష్టించాలనే ప్రయోగాలు క్రియేటివ్ స్వేచ్ఛ అనుకుని రాజీపడినా… ఇది తెలిసిన చైనా ఉలిక్కిపడటం మరీ అసహజం… అంతేకాదు, బోధిధర్ముడికి ఓ విశేష విద్య తెలుసు… ఎదుటివాళ్ల కళ్లల్లోకి చూసి, లోబరుచుకోవడం… కానీ సూర్య ఆచూకీ తెలుసుకుని చంపేయాలని చైనా నుంచి వచ్చే విలన్‌కు కూడా ఆ విద్య తెలుసు… తను పలు సీన్లలో అది ప్రయోగిస్తూ అందరినీ లోబరుచుకుంటూ ఉంటాడు… విలన్‌ను హీరో చంపడంతో కథను అర్థంతరంగా ముగిస్తాడు దర్శకుడు… చైనావాడి కుట్ర, ఫాలోఅప్ ఇంకేమీ ఉండవ్ సినిమాలో… ఇవన్నీ మనకు సినిమా మీద ఆసక్తిని చంపేస్తాయి… వెరసి బోధిధర్ముడి ఎపిసోడ్ల వరకూ నచ్చిన సినిమా తరువాత అనాసక్తంగా మారిపోతుంది…
తను ఎంచుకున్న ఓ విశేషమైన కథకు కమర్షియల్ రంగులు, హంగులు అద్దే క్రమంలో మురుగదాస్ దారితప్పి ఓ మూస తమిళ స్టార్ హీరోయిజం పంథాలోకి వెళ్లిపోయాడు… కానీ హీరో ఆనాటి చైనా ప్రయాణం, నిర్యాణం దాకా దర్శకుడి ప్రతిభ ప్రతి షాట్లో కనిపిస్తుంది… ప్రస్తుత తరానికి వచ్చేసరికి కథలో సూర్య ఓ సర్కస్ పర్సనాలిటీ.., శృతిహాసన్ తనకు తెలీకుండా తనపైనే పరిశోధనలు చేస్తుంటుంది, ఈలోపు చైనా వాడు వైరస్ ప్రయోగిస్తాడు… వైరస్ ప్రయోగించడానికి, సూర్యను చంపడానికి ఓ విలన్… ఇదంతా సోసో… కానీ ఇప్పుడు చూస్తుంటే చైనా, వైరస్, జీవాయుధం అంశాలు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తయ్… నిజానికి బోధిధర్ముడు తమిళుడు, తమిళ వారసత్వం ఎంతో గొప్పది, ఆ మూలాల్లోకి వెళ్లాలి వంటి ఏదో కాన్సెప్టు కోసం ఈ కథను రాసుకున్నాడు దర్శకుడు… సగం వరకూ సక్సెస్… ఈ అరవ వాసన మన తెలుగువాళ్లకు అందుకే పెద్దగా కనెక్ట్ కాలేదేమో… సినిమా పెద్దగా ఆడలేదు అప్పట్లో…!!
ఈ సినిమానే ఎందుకు చాలామందికి గుర్తుకొస్తున్నది ఇప్పుడు అంటారా..? సినిమా కథ ప్రకారం చైనావాడి జీవాయుధాన్ని మనకు తెలిసిన ఆధునిక సైన్స్ ఎదుర్కోలేదు… ఆ టైంలో తన బోధిధర్ముడి వారస మూలాల్లోకి వెళ్లగలిగిన సూర్య నెల్లూరు ‘ఆనందయ్య మందు’ తరహాలో చకచకా మూలికలతో ఓ మందు తయారు చేసేస్తాడు… అది పనిచేస్తుందా లేదా ఆ సినిమా కథలో కూడా ఫాలోఅప్ కనిపించదు… మనం మునుపెన్నడూ ఎరుగని రీతిలో భీకరంగా సాగుతున్న ఈ కార్పొరేట్ దోపిడీతో… ఎవడైనా బోధిధర్ముడు మళ్లీ పుట్టుకొస్తే బాగుండు అని లోలోపల బలంగా కోరుకుంటున్నామా..?! కరోనా నుంచే గాకుండా ఈ కార్పొరేట్ వైద్యం బారి నుంచి జనాన్ని రక్షించడానికి ‘చరకసంహిత’ మాత్రమే శరణ్యమని నమ్ముతున్నామా..?!……. సరే, ఇవన్నీ వోెకే గానీ…. సోకాల్డ్ తెలుగు స్టార్ హీరోలూ…. ఇలాంటి పాత్రల్ని కలలు కనండర్రా…. మీ బతుకుల్లో డ్యాష్ డ్యాష్… (మరీ సైరా స్థాయిలో దడుసుకునే రేంజులో కాదు…)
Share this Article