Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ గ్రామీణ ఆర్టీసీ బస్సులు పుష్పక విమానమంత అద్భుతాలు..!!

October 30, 2025 by M S R

.

ఏసి స్లీపర్ బస్సు ప్రమాదాల నుండి ఏమి నేర్చుకుంటున్నాం..?

ఇది 1975- 80ల నాటి సంగతి. అప్పుడు మా లేపాక్షిలో బస్ స్టాండ్ ఉండేది కాదు. రోడ్డు పక్కన చెట్టు కింద బస్సు కోసం జనం నిరీక్షిస్తూ ఉండేవారు. దాంతో బస్సు అక్కడ మాత్రమే ఆగేది. అందువల్ల దాన్ని బస్ స్టాండ్ అని భ్రమపడి అందరూ అనడంతో అదే బస్ స్టాండ్ గా చలామణి అయ్యింది.

Ads

అక్కడ కూర్చోవడానికి బెంచీలు ఉండవు. ఎండలో ఎండాల్సిందే. వానలో తడవాల్సిందే. రెండు గంటలకో బస్సు వచ్చేది. మూడు ప్రయివేటు బస్సులుంటే ఒక ఆర్టీసి బస్సు ఉండేది. అయితే బస్సులో ఇసుకవేస్తే రాలనంతగా జనం ఉన్నా… అన్ని ఊళ్ళల్లో నిరీక్షిస్తున్న అందరినీ ఎక్కించేవాడు కండక్టర్.

అప్పుడది చాలా మామూలు విషయంగా అనిపించినా… ఇప్పుడు ఓ పుష్పకవిమానమంత అద్భుతంగా అనిపిస్తోంది. అంగుళం ఖాళీ లేని బస్సులో కండక్టర్ అలవోకగా అటు ఇటు తిరుగుతూ టికెట్లు వసూలు చేసేవాడు. కదులుతున్న బస్సులో చిన్న రేకుముక్కకు రబ్బరు బ్యాండ్ తో బిగబట్టిన కాగితం మీద చీమ తలకాయంత సైజులో కండక్టర్ టికెట్టు లెక్కలు ఎప్పటికప్పుడు రాయడం రాకెట్ సైన్సులా అనిపించేది.

ఎక్కడ బస్సు మలుపు తిరిగి ఒకరి మీద ఒకరు పడతారో, బస్సు ఎక్కడ గుంతలో పడుతుందో కండక్టరుకు తెలిసి అందుకనుగుణంగా వంగుతూ రాసుకుంటూనే ఉండేవాడు. అంటే ప్రయాణించే దారిలో అణువణువు అతడి దివ్యదృష్టికి స్పష్టంగా కనపడుతూ ఉండేది. కండక్టరు ఈలవేస్తే రెండూళ్లకు ఈలపాట రఘురామయ్య గానంలా వినిపించేది.

ప్రతి పల్లెలో ఆపుతూ లేపాక్షి నుండి హిందూపురానికి గంటన్నర, రెండు గంటల్లో తీసుకెళ్ళేవాడు. పద్నాలుగు కిలోమీటర్ల ప్రయాణంలో ఆగి ఆగి సకల భారతీయ గ్రామీణ జీవనం బస్సెక్కేది. పైన లగేజి అదనం. ఒక్కోసారి లగేజీతోపాటు ప్రయాణికులు కూడా బస్సుపైనే ఉండేవారు. తెలుగు విభక్తి ప్రత్యయాల ప్రకారం వారు బస్సు’లో’ కాకుండా ‘పైన’ఉన్నా బాధ్యతగా టికెట్టు తీసుకున్న సత్యకాలమది.

బస్సు ఆగితే గాలి ఆడక ఊపిరాగిపోయినట్లు ఉండేది. బస్సు కదలాగానే చల్లగా గాలి తగిలి… హాయిగా ఉండేది. ఇప్పటిలా గ్లాసు కిటికీలు లేవు. వర్షం పడితే రెగ్జిన్ బట్టను దించాలి. ఏ కిటికీకి రెగ్జిన్ బట్ట కిందికి దిగేది కాదు. దాంతో వర్షానికి తడవడం తప్ప ప్రయాణికులకు మరోమార్గం ఉండేది కాదు. చలికాలంలో కర్చీఫులో, టవళ్లో చెవులకు చుట్టుకునేవారు తప్ప కిటికీలు మూతపడేవి కాదు.

ఊరు దాటగానే మరో ఊరు వచ్చేలోపు టికెట్లు కొట్టాలి కాబట్టి పక్కన ఆపడం ఒక అలవాటుగా ఉండేది. ప్రయాణికులు కూడా విసుక్కుంటూ సహకరించేవారు. బస్సు కిటికీలన్నీ ఎప్పుడూ తెరిచే ఉంటాయి కాబట్టి ఆయా ఊళ్ళల్లో దొరికే పూలు, పళ్ళు, కాయలు, సోడాలు, పల్లీలు, బఠాణీలను గంపల్లో పెట్టుకుని అమ్ముకునేవారు. బస్సు ఆగగానే సకల వస్తు ప్రపంచం బస్సు చుట్టూ తిరిగేది.

పిల్లలు, బాగా సన్నగా ఉన్నవారు కిటికీ ద్వారా ఎక్కి, కిటికీలోనుండే దిగే సౌలభ్యం కూడా ఉండేది. బస్సు దారి మధ్యలో చెడిపోతే టికెట్టు వెనుక రాసిచ్చి… వేరే బస్సు ఎక్కించేవారు. రాత్రిళ్ళు గూడు లేని అనాథలు నైట్ హాల్ట్ బస్సుల్లోనే పడుకునేవారు. పల్లెల్లో అయితే కోళ్లు, కుక్కలు కూడా నైట్ హాల్ట్ బస్సుల్లో అలవాటుగా నిద్రపోయేవి.

యాభై మంది పట్టే బస్సులో 150 మంది ఎక్కినా ఏనాడూ ప్రమాదం జరగనిది… ఇప్పుడు 47 మందికి 47 మందే ఎక్కి కూర్చున్నా ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయో ఆలోచించాలి. ఇప్పుడంతా మూసుకుపోయిన ఏసి బస్సులు. లోపల గాలి లోపలివారే పీల్చాలి. బయట గాలి తగలదు. కిటికీలే ఉండవు. గ్లాసుతో అంతా సీల్డ్. ప్రమాదం జరిగితే ఒక్కరు కూడా తప్పించుకోవడానికి వీల్లేకుండా దుర్భేద్యమైన బస్ బాడీ బిల్డింగ్.

ఎక్కడో యూరోప్ లో అక్కడి అద్దంలాంటి అతి నాజూకు రోడ్లకు తయారైన లోలెవెల్ బస్సులు మన దేశం రోడ్ల మీద అలాగే నడుపుతూ ఉంటాం. “కదిలే శవ పేటికలు” అని ఆ ఏసి స్లీపర్ బస్సులకు వినకూడని పేరు వచ్చినా పట్టించుకోము. చైనాలాంటి దేశాలు ఏనాడో ఏసీ స్లీపర్ బస్సులను నిషేధించినా మనం భయపడము.

నాలుగు వరుసలు, ఆరు వరుసల రహదారులైనా తాగి నడిపేవారిని ఆపలేము. అడ్డొచ్చి పడిపోయే బైకులను, పశువులను అడ్డుకోలేము. గంటకు నూట ముప్పయ్, నూట యాభై కిలోమీటర్ల వేగంతో నడిపే హెవీ వెహికిల్ డ్రయివర్ కు లైసెన్సే లేకపోయినా మనకేమీ పట్టదు.

రాజస్థాన్ రోడ్డో, కర్నూల్ రోడ్డో దారి ఏదైనా కాలి బూడిదైనవి అత్యంత విలువైన ప్రాణాలు. ప్రమాదాలు జరిగినప్పుడు రెండు వారాలు హడావుడి చేసే రవాణా శాఖ, మీడియా తరువాత స్లీపింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. మరో బైక్ తాగి స్లీపర్ బస్సుకింద పడడానికి నడిరాతిరి చీకట్లో నిరీక్షిస్తూ ఉంటుంది.

“లోకమేన్నడో చీకటాయెలే…
నీకిది తెలవారని రేయమ్మా!”

అన్న రాలిపోయే పాట నేపథ్యంలో సాగిపోయే ఏసి స్లీపర్ బస్సులెన్నో!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ట్రంపులమారి మళ్లీ ఏసేశాడు… అసలు ట్రేడ్ డీల్ చిక్కులేమిటంటే..?!
  • హికమత్, ఇంగితం కలిస్తేనే… ప్రాణహితం… తెలంగాణ ప్రయోజనం…
  • ధరల పెంపు దేనికి..? ప్రేక్షకులను ఎందుకు దోచుకోనివ్వాలి..?
  • ఆ గ్రామీణ ఆర్టీసీ బస్సులు పుష్పక విమానమంత అద్భుతాలు..!!
  • అయోధ్య..! గుడి నిర్మాణం సంపూర్ణం..! ఒక అధ్యాయం సమాప్తం..!!
  • రాఫెల్ పైలట్ శివాంగీ సింగ్ అసలు జీవిత స్వప్నం ఏంటో తెలుసా..?!
  • పవర్ ఫుల్ సినిమా పెన్… ఓ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం…
  • జాన్వి స్వరూప్..! నో, శ్రీదేవి వారసురాలు కాదు… మంజుల వారసురాలు…!!
  • గ్రేట్ నికోబార్…! ఇక ‘ఆ మూక’ మొత్తం దీనిపై పడి ఏడుస్తోంది..!!
  • ఎవరు ఈ ధూల్‌పేట లేడీ గంజాయ్ డాన్ అంగూర్ బాయ్..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions