అమిత్ షా ఒకరిని కలిశాడు అంటే… దాని వెనుక ఏదో తన పార్టీ ప్రయోజనం ఉండి ఉంటుంది తప్పకుండా…! ఏ ఎత్తుగడా లేకుండా ఒక్క అడుగు కూడా వేయడు… సో, ఆర్ఆర్ఆర్‌లో బాగా నటించావని జూనియర్‌ను ఎన్టీయార్‌ను పిలిచి భోజనం పెట్టాడు, ఏదో మర్యాద కోసం రామోజీరావును కలిశాడు అనే ప్రచారాలు అబద్ధం… అంత పనిలేకుండా లేడు అమిత్ షా… ప్రతి భేటీ వెనుక ఓ లెక్క ఉంటుంది… కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే…
ఇప్పటిదాకా రామోజీరావు పాలసీ ఎలా ఉంటోంది..? జగన్ పట్ల మరీ దూకుడుగా వ్యతిరేకతతో ఏమీ పోవడం లేదు… అటు చంద్రబాబు మీద ప్రేమను ప్రదర్శిస్తూనే, జగన్ పట్ల వ్యతిరేకతను కాస్త తక్కువ రేంజులోనే కనబరుస్తున్నాడు… మరీ ఆంధ్రజ్యోతి తరహాలో బజారులో నిలబడి బట్టలిప్పి నర్తించడం లేదు… కేంద్రం పట్ల వ్యతిరేకత కూడా లేదు… కావాలని విరుచుకుపడేది లేదు, అలాగని ఊరుకున్నట్టుగా కనిపించేదీ లేదు…
ఎటొచ్చీ కేసీయార్ పట్ల మెతక ధోరణితో వెళ్తున్నాడు… తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ కేసీయార్ పట్ల భయభక్తులే… అందరూ తన ఇంటికి, తన వద్దకు రావాలని కోరుకునే, రప్పించుకునే రామోజీరావు తనే స్వయంగా కేసీయార్ వద్దకు వెళ్లాడు ఓసారి… కేసీయార్ ఆ రేంజులో భయాన్ని నింపాడు… పైగా రామోజీరావు ఆర్థికసామ్రాజ్యం హైదరాబాదులోనే కేంద్రీకృతమై ఉంది… అసైన్డ్ భూములు, మార్గదర్శి ఎట్సెట్రా కేసులు ఉండనే ఉన్నాయి…
Ads
అదుగో ఈ స్థితిలో అమిత్ షా రామోజీరావును కలిశాడు… కేసీయార్‌నే ఇంకా సపోర్ట్ చేస్తుంటారా అనేది ప్రశ్న… కేసీయార్‌కు అనుకూలంగా ఉండే ఏ శక్తినైనా కత్తిరించాలనేది అమిత్ షా, మోడీ కృతనిశ్చయం… ఎలాగూ ఆంధ్రజ్యోతి కేసీయార్ పట్ల సానుకూలంగా లేదు… ఈనాడును కట్ చేయడం ఎలా..? సాక్షి ఎలాగూ మన జగన్ పత్రికే… ఈ మూడే తెలుగు మీడియాలో సింహభాగం… బట్, ఇదంతా బయటికి ఏదో ప్రచారం జరగడం అమిత్‌షాకు ఇష్టం లేదు…
ఆ దిశలో ఆలోచించి, విజయేంద్ర ప్రసాద్ ను పిలిచారు… తన ద్వారా జూనియర్ ఎన్టీయార్‌తో భేటీ ఏర్పాటు చేయబడింది… నీ పొలిటికల్ ఇంట్రస్టులు ఏమిటి అనడిగాడు… సీరియస్ నోట్‌లో కాదు… కాజువల్… ప్రస్తుతానికి సినిమాలు తప్ప నాకు వేరే ధ్యాస లేదు సార్ అన్నాడు జూనియర్… ఒకవేళ ఇంట్రస్టు ఉంటే, మాకు వదిలెయ్, ఎక్కడ ఎలా ఫిట్ చేయాలో మాకు వదిలెయ్ అని ఓ వెల్‌విషర్‌గా అమిత్ షా సూచన… ఏ స్థితిలోనూ తిరిగి జూనియర్ చంద్రబాబు వైపు, తెలుగుదేశం వైపు మళ్లకుండా చూడాలనేది ఒక మర్మం… మీడియా ఫోకస్ అంతా బీజేపీ అనుకున్నట్టుగానే జూనియర్‌తో భేటీపైనే ఉండిపోయింది తప్ప రామోజీతో భేటీ పెద్దగా ప్రచారంలోకి రాకుండా పోయింది…
ఒక్కసారి రామోజీరావు మార్గదర్శి కేసు గనుక సుప్రీంకోర్టులో కొట్టుడుపోతే, రామోజీరావును తిరిగి తమ చేతుల్లోకి తెచ్చుకోవడం కష్టం… అందుకే మార్గదర్శి కేసులో ఇంప్లీడ్ కావాలని జగన్‌కు సూచనలు… సో, eleventh hour లో అప్పటికప్పుడు జగన్ నిర్ణయం తీసుకున్నాడు… రెండేళ్లుగా ఉండవల్లి జగన్‌కు, కేసీయార్‌కు చెప్పిస్తూనే ఉన్నాడు… తను వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో ప్రభుత్వాలు అధికారికంగా ఇంప్లీడ్ కావాలని… అది వైఎస్ ఇంట్రస్టు ఉన్న కేసైనా సరే, రామోజీరావు మీద అంత వ్యతిరేకతతో పోదల్చుకోలేదు కాబట్టి జగన్ ఇన్నాళ్లూ పట్టించుకోలేదు… ఇప్పుడు తప్పలేదు…
మోడీషా సూచనలతో ఇంప్లీడయ్యాడు… కేసు మొదటికొచ్చింది… సెప్టెంబరుకు వాయిదాపడింది… ఇప్పటికిప్పుడు ఉండవల్లి సందేహించినట్టు లోకస్ స్టాండీ పేరిట కొట్టేసేంత సీన్ రాలేదు… ఇన్నేళ్లూ రామోజీ- కేసీయార్ దోస్తీ బాగానే నడుస్తోంది కాబట్టి కేసీయార్ ఉండవల్లి కోరికను లైట్ తీసుకున్నాడు… తెలంగాణ ప్రభుత్వం తరపున ఆ కేసులో ఇంప్లీడ్ కాలేదు… ఇప్పుడున్న స్థితిలో రామోజీరావును దూరం చేసుకోవాలని కేసీయార్‌కు లేదు… వాళ్ల దగ్గరితనాన్ని కత్తిరించాలనేది మోడీషా ప్లాన్…
ఏం స్ట్రాటజీలండీ బాబూ…!! అబ్బే, ఇవన్నీ ఉత్త కట్టుకథలు, ఊకదంపుడు ఉత్తుత్తి హంబగ్ అంటారా..? పోనీలెండి అలాగే అనుకుందాం… ఆర్ఆర్ఆర్‌లో జూనియర్ డ్రెస్సులు బాగున్నాయని చెప్పడానికి, ఈటీవీలోకి మళ్లీ సుడిగాలి సుధీర్‌ను తీసుకోవాలని అడగడానికి అమిత్ షా వాళ్లిద్దరినీ కలిశాడు… సరేనా..!!
Share this Article