రాష్ట్ర పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను హైకోర్టు నిలిపివేస్తూ ఇచ్చిన తాజా తీర్పుపై వార్తలు రాస్తూ… నిమ్మగడ్డకు షాక్, ఎదురుదెబ్బ అనే సాక్షి తరహా శీర్షికలు పెట్టడం పాత్రికేయ సంయమనం, ప్రమాణం కోల్పోయిన ప్రతిక్రియలు అవుతాయి… ! వ్యక్తుల ఉద్వేగాలు వేరు, వ్యక్తీకరించాల్సిన పద్దతీ మర్యాద వేరు…! అదుగో అక్కడే నిమ్మగడ్డ కూడా సంయమనం కోల్పోయాడు… రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహారాన్ని పర్సనలైజ్ చేశాడు… అక్కడ జరిగింది తప్పు…
ఎస్… తను ఏ ప్రభావాలకు లోనవుతున్నాడు అనేది ఇక్కడ చర్చనీయాంశం కాదు… ఆ చర్చలోకి మనం వెళ్లడం లేదు… జగన్ తనకు కులం రంగు పూయడం కూడా సమర్థనీయం అసలే కాదు… ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగింది కాదు… నిమ్మగడ్డపై మంత్రులు చేసే వ్యాఖ్యానాలు కూడా తప్పే… ఇష్యూ మీద మాట్లాడటం వేరు, వ్యక్తిని ఉద్దేశించి ఉద్దేశాలు ఆపాదించి మాట్లాడటం వేరు… తరువాత ఇది ముదిరిపోయింది… నిమ్మగడ్డ తొలగింపు, ఆయన పోరాటం, గెలుపు… అదంతా పక్కన పెడితే… ఆ తరువాత తను మరీ పర్సనల్గా తీసుకున్నాడు… రాష్ట్ర సర్కారును కెలకాల్సిందే అనుకున్నాడేమో…
Ads
తన పదవీకాలం త్వరలో పూర్తికాబోతోంది… మధ్యలో తనను పనిచేయనివ్వని 3 నెలల కాలాన్ని అదనంగా తనకు ఇవ్వాలని బహుశా తను రాబోయే రోజుల్లో అడుగుతాడేమో… అది వేరే కథ… అయితే తన పదవీకాలం పూర్తయ్యేలోపే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేసి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావించినట్టున్నాడు… (ఎంపీటీసీ, జెడ్పీటీసీ నోటిఫికేషన్ ఆల్రెడీ అమల్లో ఉంది)… కానీ ఇక్కడ ఒకటి మరిచిపోయాడు తను… అధికార యంత్రాంగం అంతా ఒకవైపు ఉంది… తనొక్కడు మాత్రమే ఒకవైపు ఉన్నాడు… (రాజకీయ పార్టీల అవసరార్థం స్వార్థ ధోరణులను కాసేపు పక్కనపెట్టేయండి…)
నిమ్మగడ్డ కోర్టులో గెలిచి, తన పదవిలోకి మళ్లీ వచ్చిన తరువాత జగన్ కూడా ఈ వివాదాన్ని వదిలేశాడు… నిమ్మగడ్డ జోలికి పోలేదు… సీఐడీ కేసును కూడా సీరియస్గా ఫాలోఅప్ చేయలేదు… తన పదవీకాలం అయిపోయేవరకూ సైలెంటుగా ఉండాలని అనుకున్నాడు… కానీ నిమ్మగడ్డ మళ్లీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను తెర మీదకు తెచ్చాడో… ఇక జగన్ తెలివిగా ఉద్యోగసంఘాల నేతలను రంగంలోకి దింపాడు… అవసరమైతే బహిష్కరిస్తాం, అంతేతప్ప ఎన్నికల విధులు ఇప్పట్లో మావల్ల కాదు అని అనిపించాడు… ఇంకోవైపు సాక్షాత్తూ ఎన్నికల సంఘం సిబ్బందే సెలవుపై వెళ్లిపోయారు… ఇవన్నీ కావాలని నిమ్మగడ్డను ఫ్రస్ట్రేషన్ వైపు నెట్టేయడమే… ఇక్కడే నిమ్మగడ్డ కాస్త సంయమనం పాటించాల్సింది… పైగా చీఫ్ సెక్రెటరీ ఎన్ఎండీఏను (National Disaster Management Act) ప్రస్తావిస్తున్నాడు… అంటే విపత్తు నిర్వహణ… ఆ చట్టం చాలా పవర్ఫుల్… ఇవి చూసుకోకుండా తన గతంలో ఆదేశించిన బదిలీలు ఏమయ్యాయని అడిగాడు… పైగా సుప్రీంకోర్టు చెప్పిన ‘సంప్రదింపులు’ అనే ప్రక్రియ అర్థవంతంగా ముగియకుండానే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాడు…
హైకోర్టు ఈ షెడ్యూల్ను పక్కన పెట్టేయడంలో హేతుబద్ధత ఉంది… ఎందుకంటే..? దాన్ని జగన్ అనే కోణంలో, జగన్ వర్సెస్ నిమ్మగడ్డ అనే కోణంలో చూడటం మానేయండి కాసేపు… ప్రస్తుతం కరోనా వేక్సినేషన్ మీద దేశం యావత్తూ దృష్టి పెట్టింది… అధికార యంత్రాంగం దాని మీద కాన్సంట్రేట్ చేయాల్సి ఉంది… ప్రజల ప్రాణాలే కదా ఏ పాలన వ్యవస్థకైనా అత్యంత ప్రాధాన్యత… మన రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ చెప్పేదీ అదే… జీవించే హక్కు…! దాన్ని డిస్టర్బ్ చేసే ఏ రాజ్యాంగబద్ధమైన చర్య అయినా సరే ఈ స్థితిలో చెల్లుబాటు కాదు… హైకోర్టు చెబుతున్నదీ అదే…
ఎన్నికల సంఘంలో జేడీ సాయిప్రసాద్ ఉద్యోగాన్ని తొలగించడం (సస్పెన్షన్ కాదు) మరో తీవ్రమైన చర్య… రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపడం దానికి అదనం… ఒక ఉద్యోగి అనారోగ్యంతో సెలవు పెడితే దాన్ని ఎలా తప్పుపడతారు..? (తెర వెనుక కారణాలు ఏమైనా ఉండనీ…) అది తన హక్కు… తను గాకపోతే మరో ఉద్యోగి వచ్చి పనిచేయాలి… అది సిస్టం… అంతేతప్ప, కోపంతో ఎన్నికల సంఘం కొలువు నుంచే తొలగించడం ఏమిటి..? ఇదీ కోర్టుకు వెళ్తే, మరో ఆసక్తికరమైన విచారణ జరిగే చాన్సుంది… ఎందుకంటే, ఎన్నికల సంఘం అధ్యక్షుడికి తనను రిమూవ్ చేసే అధికారం ఉందా అనే మరో కీలక ప్రశ్న ఎదుటకు వస్తుంది… నో, నో, ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు వెళ్తుంది… నిమ్మగడ్డ విజయం ఖాయం అంటారా..? ఏమో… ప్రజల ప్రాణాల్ని కాపాడే పనుల్లో ఉన్నాం, నాలుగురోజులు ఆగి ఎన్నికలకు మేం రెడీ అని రాష్ట్రప్రభుత్వం గనుక చెబితే… సుప్రీంకోర్టు నో, నో అని కొట్టేస్తుందా..? ఇంట్రస్టింగు డెవలప్మెంట్స్…!!
Share this Article