యాంటీ- సెంటిమెంట్… ఈ మాట ఎందుకంటున్నానంటే…? మనసుకవి, మన సుకవి అని పేరుపొందిన ఓ సెంటిమెంట్ రచయిత మీద ఓ చిన్న అసంతృప్తిని వ్యక్తపరచడం అంటే మాటలా..? యాంటీ- సెంటిమెంటే కదా…! ఏయ్, ఏమిటా ధైర్యం..? ఆచార్య ఆత్రేయ… అందులోనూ బాలచందర్ రాయించుకున్న ఓ పాటలోని కొన్ని వాక్యాల మీద యాంటీ- సెంటిమెంట్ రాతలా అని తిట్టేవాళ్లు కూడా ఉండొచ్చు… కానీ ఓ పాట వింటుంటే పదే పదే ఓ చరణం దగ్గర స్ట్రక్ అయిపోతోంది ఆలోచన…
అసలు అలా ఎలా రాశాడు తను..? తన ఉద్దేశం ఏమై ఉండొచ్చు..? అసలు సినిమా కథలో ఆమె పాత్ర ధోరణికీ, రాసిన రాతకూ పొంతన ఉందా అసలు..? మరి బాలచందర్ ఎలా ఒప్పుకున్నాడు..?
అది 1976… అంతులేని కథ అనే సినిమా విడుదలైంది… సంచలనం… ఆ కథ, పాటలు, డైలాగులు అన్నీ… ప్రత్యేకించి ఇవ్వాళ గొప్ప స్థాయికి చేరిన రజినీకాంత్, కమల్‌హాసన్, జయప్రద తొలి అడుగులు ఆ సినిమా… అందులో ఫటాఫట్ జయలక్ష్మిది ఒక పాత్ర… ఆమే ఈమె…
Ads
అసలు ఫటాఫట్ అనే పేరే ఈ సినిమాతో వచ్చింది ఆమెకు… ఓ పాట ఉంటుంది… అరె, ఏమిటి లోకం, పలుగాకుల లోకం… రాసింది ఆత్రేయ, పాడింది ఎల్లార్ ఈశ్వరి… ఆ పాత్ర మరీ స్పీడెక్కువ కేరక్టర్ అన్నమాట… యవ్వనం ఉన్నప్పుడే సుఖించాలి, ఈ నీతులు, గీతులు జాన్తా నై అనుకునే తత్వం… మనం కథలోకి పోవద్దు… కానీ ఆమె తత్వానికి తగినట్టుగా రాశాడు ఆ పాట… ఆత్రేయ ఏమంటాడంటే..?
మమతన్నది ఒట్టి పిచ్చి మనసన్నది మరో పిచ్చి
మనా గినా తోసిపుచ్చి అనుభవించు తెగించీ
…. సరే, ఆ పాత్ర తత్వం అది… ఈ మమతలు, మనసులు తొక్కలో పదాలు, తెగించి అనుభవించెయ్ అనేది ఆ కేరక్టర్… అలాగే…
….. హీరోయిన్‌ను కూడా మందలిస్తూ… నీ మొహం, ఎంత గానుగెద్దు చాకిరీ చేసినా విముక్తి లేదే సోదరీ, పరుల కొరకు గాకుండా పడుచు కోర్కెలు తీర్చుకోవే వయ్యారీ అన్నట్టుగా కర్తవ్యబోధ చేస్తుంది…
చీమలను చూచైనా నేర్చుకోవే స్వార్థమూ
వయసు కాస్త పోయినాక మనసున్నా వ్యర్థమూ…
…. ఇక్కడ చీమలను చూసి ఏం నేర్చుకోవాలో ఎవరికీ అంతుపట్టదు… సరే, సినిమా పేరే అంతులేని కథ కదా… అంతుపట్టని కథ అనుకుందాం కాసేపు…
తరువాత చరణం ఏమిటంటే..?
గీత గీచి ఆగమంటే సీత ఆగలేదుగా
సీత అక్కడాగివుంటె రామకథే లేదుగా
గీతలు నీతులు దేవుడివి కావులే
చేతగాని వాళ్ళు తాము వేసుకున్న కాపులే...
…. ఇక్కడే, ఇక్కడే… గీత గీచింది ఎవరు..? ఎందుకు..? ఆ గీతను సీత ఎందుకు దాటింది..? ఇక్కడ ఈ కేరక్టర్ విపరీత పోకడలకూ సీత గీత దాటడానికి సంబంధం ఏమిటసలు..? సీత గీతను దాటింది ఎవడో ఓ సన్నాసికి బిచ్చం వేయడానికి… అంతేతప్ప… ఏదో తప్పు చేయడానికి కాదు కదా..? అది రాస్తూ, పైగా ఆమె గీత దాటకపోతే రామకథ లేదని తేల్చేయడం ఏమిటి..? సీత కేరక్టర్‌ను కించపరచడం కాదా ఇది…
పైగా దేవుడు గీతలు గీయడు, నీతులు చెప్పడు… చేతగానివాళ్లు చెప్పుకునే బోడిమాటలు అనీ ఆత్రేయ తీర్మానించేస్తాడు… అంతేకాదు…
మరులు రేపు వగలు సెగలు మన్మధునీ లీలలు
మన్మధుని లీలలకు ప్రేమికులు పావులూ
సొగసులన్నీ సృష్టి మనకు ఇచ్చుకున్న పాచికలు
పాచికలు పారినపుడె పరువానికి గెలుపులూ..
…. ఈ మరులు, ఈ వగలు, ఈ సెగలు అన్నీ మన్మథుడి లీలలు… సృష్టి మనకు సొగసులు ఇచ్చినప్పుడు వాడేసుకోవడమే ఈ జీవితానికీ సార్థకత అంటాడు… సినిమా కథలో జయలక్ష్మి కేరక్టర్‌కు తగినట్టే ఉన్నాయి ఈ మాటలు… అక్కడి వరకూ వోకే… కానీ ఈ ధోరణిని సీత గీత దాటడానికి లంకె ఎందుకు పెట్టినట్టు ఆత్రేయ…
రాసి ప్రేక్షకులను, రాయక నిర్మాతలను ఏడిపించాడట ఆత్రేయ… ఆయన రాతల్లో ఇలాంటివి కొన్ని పాయసంలో పుడకల్లా… తనపై ఉన్న సదభిప్రాయాన్ని పోగొడతాయి… పోన్లెండి… లోకులు పలుగాకులు… ఏవేవో రాస్తారు… కూస్తారు… ఆత్రేయ భిన్నమేమీ కాదు…!!
Share this Article