…… పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించి… అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను, పాకిస్థానీలను తరిమేస్తాం…. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్య గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా సెగ పెంచింది… అందరికీ తెలుసు, పాతబస్తీ అంటే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏమీ కాదని…! అవేమైనా పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉండే ఉగ్రవాద శిబిరాలా..? లాంచింగ్ ప్యాడ్లా..? అసలు ఇక్కడ సర్జికల్ స్ట్రయిక్స్ అనే పదమే అర్థం లేనిది… ఐనా సరే, దేశాన్ని పాలించే ఓ అధికార పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆ మాటల్ని ఎందుకు ప్రయోగించాడు..? ఈ చర్చకు తెరలేపడం దేనికి..? తను ఏం ఆశిస్తున్నాడు..?
బండి సంజయ్ ఇలాంటి మాటలు మాట్లాడకపోతేనే ఆశ్చర్యం… తను అంతే… ఈ వ్యాఖ్యల ద్వారా ఉద్దేశపూర్వకంగానే కొన్ని ప్రయోజనాలు ఆశించాడు తను… అనాలోచితపు వ్యాఖ్యలు ఏమీ కావు… బండి తను అనుకున్న దారిలోనే వెళ్తోంది… 1) మతం, దేశభక్తి, విదేశీయులు అనే పదాల చుట్టూ గ్రేటర్ రాజకీయాన్ని తిప్పడం… 2) మళ్లీ మళ్లీ టీఆర్ఎస్ను మతం వైపే లాగడం… ఏదో ఒకటి స్పందించేలా చేయడం… 3) టీఆర్ఎస్, మజ్లిస్ దోస్తీని పదే పదే ఎక్స్పోజ్ చేయడం… 4) రోహింగ్యాలు, పాకిస్థానీలను వోట్ల కోసం మజ్లిస్ ఎంటర్టెయిన్ చేస్తున్నదనే డిబేట్ జరపడం.., 5) ఒవైసీ మీద ప్రేమతో కేసీయార్ సర్కారు దీన్ని పట్టించుకోవడం లేదనే చర్చను నగర ప్రజల్లో రేకెత్తించడం… 6) టీఆర్ఎస్ సోషల్ మీడియా టీం బీజేపీపై సంధించిన అన్ని అస్త్రాలకూ ఈ చర్చతో చెక్ పెట్టడం… 7) గ్రేటర్ ఎన్నికలు పూర్తిగా కిషన్‌రెడ్డి చేతుల్లోనే ఉండకుండా చూసుకోవడం.., 8) రాష్ట్ర అధ్యక్షుడిగా తన ఉనికిని నిరూపించుకోవడం… 9) మజ్లిస్ అనివార్యంగా దీనిపై స్పందించేలా చేయడం, దాన్ని మరింత రెచ్చగొట్టడం… 10) గ్రేటర్ ఎన్నికల ప్రచార తెర పైనుంచి కాంగ్రెస్‌ను తప్పించడం… 11) తరాలుగా ఇక్కడ స్థిరపడిన ఇతర రాష్ట్రాల ప్రజలా..? ఆంధ్రా సెటిలర్లా..? స్థానికులా..? అందులో ఏ కులం వాళ్లు ఎటువైపు అనే కోణాల నుంచి ఈ ఎన్నికల ఎజెండాను దారిమళ్లించి… మతం అనే ఏకైక కోణంలో హిందూ వోట్లను పోలరైజ్ చేయడం, ఎంతోకొంత తమకు మద్దతుగా కన్సాలిడేట్ చేసుకోవడం…
Ads
బీజేపీ సంజయ్ ఆశించినట్టే… వెంటనే కేటీయార్ స్పందించాడు… సంజయ్, నీకు బుద్ధుందా, ఏమయ్యా కిషన్రెడ్డీ, హోం మంత్రివి కదా, మరి నువ్వేమంటావు అంటూ కౌంటర్ అటాక్ చేశాడు… సేమ్, దుబ్బాకలో హరీష్‌రావును కూడా బీజేపీ నాయకులు ఇలాగే రెచ్చగొట్టారు… ఓ సందర్భంలో కిషన్‌రెడ్డి హుటాహుటిన ఎంట్రీ ఇస్తే, సంజయ్ సైలెంటుగా వెళ్లి దీక్షకు దిగాడు… పార్టీలోని ఇంటర్నల్ ఫైట్లపై తొందరపడకుండా… కామ్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు… ప్రచారం తన చుట్టూ కేంద్రీకృతం అయ్యేలా చూసుకోవడం సంజయ్ అవసరం.., అందుకే మొన్న వరదసాయం వివాదంలో నేరుగా వెళ్లి చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి దగ్గర దీక్షకు దిగడం… ప్రభుత్వాన్ని, మజ్లిస్‌ను ఇరిటేట్ చేయడం, టెంప్ట్ చేయడం… వేడి పెరగాలని పెట్రోల్ పోసే ప్రయత్నం… గ్రేటర్ బీజేపీ నాయకులు పార్టీలో ఇంకెవరినీ పనిచేయనివ్వరు, పార్టీలో ఉండనివ్వరు అనే వాదనల్ని పటాపంచలు చేసే ప్రయత్నం కూడా సంజయ్ అడుగుల్లోని భాగమే…
… సంజయ్ ఆశించినట్టుగానే ఒవైసీ స్పందించాడు… రాజకీయంగా మంచి అనుభవమున్న నేత కదా… బీజేపీ ట్రాపులో పడకుండా… దేశాన్ని ఆక్రమించడానికి చూస్తున్న చైనాపై సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి చేతనైతే… పాతబస్తీలో పాకిస్థానీలు ఎంతమంది ఉన్నారో బయటపెట్టండి అని ఎదురుదాడి ప్రారంభించాడు… ఇక్కడ ఎవరి వాదనలోని హేతుబద్ధత ఏమిటనేది కాదు… చర్చ ఎటువైపు వెళ్లినా సరే… చర్చ మాత్రం జరగాలి అనేదే సంజయ్ ఆలోచన… అదే జరిగింది… రోహింగ్యాలపై సిటీ ప్రజల ఫోకస్ పడింది…
రోహింగ్యాలు కాందిశీకుల్లాగా ఏమీ లేరు… ఇక్కడి వోటర్లుగా మారుతున్నారు… రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు పొంది స్థానికులైపోతున్నారు… ఈశాన్య రాష్ట్రాలు, బీహార్, బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లోకి వలసలు జరుగుతున్నట్టుగానే…! మతం కోణంలో వారిని మజ్లిస్ సపోర్ట్ చేస్తుందని బీజేపీ ఆరోపణ… ఇదుగో, ఇదే బండి సంజయ్ ఆశించిన డిబేట్… ఎక్స్ అఫిషియో వోట్లు, టీఆర్ఎస్-మజ్లిస్ దోస్తీ కారణంగా మేయర్ పీఠం సుదూరస్వప్నం అని బీజేపీకి తెలియక ఏమీ కాదు… కానీ తెలంగాణలో మూడోవంతు ప్రజలు ఉండేది హైదరాబాదులోనే… సిటీ, శివారు మున్సిపాలిటీల్లో తను విస్తరించాలని ఆశిస్తోంది… ఆ ప్రయత్నమే ఇది… లేకపోతే ఒక మున్సిపాలిటీ ఎన్నికలకు జాతీయ స్థాయి నేతలు కూడా ప్రచారానికి రావడం ఏమిటి..? ఇందుకే..! ఇంకాస్త పెట్రోల్ పోయడానికే…!!
నీకు సోయి ఉందా..? బుద్దుండే మాట్లాడుతున్నావా అని కేటీయార్ కస్సుమన్నాడు కదా… దానికి బండి సంజయ్ ట్వీట్ రిప్లై ఏమిటంటే…? ‘‘అక్రమ చొరబాటుదార్లపై “సర్జికల్ స్ట్రైక్” తప్పనిసరి… విదేశీ చొరబాటుదార్ల ఓట్లతో ఎన్నికల్లో గెలవడం మీరు కంటున్న పగటికల… కేవలం విదేశీ విద్రోహుల మీద కాదు… తెలంగాణ దోపిడీ దొంగల మీద కూడా సర్జికల్ స్ట్రైక్… అవినీతి, కుటుంబస్వామ్యం మీద కూడా సర్జికల్ స్ట్రైక్”… ఈ ట్వీట్ రైటర్ ఎవరో గానీ భలే దొరికాడు భాయ్ నీకు…!
Share this Article