తెలంగాణ వచ్చాక కూడా… పిల్లల సీట్లు, అందులోనూ మెడికల్ సీట్ల విషయంలో అదే అన్యాయం..? ఒకవైపు ఆంధ్రా ప్రభుత్వం ప్రత్యేక జీవో తెచ్చుకుని, ఆంధ్రా పిల్లలకు ప్రయోజనకరంగా వ్యవహరిస్తుంటే… తెలంగాణ సీట్లలో కూడా ఆంధ్రా పిల్లలే నిండుతుంటే కళ్లప్పగించి తెలంగాణ ఆరోగ్య యూనివర్శిటీ చూస్తూ ఊరుకుంది… ఇది అసమర్థతా..? నిర్లక్ష్యమా..? కుట్రా..? కేసీయార్ సర్కారుకు ఎందుకు పట్టలేదు..? పాలనానుభవం లేని జగన్ అంతగా చాకచక్యంగా జాగ్రత్తపడి, ఆంధ్రా సీట్లు తెలంగాణ పిల్లలకు పోకుండా చేసుకోగలిగితే… ఆ పని కేసీయార్ వల్ల ఎందుకు కాలేదు..?
ఈ ఏడాదే కనీసం 100 మంది తెలంగాణ పిల్లలకు అన్యాయం జరిగినట్టు డెక్కన్ క్రానికల్ మరో బాంబు పేల్చింది… ఈ సంఖ్య తక్కువేమీ కాదు… నీళ్లు ఆంధ్రాకే పోతున్నయ్, నిధుల్లేకుండా పోతున్నయ్, నియామకాలు సరేసరి… చివరకు అడ్మిషన్లలోనూ ఇదేనా..? 1969 నుంచీ తెలంగాణ జనాన్ని మోసపోయామన్న బాధకు గురిచేస్తున్న ప్రధానాంశాలు అడ్మిషన్లు, నియామకాలు… ఈరోజుకూ అదే… అదే…
Ads
ఈ విషయంలో పార్టీలు, మీడియా వైఖరి కూడా ఓసారి చూడాలి… ఆంధ్రా మీడియా కాబట్టి ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి అస్సలు మాట్లాడవు సరిగ్గా… నమస్తే తెలంగాణకు జనం అక్కర్లేదు… జాతీయ పత్రికలు అని గప్పాలు కొట్టుకునేవాటికి ఈ అన్యాయాలు కనిపించవు… డెక్కన్ క్రానికల్ వెలుగులోకి తెచ్చింది… కొంతలోకొంత వెలుగు పత్రిక కూడా బెటర్… కానీ..?
బీజేపీ ఎంత తిట్టిపోస్తున్నా సరే ఇలాంటి విషయాల్లో కాంగ్రెసే బెటర్… పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ స్పందించాడు… తరువాత గవర్నర్ తమిళిసై స్పందించి, తెలంగాణ ఆరోగ్య యూనివర్శిటీ వీసీని పిలిచి వివరాలు కనుక్కుంది… ఆమె ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియదు గానీ… ఈ విషయంపై బండి సంజయ్ స్పందన నిల్… ప్రతి చిన్న విషయం మీద ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు కదా… మరి ఇదెందుకు కనిపించలేదు…? తెలంగాణ మంత్రి ఈటల కూడా ఓ కమిటీ వేస్తాం అన్నాడు… కానీ ఈలోపు మూడు ఫేజుల కౌన్సిలింగు జరిగిపోయింది… కమిటీ దాకా దేనికి..? జరుగుతున్న నష్టం కళ్లెదుట ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే…!! అసలు తెలంగాణ సర్కారులో ఈ నిర్లిప్తత ఏంటి..?
అధికారులు నానారకాలుగా సమర్థించుకుంటారు… కానీ జరుగుతున్న నష్టం నిజమా కాదా..? ఈ ప్రశ్నకు మాత్రం జవాబు లేదు… ‘మా పార్టీలో చేరితో పవిత్రులు అయిపోతారు, 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు’… ఇవా ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడేవి..? పోతిరెడ్డిపాడు పొక్క, రాయలసీమ లిఫ్టు, మెడికల్ సీట్లలో అన్యాయం… ఇవి కాదా స్పందించాల్సినవి..? ఢిల్లీకి వెళ్లొచ్చాక కేసీయార్ సైలెంట్ అయిపోయినట్టుగానే… బండి కూడా ఆగిపోయిందా…? ఏదో మీదమీద చిన్నాచితకా అంశాల మీద కత్తులు తిప్పుతున్నట్టు నటించాలి, అంతేనా..? సేమ్, ఏపీలోలాగే…!!
Share this Article