.
[ – రమణ కొంటికర్ల – ] అణువంత దీపంతో… కొండంత వెలుగులు నింపే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాజెక్ట్ పై ప్రయోగాలు శరవేగంగా జరుగుతున్నాయి. 2005 నుంచి ఆ ప్రాజెక్టులో భారత్ కూడా భాగస్వామి కావడంతో పాటు.. భారత శాస్త్రవేత్తల సాయంతో ఇప్పుడా న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాజెక్టులో కీలకమైన మ్యాగ్నటిక్ వ్యవస్థ రూపొందడం విశేషం. ఇంతకీ ఏంటా న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాజెక్ట్ కథ..?
సూర్యుడు, నక్షత్రాల వెలుతురు సాయంతో భూమిపైన సురక్షితమైన, కార్బన్ రహిత విద్యుత్ వెలుగులు నింపే వనరుగా ఉపయోగించడమే ఈ అణువిద్యుత్ ఫ్యూజన్ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. తద్వారా ప్రపంచం ఎదుర్కొంటున్న భూతాపం నుంచి గట్టెక్కేలా.. అలాగే, ఇంధన కొరతకు ఒక శాశ్వత పరిష్కారం చూపేలా.. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా 30 దేశాలు జట్టు కట్టిన ప్రాజెక్ట్ ఇది.
Ads
అందులో ఏడు దేశాల కీలక భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ పై దశాబ్దాలుగా ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2033 వరకు అందుబాటులోకొచ్చే అవకాశముందంటున్న ఈ ప్రాజెక్ట్ పూర్తైతే.. మానవాళి శాస్త్రీయ పురోగతిలో మరో అద్భుతం ఆవిష్కృతమవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు.
సింపుల్ గా చెప్పాలంటే నక్షత్రాల నుంచి వెలుగులు ప్రసాదించే ఒక సంలీన చర్యనే ఈ ప్యూజన్ ప్రాజెక్ట్. సూర్యుడు నిరంతరం తన శక్తిని కాంతిరూపంలో వెలువరించడానికి కారణమే ఈ సంలీన చర్య. రెండు లేదా అంతకంటే ఎక్కువ పరమాణువులు కలిసి ఒకే భారీ కేంద్రకంగా ఏర్పడి శక్తిని విడుదల చేయడమే ఈ సంలీన చర్య.
అలా సూర్యుడిలో కనిపించే సంలీన చర్యను ప్రయోగశాలల్లో చేపట్టడమంటేనే సూర్యుణ్ని కృత్రిమంగా పునఃసృష్టి చేయడం. అందుకోసం శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకవేళ ఇదే గనుక ఆవిష్కృతమైతే ఈ ప్రయోగం కచ్చితంగా ఓ హిస్టారికల్ మైల్ స్టోన్ గా మిగిలిపోనుంది.
ఇప్పటికే చైనా.. ఇలాంటి ఓ ప్రయోగంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 2025, జనవరి 20న 17 నిమిషాల సమయం స్థిరత్వం కోల్పోకుండా ప్లాస్మా స్థితిని నిలకడగా ఉంచి కృత్రిమ సూర్యుడిని ప్రపంచం ముందుంచింది.
అణువులను విభజించి రేడియో ధార్మిక వ్యర్థాలను ఉత్పత్తి చేసే అణువిచ్ఛిత్తికి భిన్నంగా.. హైడ్రోజన్ వాయువును అణువుల్లో కలిసిపోయేవరకు అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసి.. అసలు అణువ్యర్థాలే లేకుండా శక్తిని విడుదల చేసే విధంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
ఈ ప్రక్రియలో ముడిపదార్థమైన హైడ్రోజన్ కు భూమిపై కొరత లేకపోవడం మరో ప్లస్ పాయింట్. నాల్గింట మూడోవంతు నీటిలోనే ఉన్న భూమిపైన.. నీటి నుంచి హైడ్రోజన్ ను సంగ్రహించి ఈ ప్రాజెక్ట్ లో కీలకమైన ముడి పదార్థంగా వాడుతున్నారు.
సాధారణంగా సూర్యుడు, ఇతర నక్షత్రాల్లో న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా శక్తి విడుదలవుతుంది. ఆ శక్తికి తేలికైన హైడ్రోజన్ పరమాణువులు జతగా కూడి అది హీలియం అనే భారమూలకంగా తయారవుతుంది. ఆ క్రమంలో కాంతి, వేడి రూపంలో పెద్దఎత్తున శక్తి విడుదలవుతుంది. అదే ఇప్పుడు మనం నిత్యం చూసే సౌర వెలుగులకైనా, ఉష్ణోగ్రతలకైనా మూలం.
ఈ ప్రాజెక్టును ఐటీఈఆర్ గా పేర్కొంటారు. అంటే ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పరిమెంటల్ రియాక్టర్. ఇందులో అమెరికా, చైనా, భారత్ తో సహా.. జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ వంటి ఏడు ప్రధాన దేశాలతో పాటు.. మొత్తం 30 దేశాలు ఉమ్మడిగా భాగస్వామ్యాన్ని కల్గి ఉన్నాయి. అందులో ఇప్పుడు భారత్ కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ రియాక్టర్ లోని అయస్కాంతత్వ వ్యవస్థే.. అందులోని అల్ట్రా హాట్ ప్లాస్మాను సృష్టించడం, నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. 50 మెగావాట్ల శక్తి నుంచి 500 మెగావాట్ల వరకూ వెలుగులు నింపేలా ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది ప్లాస్మాను స్వయం సమృద్ధిగా నడిపిస్తుంది, బర్నింగ్ ప్లాస్మా అని పిలుస్తారు. ఫ్యూజన్ శక్తిని అన్‌లాక్ చేయడానికి శాస్త్రవేత్తలు దీన్ని కీలకంగా భావిస్తారు.
డ్యూటేరియం, ట్రిటియం అనే ఇంధనాలను ఉపయోగించి 150 మిలియన్ డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలుపయోగించి సూర్యుడి కంటే పదిరెట్లు ఎక్కువ వేడి ప్లాస్మాను తయారుచేస్తారు. అలాంటి ప్లాస్మాను డోనట్ ఆకారపు గదిలో ఉంచి.. ఆ ప్లాస్మా వేడి ఆ గది గోడలకు తాకకుండా సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ తో చల్లబరుస్తారు. టోకామాక్ గా పిల్చే ఆ గదిలోని ఫ్యూజన్ ప్రతిచర్యకు అధికశక్తితో న్యూట్రాన్స్ విడుదలవుతాయి.
యూఎస్ లో పరీక్షించబడిన ఈ శక్తివంతమైన అయస్కాంతం.. దక్షిణ ఫ్రాన్స్‌లోని ITER సైట్‌లో అమర్చేందుకు ప్రయత్నాలు ముమ్మురమైనాయి. ఎయిర్ క్రాఫ్ట్ లో ఈ వాహన నౌకను తరలించనున్నారు.
అతి తక్కువ ఉష్ణోగ్రతల్లో స్థిరంగా ఉండే క్రయోస్టాట్ గదికి రూపకల్పన చేసింది భారతీయ శాస్త్రవేత్తలే కావడం ఈ ప్రాజెక్టులో విశేషం. 30 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో ఉండే ఈ గదిలో ద్రవ హీలియాన్ని మోసే క్రయోలిన్ అయస్కాంత ఇంజన్స్ ని మైనస్ 269 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లబర్చే విధంగా ఈ గదుల నిర్మాణం చేశారు. సూపర్ కండక్టివిటీకి అవసరమైన ఉష్ణోగ్రతలతో ఈ గది నిర్మాణముంటుంది.
ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ విజయవంతమైతే.. ప్రస్తుత సాంకేతికతతో దీర్ఘకాలిక రేడియోధార్మిక వ్యర్థాలు, కార్బన్ ఉద్గారాలు లేకుండా ప్రపంచానికి కావల్సినంత స్వచ్ఛమైన శక్తితో కూడిన వనరులను ఉపయోగించుకోగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మొత్తంగా మూడు ఖండాల్లో వందలాది కర్మాగారాల్లో సభ్య దేశాల శాస్త్రవేత్తలందరూ కలిసి ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాజెక్టు కోసం చాలాకాలంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పర్యావరణం, ఇంధన భద్రత వంటి అసిత్వ సవాళ్లను మానవాళి ఎదుర్కొంటున్న కాలాన.. అందుకు కావల్సిన పరిష్కారాలను దేశాలన్నీ ఐక్యంగా తమ జాతీయ భేదాలను కూడా పక్కనబెట్టి ఈ ప్రాజెక్ట్ రూపకల్పనలో తలమునకలైనాయి.
ఈ ప్రాజెక్ట్ పూర్తై ఇప్పటికిప్పుడే ఇందన భద్రతకు భరోసా లభించకపోవచ్చునేమోగానీ… ఈ సభ్యదేశాల స్ఫూర్తితో ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కూడా ఇలాంటి ప్రయోగాల్లో భాగస్వామ్యానికి ముందుకు వస్తున్నాయి. ఈ డాటా మొత్తం భవిష్యత్తులో ఇంధన భద్రతకు, ఫ్యూజన్ న్యూక్లియర్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఉపయోగపడుతుందన్నది శాస్త్రవేత్తల అంచనా.
ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం కోసం ఏడు ప్రధాన భాగస్వామ్య దేశాల్లో యూరప్ 45 శాతం భరిస్తోంది. మిగిలిన ఆరు దేశాల్లో చైనా, యూఎస్, జపాన్, దక్షిణ కొరియా, భారత్, రష్యా 9 శాతం వ్యయాన్ని భరిస్తున్నాయి. మొత్తంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి ఎలాగైతే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నామో.. అదే తరహా చర్చలు మున్ముందు ఈ ఆర్టిఫిషియల్ సూర్యుడి రాకతో చేయబోతున్నామన్నమాట…
Share this Article