.
మొదట కల్కి-2 నుంచి పీకేశారు దీపిక పడుకోన్ ను… తరువాత స్పిరిట్ నుంచీ తరిమేశారు… బాలీవుడ్ మాత్రమే కాదు, అన్ని వుడ్ సర్కిళ్లలోనూ పెద్ద చర్చ… పెద్ద పెద్ద బాలీవుడ్ పెద్దలే ఆమె చల్లని చూపుల కోసం, డేట్ల కోసం, ఆమె పెట్టిన షరతులన్నింటికీ తలూపుతూ దాసోహం అంటుంటే… ఈ తెలుగు మొహాలు మండ, వీళ్లకెందుకు ఆమె చేదు అయిపోయింది అనీ రుసరుసలు…
అసలు తెర వెనుక ఏం జరిగిందో గానీ.., ఆమె తల్లి అయింది కదా, పనిగంటల్లో వెసులుబాటు అడిగింది, ఈ మగవివక్షులు అది పట్టించుకోకుండా, ఠాట్ వీల్లేదు, అందరిలాగే పనిచేయి, లేకపోతే మానెయ్ అనేశారని సినిమా ప్రపంచం కోడై కూసింది… మహిళలపై ఏమిటీ వివక్ష అనీ ఎలుగెత్తింది… అసలు అప్పట్లోనే ఓ సినిమా కాక్రోచ్ పార్టీ పుట్టి ఉండాల్సినంత వ్యతిరేక వ్యాఖ్యలు…
Ads
ఈ తొక్కలో పేడిమొహం గాళ్లకే వందల కోట్లు కట్టబెడుతున్నారు కదా, హీరోయిజం, ఎలివేషన్స్, ఊహించనంత డబ్బు, ఫేమ్, ప్రయారిటీ… మరి దీపిక వంటి అగ్రతారకు ఏం తక్కువ..? తన కంఫర్ట, తన కర్యం అడిగితే తప్పేముంది..? అని బలంగా సమర్థించినవాళ్లూ ఉన్నారు…

నిజానికి కల్కి-2 నుంచి ఎందుకు తీసేశారనేది పక్కన పెడితే… పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit) నుంచి ఆమెను ఎందుకు తీసేశారు..? ఈ ప్రశ్నకు అసలు జవాబు దొరికింది…
కాదు, కల్కి-2 తీసే సహ తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్‌కు సంఘీభావంగా ఏమీ కాదట… ఈ కాస్టింగ్ వివాదంపై సందీప్ రెడ్డి వంగా సోదరుడు, చిత్ర సహ నిర్మాత ప్రణయ్ రెడ్డి (Pranay Reddy Vanga) వంగా తాజాగా స్పందించి అసలు నిజాన్ని బయటపెట్టాడు… దీపికాతో దాదాపు ఏడాదిన్నర పాటు చర్చలు జరిపినప్పటికీ ప్రాజెక్ట్ ఎందుకు వర్కవుట్ కాలేదో స్పష్టంగా వివరించాడు…
‘‘సందీప్ దాదాపు ఏడాదిన్నర పాటు దీపికా పడుకోన్‌తో ‘స్పిరిట్’ కథ, ఆమె పాత్రకు సంబంధించి చర్చలు జరిపాడు. ఆమెకు కథ విపరీతంగా నచ్చినప్పటికీ కొన్ని కఠినమైన వ్యాపార నిబంధనలు, షరతుల వల్లే ఆమెను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకోలేకపోయాం. భారీ రెమ్యూనరేషన్ పెంపుతో పాటు సినిమా లాభాల్లో ఏకంగా 10 శాతం వాటా కావాలని ఆమె డిమాండ్ చేసింది… అంతేకాకుండా రోజువారీ షూటింగ్ పనివేళలకు సంబంధించి కూడా ఆమె పెట్టిన నిబంధనలు సినిమా మేకింగ్‌కు అనుకూలంగా అనిపించలేదు’’ అని చెప్పుకొచ్చాడు…

ఈ సినిమా విషయంలో దీపికా పడుకోన్ (Deepika Padukone) చేసిన కామెంట్స్ కూడా కంటవర్సీ అయిన సంగతి తెలిసిందే కదా… ఇక్కడ ఆమె తన పాపులారిటీని, తన గిరాకీని తనే అంచనా వేసుకుంది… ఒంటి దీపం చక్కగా ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి… ఎక్కువ డబ్బు అడగడమే కాదు, ఏకంగా లాభాల్లో 10 శాతం వాటా అడిగింది…
నిజంగా ఆమెకు అంత సీన్ ఉందా? ఆమె మాత్రమే ఆ సినిమాను ఒంటి చేత్తో మోస్తుందా, మోయగలదా అనే మీమాంసను, డిబేట్‌ను పక్కనపెడితే… మన దేశంలో ఒక తార, ఈ హీరోస్వామ్యంలో నాకెందుకు లాభాల్లో ఇవ్వరు అని డిమాండ్ చేయడం అనేదే ఆశ్చర్యకరం, ముచ్చటేస్తుంది కూడా… హీరోలకు మాత్రం ఏరియాలు రాసిస్తారు, నిర్మాణంలో భాగస్వామ్యాలు ఇస్తారు, వందల కోట్ల పారితోషికాలు పాదాల మీద కుప్పపోస్తారు… పాపం, తారలకేం తక్కువ..? ఈ కోణంలో మాత్రం దీపిక టెంపర్‌మెంట్ మెచ్చదగిందే…
ఆమె స్థానంలో తమ ఆస్థాన తార తృప్తి డిమ్రీని తీసుకున్న సంగతి తెలిసిందే కదా… వివేక్ ఒబెరాయ్ విలన్… ఈ చిత్రాన్ని 5 మార్చి 2027న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు… అవునూ, అల్లు అర్జున్ తీసే సినిమా ‘రాకా’ కూడా స్పిరిట్, కల్కి-2 లాగా తెలుగు మొహమే కదా… అక్కడ దీపిక్ ఎలా సెట్టయింది మరి..? ఇక్కడా 10 పర్సెంట్ అడిగితే… వీళ్లూ వదిలేస్తారు అని భయపడి, రాజీపడి, చెప్పినట్టు వింటోందా..?!
Share this Article