భవిష్యత్ దార్శనికతకు పట్టం గడుతూ , ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచే ఒక అద్భుత పథకానికి ప్రభుత్వం ప్రణాళిక రచన
చేస్తే సొంత మీడియానే పట్టించుకోకపోవడమా? ఆశ్చర్యంగా కనిపించవచ్చు. కానీ జరుగుతున్నది అదే. ఆరోగ్య రంగంపై జగన్ మోహన్
రెడ్డి ప్రభుత్వ విజన్ ను గుర్తించడంలో సాక్షి పత్రికకు చూపు తగ్గిపోయింది. నిత్యం భజన చేయడం వల్ల వార్తల్లోని పాజిటివ్, నెగిటివ్
విలువలను గుర్తించడంలో విచక్షణ కోల్పోవడమే ఇందుకు కారణం కావచ్చు. ఒకవైపు జీతాలు సకాలంలో చెల్లించలేని దుస్థితి. ఇంకోవైపు కేంద్రం ఇచ్చిన ఉపాధి హామీ నిధులను సైతం ఇతర
అవసరాలకు మళ్లించుకుని పెండింగు పెడుతున్న పరిస్థితి. కాంట్రాక్టర్లు అలో లక్ష్మణా అంటున్నారు. రోడ్లన్నీ గుంతలతో వెక్కిరిస్తున్నాయి. ఉపాధి పరిశ్రమలు లేవు. ఊతమిచ్చే వ్యాపార కార్యకలాపాలు లేవు. రాష్ట్ర భవిష్యత్ ఏమిటో తెలియని దా‘రుణ’వాతావరణం. అప్పులు తెచ్చి పంచి పెట్టడమే అభివృద్ధిగా భ్రమ పడుతున్న, భ్రమ పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి
ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ప్రత్యర్థి మీడియా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి దానిని ఎలాగూ తమదైన కోణంలో ప్రతికూల వార్తగానే చూస్తాయి. కానీ నిరంతరం అయిన దానికి, కాని దానికి భజన చేసి మసిపూసి మారేడు కాయ చేసే సొంత మీడియా సాక్షి సైతం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యరంగాన్నిమలుపు తిప్పే ఆ వార్తను గుర్తించి తగిన ప్రాధాన్యం ఇవ్వలేకపోయింది.
రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు, అనుబంధంగా బోధన ఆసుపత్రులు, వైద్యరంగం మెరుగుదలకు చర్యలు. దాని నిమిత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పుతెచ్చి తిరిగి చెల్లింపునకు ఆచరణయుక్తమైన ప్రతిపాదనను ప్రభుత్వం బ్యాంకుల కన్సార్షియం ముందుకు తెచ్చింది. మద్యనిషేధ హామీని తుంగలో తొక్కి మద్యం ఆదాయాన్ని పూచీకత్తుగా చూపించి తెస్తున్న వేల కోట్ల రూపాయల రుణం వంటి
పథకం కాదిది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా చాలా రాష్ట్రాలు ఆరోగ్యశ్రీ తరహాలో రోగుల పేరిట కార్పొరేట్ ఆసుపత్రులకు దోచి పెడుతున్నాయి. ఇది తప్పించుకోలేని భారంగా మారింది. ఫలితంగా ప్రభుత్వ వైద్యరంగం పూర్తిగా పడకేసింది. ఏపీ ప్రతిపాదన ఒక్క దెబ్బకు మూడు పిట్లలు అన్నట్లుగా, ఈ సమస్యకు పరిష్కారంతోపాటు శాశ్వతంగా వైద్యరంగంలో మెరుగైన సేవలకు అవకాశం కల్పిస్తోంది. మెడికల్ కళాశాలల ఏర్పాటుతో అనుబంధ ఆసుపత్రులు ప్రభుత్వ రంగంలో వస్తాయి. ఆరోగ్యశ్రీ నిధులను వాటికే కేటాయిస్తారు. అందువల్ల రోగులు అక్కడే సేవలు పొందాల్సి ఉంటుంది. కార్పొరేట్ కళాశాలల్లో కోట్ల రూపాయలు చెల్లించి విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్నారు. వారంతా ప్రతిభావంతులేమీ కాదు. డబ్బున్న వాళ్లు అంతే. సగటు ప్రతిభతో కూడిన మధ్య తరగతి, వెనకబడిన వర్గాల పిల్లలకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారింది.
Ads
కొత్త కళాశాలలు అందుబాటులోకి వస్తే ఏటా రెండువేల మెడికల్ సీట్లు పెరుగుతాయి. రిజర్వేషన్ వర్గాలతోపాటు నిర్ణీత
ఫీజుకే వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. ‘బి’ కేటగిరి సీట్లను నిర్ణీత ఫీజుతో విద్యార్థులకు కేటాయించి , ఆ నిధులను బ్యాంకుల కన్సార్షియంకు చెల్లిస్తారు. ఆటోమేటిక్ గానే రాష్ట్రంలో వైద్య విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. వైద్యుల కొరత తీరుతుంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు పేరిట కార్పొరేట్ దోపిడీకి చెక్ పడుతుంది. వైద్యుల సంఖ్య పెరుగుతుంది. సేవలు ధర్మాసుపత్రుల రూపంలోనే అందుబాటులోకి వస్తాయి. బ్యాంకులకు చెల్లించక తప్పదు కాబట్టి ప్రభుత్వ నిధుల దుర్వినియోగం తగ్గుతుంది. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నైనా లోపాలుండవచ్చు. కానీ వినూత్నమైన, ఆచరణాత్మకమైన ఆలోచనతో ముందుకు
వచ్చినందుకు కచ్చితంగా గుర్తించాలి. అందులోనూ జాతికి జీవనాడి వంటి వైద్యరంగానికి ఊతమిచ్చే చర్యలను ప్రోత్సహించాలి.
అప్పు చేస్తే ఏరకమైన ప్రణాళిక ఉండాలనేందుకు ఇదొక ఉదాహరణ. అయితే ఈనాడు పత్రిక మరో తొమ్మిదివేల కోట్ల అప్పు అంటూ ఇంకా
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందనే భావన వచ్చేలా ప్రతికూల వార్తగా ప్రాధాన్యం ఇచ్చింది. ఈ వార్త వేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి విజన్ ను ప్రజలు పాజిటివ్ గా తీసుకుంటారనే భావనతో కావచ్చు . ఆంధ్రజ్యోతి ఈ అంశాన్నే పట్టించుకోలేదు. అప్పు పేరు చెబితే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందనే భయంతో సాక్షి కూడా తప్పించేసుకుంది. పాలును, నీరును వేరు చేసి చూడగల విచక్షణ మీడియా కోల్పోవడమే ప్రస్తుత దురవస్థకు కారణం. ఏపీ ప్రభుత్వ నిర్ణయాలన్నిటినీ ఒక గాటన కట్టలేం. మంచి చెడు రెండూ ఉంటాయి. వైద్యరంగంలో ఈ ప్రతిపాదన తెచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం కచ్చితంగా అభినందించాలి. ఈ ఆలోచన సాకారమైతే భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకూ ఇది మోడల్ కావచ్చు…………………. – కృష్ణసాయిరామ్
Share this Article