బాలసుబ్రహ్మణ్యం గొప్ప పాటగాడు… సకల ప్రపంచమూ ముక్తకంఠంతో అంగీకరించింది… నీరాజనాలు పట్టింది… కానీ ఒక సందేహం మాత్రం సజీవంగా ఉండిపోయింది… ఆయన కొన్ని వందల (వేలు కూడా కావచ్చు బహుశా) కచేరీలు చేశాడు… చిన్న గాయకుల నుంచి పెద్ద పెద్ద గాయకుల దాకా అందరి పాటలూ పాడాడు… కొన్నిసార్లు ఆ గాయకులకన్నా బాగా పాడాడు… తప్పులొచ్చిన చోట వినమ్రంగా, హుందాగా ప్రేక్షకులకు చెప్పాడు… కానీ ఏ కచేరీలోనూ తను మంజునాథ సినిమాలోని మహాప్రాణదీపం పాటను, జగదేకవీరుడి కథ సినిమాలోని శివశంకరీ పాటను పాడినట్టు వినలేదు, ఏ వీడియోలోనూ కనిపించలేదు… ఎందుకబ్బా..? ఈ డౌట్ రావటానికి కారణాలున్నయ్… తెలుగు సినిమా పాటలకు సంబంధించి ఈ రెండూ మాస్టర్ పీసులు… ప్రతి గాయకుడు సాధన చేయడానికి ప్రయత్నిస్తుంటాడు… ఏదైనా వేదిక దొరికితే పాడి తనను తాను ప్రూవ్ చేసుకుని, చప్పట్లు కోరుకుంటాడు… అదొక తపన…
చాలామంది సీనియర్ గాయకులు సైతం ఈ పాటల్ని సరిగ్గా పాడటంలో ఫెయిల్… మరి అలాంటి పాటల్ని బాలు ఎందుకు అటెంప్ట్ చేయలేదు…? ఎందుకు వాటి జోలికి పోలేదు..? ఆ పాటల్ని బాలు పాడితే ఎలా ఉంటుందో వినాలని ఆశించిన సంగీతాభిమానుల కోరిక నెరవేరనేలేదు… తనే వెళ్లిపోయాడు… వీటిలో మహాప్రాణదీపం పాట పేరుకు బ్రీత్‌లెస్ కానీ… ఏదో టెక్నికల్ సౌలభ్యం, సర్దుబాట్లతో నడిపించేశారు… అఫ్‌కోర్స్, శంకర్ మహదేవన్ బాగా పాడాడు… హంసలేఖ కంపోజింగ్ అపూర్వం… నభూతో… అసలు ఎన్ని స్వరాల సమ్మేళనమో, ఎన్ని రాగాల సంగమమో… ఒకాయన ఈ స్వరాల కూర్పుపై ఏకంగా 51 నిమిషాల వీడియో కూడా తీశాడు… అంతెందుకు, ఈ పాటకు యూట్యూబులో 10 కోట్ల వ్యూస్…
Ads
ఇదే శంకర్ మహాదేవన్… ఇదే బాలు నేతృత్వంలో సాగిన ఈటీవీ@20 ప్రోగ్రాంలో చెత్తగా పాడాడు… ఆ పదాల శబ్ద సౌందర్యమే ఖూనీ చేశాడు… రాగాలు, తాళాలు, శృతులు, సంగతులు, హైపిచ్, లోపిచ్ అనేది వేరే సంగతి… పదాల ఉచ్ఛరణ ముఖ్యం కదా… నిజానికి ఆ పాట పాడటం కష్టం… ముందుగా ఆ పదాల్ని పలకడం సాధన చేయాలి… చాలామంది గాఢను ఘాడ అని… అద్వైతభాస్కరాన్ని అద్ధ్వైత భాస్కరంగా పాడి తప్పులో కాలేస్తుంటారు… అలాగే ఏకనాదేశ్వరంలో ద వేరు… మంజునాథేశ్వరంలో థ వేరు… అసలు త్య్రంబకేశ్వరం దగ్గరే చాలామంది బోల్తా… అలాగే ఈ పాటకు బ్రీత్ కంట్రోల్ కూడా చాలా ముఖ్యం… కల్పన వంటి విద్వత్తు ఉన్న శాస్త్రీయ గాయనే అక్కడక్కడా తడబడింది కొన్నిసార్లు… కన్నడం, తెలుగు భాషల్లో గాయకులకు ఈ పాట ఓ సవాల్… అందరికన్నా మంచి ఉచ్ఛరణతో, ఆయా పదాల అసలైన గాంభీర్యం, సౌందర్యం చెడకుండా పాడింది మాత్రం మన కారుణ్య…
ఇక శివశంకరి ఎవర్ గ్రీన్… గాయకుడికి ఓ పరీక్ష… ఎంత పరీక్ష అంటే… అది పాడిన ఘంటసాలే మళ్లీ ఎక్కడా దాన్ని పాడే ప్రయత్నం చేయలేదు… ఆ పాటను కూడా మన గాయకులు పదే పదే ప్రాక్టీస్ చేస్తుంటారు, కాస్త శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నవారికి పట్టు చిక్కుతుందేమో గానీ ఇతరులకు కష్టం… ఈ పాటను కూడా బాలు పాడినట్టు గుర్తులేదు… పాడలేక కాదేమో, కానీ ఒరిజినల్‌కు ఎంత దూరంలో ఉండిపోతాడో తెలియక కావచ్చు… వర్తమాన గాయకుల్లో హేమచంద్ర, కల్పన, కారుణ్య బాగా పాడారు ఏవో కచేరీల్లో… కారుణ్య పాడే తీరులో ఫీల్ వ్యక్తీకరించబడుతూ ఉంటుంది… శ్రీ తుంబుర నారద పాటను బాలు గ్లాస్‌గోలో పాడినప్పుడు తప్పులు దొర్లినట్టు, సరిగ్గా పాడలేకపోయినట్టు తనే చెప్పుకున్నాడు… నిజానికి సినిమాలో ఒరిజినల్‌గా ఆ పాట పాడింది తనే… శాస్త్రీయం టచ్ ఉన్న పాటలయితే బాలుకు ఒకింత తడబాటే… శంకరాభరణం పాటలు పాడటానికి మొదట్లో సందేహించింది కూడా అందుకే..!!
Share this Article