.
కాళేశ్వరం, మేడిగడ్డ పదాల్ని తమ ప్రసంగాల్లో పదే పదే ప్రస్తావించడం… అర్థరహిత, అనుచిత వ్యాఖ్యలకు దిగడం వల్ల తమకే నష్టం అనే సోయి కోల్పోతున్నారు బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఎందుకో మరి..! చేజేతులా జనంలో తామే మేడిగడ్డ కుంగుబాటు చర్చను లైవ్‌లో ఉంచుతున్నారు… అది రాజకీయంగా కూడా తమకే నష్టం అనే నిజాన్ని గుర్తించడం లేదు…
నేడోరేపో కాళేశ్వరం కమిషన్ తన నివేదికను సమర్పించబోతోంది కూడా… ఈ సమయంలోనే కాదు… విపత్తులో, ప్రమాదాలో సంభవించినప్పుడు మాటల్లో సంయమనం అవసరం… పదేళ్ల పాలన వైఫల్యాలు వెంటాడుతున్న వేళ, చురుకైన ప్రజాజీవితంలో ఉన్నవాళ్లు ఏవో పిచ్చి వ్యాఖ్యలు చేసేస్తే, ప్రజలు ఏది చెప్పినా నమ్మేస్తారులే అనుకుంటే, అది తమను తాము మరింత దిగజార్చుకోవడమే అవుతుంది… నిన్న కేటీయార్ అనాలోచితంగా కాళేశ్వరం మీద చేసిన వ్యాఖ్యలు ఈ కోవలోనివే…
Ads
‘‘మేడిగడ్డ బరాజ్‌ను కూడా ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీయే ఏదో చేసిందని మా అనుమానం… అక్కడ కొందరు మనుషులు ఉన్నారు వాళ్లవాళ్లు… మరి ఏం పెట్టారో ఎలా పెట్టారో గానీ… చాలామంది రైతులు కూడా చెప్పారు… ఆ రెండు పిల్లర్లు కుంగితే శబ్దం వచ్చింది, ఏదో పేలిన శబ్దం వచ్చింది అని కూడా చెప్పారు…’’
గతంలో కూడా బీఆర్ఎస్ నుంచి ఇలాంటి ఆరోపణే విన్నట్టు గుర్తు… అచ్చం కేసీయార్‌కు కేటీయార్ వారసుడే ఇలాంటి అనాలోచిత, హాస్యాస్పద వ్యాఖ్యలకు…! ఈ వీడియో బిట్ చూడగానే 2022లో కేసీయార్ చేసిన ఇలాంటి వ్యాఖ్యలే గుర్తొచ్చాయి… జనం నవ్వుతారనీ, ప్రత్యర్థి పార్టీల నేతలు ఎగతాళి చేస్తారనీ గుర్తించకపోవడం… అప్పట్లో భారీ వర్షాలు వచ్చి అన్నారం, కన్నెపల్లి పంపు హౌజులు మునిగాయి…
బాహుబలి మోటార్లు అంటూ ఆహాఓహో అని కీర్తింపజేసుకున్న మొత్తం 17 మోటార్లు దెబ్బతిన్నాయి… ప్రొటెక్షన్ వాల్ కూలి ఆరు మోటార్లయితే తుక్కుతుక్కు… 1000 కోట్ల రిపేర్ ఖర్చులు సరే, ఇప్పుడు ఎన్ని పనిచేసే స్థితిలో ఉన్నాయో, ఆస్ట్రియా నుంచి తెప్పించాల్సిన ఆరు మోటార్ల కథేమిటో ఎవరికీ తెలియదు ఇప్పటికీ…
(లక్ష మందితో కేసీయార్ నాయకత్వంలో వెళ్లి మోటార్లు ఆన్ చేస్తాను హరీష్ రావు భీకర ప్రకటనలు చేసింది ఈ కన్నెపల్లి పంపులపైనే…) కేసీయార్ ఇప్పుడు ప్రజాజీవితంలోనే లేడు, అజ్ఞాతవాసి… తను కదలడు, ఏవో ఝలక్కులు, ధమ్కీలు, ప్రచారపోకడలు… ఇన్నాళ్లయింది ప్రకటన చేసి ఏమైంది హరీష్ రావు సాబ్..?
2022లో పంపు హౌజులు మునిగినప్పుడు కేసీయార్ ఏమన్నాడో తెలుసా..? గోదావరి పరీవాహకంలో విదేశాలు క్లౌడ్ బరస్ట్ కుట్రకు పాల్పడుతున్నాయని..! జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఈ తరహా కుట్రలు జరిగాయి, అదే గోదావరి బెల్టులో చేస్తున్నాయని వ్యాఖ్యానించాడు… (చైనా ఆ కుట్ర చేయగలదు, కానీ చేసినట్టు ఏ ఆధారాలూ లేవు హిమాలయ ప్రాంతాల్లో కూడా..)
కరోనాకు పారాసెటమాల్ చాలు, నాకు గోలీలు ఇవ్వడానికి సంతోష్‌కు రాజ్యసభ సభ్యత్వం వంటి వ్యాఖ్యలూ చేశాడనుకొండి, అది వేరే విషయం… కాళేశ్వరం విషయానికొద్దాం… ఎవరో పేలుడు పదార్థాలు పెట్టి, మేడిగడ్డ బరాజ్‌కు ప్రమాదం తలపెట్టినట్టు డౌట్లున్నాయి, కాంగ్రెస్ పనే అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా కేటీయార్…
సరే, అప్పుడంటే ఎన్నికల హడావుడిలో ఉన్నారు కాబట్టి, అధికారంలో ఉన్నా దీన్ని పట్టించుకోలేదు, రైతులు సందేహాలు వ్యక్తం చేసినా లైట్ తీసుకున్నారు… మరి ఇన్నాళ్లూ కాళేశ్వరం మీద ఇంత రచ్చ జరుగుతోంది కదా, మీకు అత్యంత ప్రతిష్ఠాత్మక కిరీటం వంటి కలల ప్రాజెక్టు కదా, మరెందుకు వదిలేశారు..?
పోనీ, కాంగ్రెస్ మీద ఆరోపణలు కాబట్టి రేవంత్ ప్రభుత్వం పట్టించుకోదు అనుకుంటే… సీబీఐ దర్యాప్తు అడిగారా..? లేదు…! కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ, మీ రహస్య దోస్తులే కదా… కాంగ్రెస్ అంటే దానికీ కోపమే కదా… వెంటనే రంగంలోకి దిగి తేల్చిపారేసేది కదా…
పోనీ, కోర్టును ఆశ్రయించారా..? జుడిషియల్ ఎంక్వయిరీ లేదా కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరగాలని… అడగలేదు… ప్రిస్టేజియస్ ప్రాజెక్టును అలా గాలికి వదిలేశారు దేనికి మరి..? నిజంగా కాంగ్రెస్ ఏదో కుట్రకు పాల్పడి ఉంటే జనం ఎదుట దాన్ని దోషిగా నిలబెట్టాలి కదా…
కాంగ్రెస్ మరిచిపోయినప్పుడల్లా ఇదుగో ఇలాంటి ‘పేలుడు కుట్ర’ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ను మళ్లీ యాక్టివ్ చేసి, పదే పదే ప్రజల్లో ఈ కాళేశ్వరం చర్చను సజీవంగా ఉంచడం వల్ల ఎవరికి రాజకీయంగా నష్టం..?!
Share this Article