చిన్న వార్త… చాలా చిన్న వార్త… వేరే పత్రికల్లో కనిపించలేదు గానీ… ఈనాడులో నాలుగు ముక్కల చిన్న వార్త ఒకటి కనిపించింది… నిన్న కొన్ని మునిసిపాలిటీల వోట్ల లెక్కింపు జరిగింది కదా ఏపీలో… కుప్పంలో వైసీపీ గెలిచింది, టీడీపీ చతికిలబడింది అనే సుదీర్ఘ విశ్లేషణలకన్నా ఈ చిన్న వార్తే ఆకర్షించింది… ఆఫ్టరాల్ రాజకీయాల్లో ఎగుడుదిగుళ్లు సహజం… పడిలేవడం, లేచిపడటం, చేతకాకపోతే కాలగతిలో కొట్టుకుపోవడం… కుప్పం ఓ లెక్కా..? అయితే కుప్పంలో నలుగురు అభ్యర్థులకు అసలు ఒక్క వోటూ రాలేదు… మూడో వార్డులో ముగ్గురు స్వతంత్రులు ప్లస్ పదకొండో వార్డులో మరో అభ్యర్థికి అక్షరాలా సున్నా వోట్లు… అదేమిటి..? కనీసం తన వోటు కూడా తను వేసుకోలేదా..? లేదు..! ఆ అవసరమే లేదు, అసలు నిలబడిందే అందుకు కాదు… వోట్లు ఎవడికి కావాలి…
వీళ్లను ఎవరు నిలబెట్టారో తెలియదు గానీ… జస్ట్, అభ్యర్థిగా ఉండటం వల్ల కౌంటింగ్ ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవచ్చు… పాసులు జారీ చేయొచ్చు… కౌంటింగ్ సెంటర్‌లో కూడా అవసరమైతే ‘మందబలం’ ప్రదర్శించడానికి వీలుగా అన్నమాట… చాలా ఎన్నికల్లో చాలామంది చేస్తున్న పనే ఇది… అక్షరాలా ఎన్నికల ప్రక్రియను, నిబంధనల్ని అపహాస్యం చేయడమే… కేంద్ర ఎన్నికల సంఘం కానివ్వండి, దాని అడుగుజాడల్లో నడిచే రాష్ట్ర ఎన్నికల సంఘం కానివ్వండి… అవసరమైన ఎన్నికల సంస్కరణలు చేతకావు, ఎవడో ఏ శేషనో వస్తే తప్ప అది కదలదు… ఆధార్‌తో వోటు హక్కు లింకేజీ, ఆన్‌లైన్ పోలింగ్ వంటి పెద్ద పెద్ద అడుగులు కాదు, కనీసం ఇదుగో, ఇలాంటి నామ్‌కేవాస్తే అభ్యర్థిత్వాలను కూడా అరికట్టలేదా..?
Ads
నామ్‌కేవాస్తే డిపాజిట్ తిరిగి వస్తే ఎంత..? రాకపోతే ఎంత..? అంత పెద్ద ఎన్నికల ఖర్చులో డిపాజిట్ మొత్తాల్ని ఎవరు పట్టించుకుంటారు..? కానీ కనీస విద్యార్హతతోపాటు కనీస వోట్లు అనే నిబంధన కూడా పెట్టలేమా..? అదేమైనా మన ఎన్నికల స్పూర్తిని దెబ్బతీస్తుందా..? ఇండిపెండెంట్లను వదిలేద్దాం… దేశంలో ఇప్పుడు 2858 రిజిష్టర్డ్ పార్టీలున్నయ్… అందులో 8 నేషనల్ పార్టీలు, 54 స్టేట్ పార్టీలు, 2796 గుర్తింపు లేని పార్టీలు… అసలు కనీస వోట్ల శాతం నిబంధననే సరిగ్గా అమలు చేయలేకపోతోంది ఎన్నికల సంఘం… నేషనల్ పార్టీల సంఖ్య సగానికి పడిపోయేదేమో… స్టేట్ పార్టీల సంగతి పక్కన పెడితే, 2796 గుర్తింపు లేని పార్టీల మాటేమిటి..? వాటికి కనీస వోట్ల శాతం ఎందుకు నిర్దేశించకూడదు..? రాకపోతే ఎందుకు రద్దు చేయకూడదు..? ఐనా మనకెందుకు లెండి… అసలే ఢిల్లీ అంటేనే పెద్ద బుర్రలు, దేశభక్తులు… (తెలంగాణలో బుర్ర అంటే డొల్ల అని అర్థం…)
Share this Article