ఇప్పుడు మరణాలు తగ్గాయి గానీ గత సంవత్సరం న్యూయార్క్‌లో కరోనా మరణాల సంఖ్య విపరీతంగా ఉన్న సంగతి మనకు తెలుసు కదా… ఇప్పుడు మనం మన సిటీల్లో చూస్తున్నట్టుగానే… శవాలే శవాలు… ఒకసారి మరణించాక ఆ శవాల్ని ఏం చేయాలి..? బంధువులకు అప్పగించాలి లేదంటే ప్రభుత్వమే అంత్యక్రియలు జరిపించాలి… ఎవరైనా వస్తారేమో అప్పగిద్దాం, పాపం, తమవాళ్లు చేసే అంత్యక్రియలకు మించిన శవసంస్కారం ఏముంటుంది అనుకుని ప్రభుత్వం ఎదురు చూస్తుందీ అనుకుందాం… కానీ మార్చురీల్లో స్పేస్ ఏదీ..? కొత్తగా వచ్చిపడే శవాలకు చోటేదీ..? అందుకని రిఫ్రిజిరేటెడ్ ట్రక్కుల్లో శవాల్ని పెట్టి, రోడ్డు పక్కన పార్క్ చేసేసింది… అనేక ట్రక్కులు… వచ్చి శవాల కోసం అడిగేవాళ్లు లేరు… ఏడాదికాలంగా తమవారి కోసం ఎదురుచూసే శవాలూ ఉన్నయ్… ఒక్క న్యూయార్క్‌లోనే ఇంకా కనీసం 750 శవాలు ఈ నిరీక్షణలో ఉన్నయ్… చల్లటి ఫ్రిజ్ గాలుల్లో ఏమాత్రం దేహాలు చెడిపోకుండా…!!
ఇప్పుడు ఇక సామూహికంగా ఖననం చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారట… ఇలాంటి చాలా నగరాల్లో… చాలా దేశాల్లో… అంతెందుకు..? అంత్యక్రియలకు అత్యంత ప్రయారిటీ ఇచ్చే మన దేశంలోనూ అనేక హాస్పిటళ్లలో తమ వారు తీసుకెళ్తారని ఎదురుచూసే శవాలు బోలెడు… కారణం :: అంత్యక్రియల ఖర్చు… శవాన్ని తీసుకుపోవడానికి అయ్యే ఖర్చు… కరోనా పీడించినదానికన్నా ఎక్కువగా రకరకాల మాఫియాలు సొసైటీని కుళ్లపొడుస్తున్నయ్ కదా… చివరకు తమ వారికి అంత్యక్రియలు చేయడానికి కూడా బంధుగణం భయపడి, డబ్బుల్లేక అలాగే వదిలేయడం అంటే సమాజానికి అంతకన్నా సిగ్గుచేటు ఏముంటుంది..? అప్పోసప్పో చేసి శవాల్ని శ్మశానాలకు తీసుకెళ్లినా, కరోనా శవాలకు డబుల్ రేట్లు… అప్పటికే చికిత్సలకు, మందులకు ఖర్చు పెట్టీ పెట్టీ కుటుంబసభ్యులు వాళ్లే సగం చచ్చిపోయి ఉంటారు… ఆర్థికంగా, మానసికంగా..! ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే… ఇదుగో ఈ కార్టూన్…
Ads
నిన్న ఈనాడులో వచ్చింది… మామూలు పరిస్థితిలో నిజానికి ఇది పెద్దగా వివాదాస్పదం అయ్యేది కాదేమో… కానీ ఈమధ్య ఈనాడు పదే పదే మోడీ మీద అక్షరదాడి చేస్తోంది… ఆమధ్య ఎవరో పనిమనిషికి బెంగాల్లో టికెట్టు ఇస్తే, ఇలాంటిదే ఓ కార్టూన్ వచ్చింది ఈనాడులో… ఏదో విదేశీపత్రిక మోడీని ఏకిపారేస్తూ ఏదో ఎడిటోరియల్ రాస్తే ఈనాడు ఫస్ట్ పేజీలో దాన్ని అచ్చేసుకుంటోంది… సో, ఈనాడు మోడీ ద్వేషి అని తేల్చేసుకున్న బీజేపీ భక్తగణం ఇక ఈనాడు కార్టూన్ల ఉద్దేశాలపై రకరకాల బాష్యాలు చెబుతూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు… ఈ కార్టూన్ మీద కూడా విరుచుకుపడ్డారు… విషయం ఏమిటంటే..? యూపీలో కరోనా మృతులందరికీ ప్రభుత్వమే ఉచితంగా అంత్యక్రియల్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది… నిజానికి మంచి నిర్ణయం… ఎందుకు మంచి నిర్ణయమో పైన చెప్పుకున్నాం కదా… దాన్ని వెకిలి చేసేలా కార్టూన్ కనిపిస్తే అది సమర్థనీయం కాదు… కాదు…
చదివారు కదా… ఇదీ సిట్యుయేషన్… ఈ నేపథ్యంలో ప్రభుత్వమే అంత్యక్రియల్ని ఉచితంగా చేయడానికి ముందుకురావడం కరెక్ట్… అసలు ఇది ప్రతి రాష్ట్రంలోనూ అమలు చేయాలి… ఫస్ట్ వేవ్ సందర్భంగా ఏం జరిగేదో గుర్తుంది కదా… కరోనా మరణమైతే చాలు, ప్రభుత్వ సిబ్బందే అంబులెన్సుల్లో శ్మశానానికి తీసుకుపోయి దహనం చేసేసేవాళ్లు… నిజానికి ఇప్పుడూ అదే అవసరం… ఎందుకంటే..? కరోనా శవాల్ని బంధువులకు ఇస్తున్నారు, అంత్యక్రియలకు దగ్గరి వాళ్లు వెళ్లక తప్పదు… అదుగో, అక్కడ మరికొందరికీ సోకుతోంది… ఈమధ్య నమోదవుతున్న కేసుల్లో ఇవీ ఎక్కువే… టెన్షన్, ఖర్చు, సీరియస్ అయితే చావు… అంటే, చావుకు వెళ్లొస్తే చావు… మళ్లీ వీళ్లను సాగనంపడానికి వచ్చినవాళ్లకూ అంటుకునే మహమ్మారి… ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే, ఇలాంటి కేసులు పెరుగుతూనే ఉన్నయ్… ఈ దిక్కుమాలిన చావులకన్నా కరోనా శవాల్ని ప్రభుత్వమే ఉచితంగా, స్వయంగా డిస్పోజ్ చేయడం మేలనిపిస్తోంది… మహావిపత్తువేళ శవాల్ని ఎవరు సాగనంపితేనేం..? చివరకు తమను దగ్గరుండి కాల్చేసేవాళ్లే ఆయా శవాల బంధువులు… అంతే…!!
ఈ సమస్య తీవ్రత అర్థం కావాలంటే… ఒకే కేస్ స్టడీ… ఓ మిత్రుడి మాటల్లోనే… ‘‘మూడు హాస్పిటళ్లకు నా మిత్రుడిని తిప్పడానికి 25 వేలు తీసుకున్నాడు అంబులెన్స్ వాడు… వాళ్లనూ వీళ్లనూ బతిమిలాడి ఒక హాస్పిటల్లో బెడ్ సంపాదిస్తే అక్కడే చనిపోయాడు… సరైన చికిత్స అందకపోవడమే కారణం… డెడ్ బాడీని హాస్పిటల్ నుంచి 3 కిలోమీటర్ల దూరం నుంచి శ్మశానానికి తీసుకువెళ్లడానికి 15 వేలు అడిగాడు… బతిమిలాడితే 2 వేలు తగ్గించాడు…. అక్కడ 20 అంబులెన్సులున్నయ్… అందరూ సిండికేట్… కనీసం బాడీని కూడా లోపల పెట్టలేదు… శ్మశానం దగ్గర ఇదే దందా… కట్టెలకు 25 వేలు… కట్టెల మీద పడుకోబెట్టడానికి అయిదుగురికి ఒక్కొక్కరికీ అయిదేసి వేలు… ఇవి గాకుండా ఇతరత్రా మామూళ్లు 5 వేలు… ఈ బేరసారాలు అయిపోయే వరకైనా అంబులెన్స్ వాడు ఉండడు, అక్కడ శ్మశానంలోని స్ట్రక్చర్ మీద పడుకోబెట్టి వెళ్లిపోతాడు…’’ యోగి తీసుకున్న ఉచిత అంత్యక్రియలు నిర్ణయం గొప్పది… ఆ పెయిన్ అనుభవించేవాడికే అర్థమవుతుంది… గంగా నదిలో శవాలు కొట్టుకొచ్చే దుర్భర దృశ్యాలకన్నా ఆ గంగ ఒడ్డునే ప్రభుత్వమే దహనం చేయడం బెటర్ కదా… మిగతా ముఖ్యమంత్రులకు ఎలాగూ ప్రజలకు ఈ కష్టకాలంలో అండగా నిలవాలనే సోయి లేదు… పాలకస్థానంలో ఉండి, పట్టించుకోకపోతే… ఆ పాపానికి నిష్కృతి కూడా ఉండదు…!!
Share this Article