తూర్పు పాకిస్థాన్, అనగా ఇప్పటి బంగ్లాదేశ్ నుంచి లక్షల మంది శరణార్థులు ఇండియాలోకి వస్తున్నారు… పాకిస్థానీ సైన్యం అరాచకాలు భరించలేక రోజురోజుకూ వలసలు పెరుగుతూనే ఉన్నయ్… బంగ్లాదేశ్‌ను విముక్తం చేద్దామంటే పాకిస్థాన్‌కు అమెరికా, బ్రిటన్‌లతోపాటు చైనా కూడా సాయం చేస్తుందేమో… ఆస్ట్రేలియా కూడా జతకలుస్తుందేమో.,.. కానీ ప్రధాని కుర్చీ మీద ఉన్నది ఇందిర కదా…
మనకు బలమైన మద్దతు కావాలి… అంతకుముందే రష్యాతో స్నేహానికి సంబంధించి నెహ్రూ వేసిన పునాదులున్నయ్… దాంతో 1971… ఇండియా, రష్యాల నడుమ ‘‘శాంతి-స్నేహ ఒప్పందం’’ కుదుర్చుకున్నయ్… అంటే ఏమీలేదు… యుద్ధ ఉపద్రవం ముంచుకొస్తే ఒకరికొకరు తోడు… ఇక తూర్పు పాకిస్థాన్ మీద విరుచుకుపడి, దాన్ని విముక్తం చేయాలనే ప్రయత్నాల్లో పడింది ఇందిర…
ఎలాగోలా అమెరికాకు తెలిసింది… అధ్యక్షుడు నిక్సన్‌కు ఇండియా అన్నా, ఇందిర అన్నా మంట… రష్యాతో దోస్తీ చేస్తున్నందుకు… ఎప్పుడైతే మనం పూర్తి స్థాయి యుద్ధానికి దిగామో, దొరికింది చాన్స్ అనుకున్న నిక్సన్ తమ నేవీలోని సెవంత్ ఫ్లీట్‌ను బంగాళాఖాతం వైపు వెళ్లమని ఆదేశించాడు… అధికారికంగా ఒక సాకు ఏమిటంటే తూర్పు పాకిస్థాన్‌లో ఉన్న తమ దేశస్థుల రక్షణ… కానీ అసలు ఉద్దేశం ఇండియా నేవీని ధ్వంసం చేయడమే… పరోక్షంగా పాకిస్థాన్‌కు సాయం చేయడమే…
Ads
అమెరికా ఎంటర్‌ప్రైజ్… 75 వేల టన్నుల బరువుతో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద యుద్ధనౌక… దానిపై 70 యుద్ధవిమానాలు… అది బంగాళాఖాతం వైపు బయల్దేరింది… మన నేవీలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ జస్ట్, 20 వేల టన్నుల బరువు, 20 తేలికరకం యుద్ధవిమానాలు… దీనికితోడు మరో దుర్వార్త… ఇంకోవైపు నుంచి, అంటే అరేబియా సముద్రం వైపు బ్రిటన్ నేవీ బయల్దేరింది… దాని యుద్ధనౌకలూ బయల్దేరాయి… అవసరమైతే ఆస్ట్రేలియా నేవీ కూడా వస్తుంది… ఇండియా మీద ముప్పేట దాడి ఉంటుందన్నమాట…
ఈ యుద్ధనౌకల కదలికల్ని అప్పటికే సోవియట్ రష్యా పసిగట్టింది… రెండు బలమైన ప్రజాస్వామిక దేశాలు ఓ అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మీద దాడికి రెడీ అయ్యాయి… ఈ పరిస్థితిని ముందే ఊహించిందే కదా… రష్యాకు ఇండియా నుంచి ఎస్ఓఎస్ సందేశాలు వెళ్లాయి… రష్యా వెంటనే 16 నేవల్ యూనిట్లు, ఆరు న్యూక్లియర్ సబ్‌మెరైన్లను పంపించింది…
(బ్రెజ్నెవ్‌తో ఇందిర)
1971… డిసెంబరు రెండో వారం… బంగాళాఖాతంలోకి అమెరికా ఎంటర్‌ప్రైజ్ ప్రవేశించింది… చిట్టగాంగ్ వైపు కదులుతోంది… అరేబియా సముద్రంలోకి బ్రిటన్ నేవీ వచ్చేస్తోంది… ఇండియా ఏం చేయగలదు..? ప్రపంచం ఊపిరి బిగబట్టింది… కానీ అమెరికన్ నేవీకి, ప్రభుత్వానికి అప్పటికి తెలియని సంగతి ఏమిటంటే… రష్యన్ నేవీ రంగంలోకి నేరుగా దిగనుందనీ, అది అప్పటికే చాలా వేగంగా వచ్చేసిందని..!
అటు ఇండియా నేవీ… ఇటు అమెరికన్ నేవీ… నిశ్శబ్దంగా రష్యన్ సబ్‌మెరైన్లు సముద్రంపైకి తేలాయి… అమెరికన్ నేవీ అధికారులు బిత్తరపోయారు… వాళ్లు ఊహించని పరిణామం… కిమ్మనకుండా అటు బ్రిటన్, ఇటు అమెరికా తమ ఒరిజినల్ స్థావరాల వైపు వెనక్కి మళ్లాయి… పాకిస్థాన్ సైన్యాధికారి ఇండియాకు లొంగిపోయాడు… ఖేల్ ఖతం…
ఇలాంటి అనేకానేక సందర్భాల్లో రష్యా మన వెంటే ఉంది… తన నీడన భద్రత కల్పించింది… రాకెట్, అణు పరిజ్ఙానాన్ని ఇచ్చింది… ఇండియా మీద కక్షగట్టిన ఇదే అమెరికా, ఇదే బ్రిటన్, ఇదే ఆస్ట్రేలియాకు ఇప్పుడు మనం కావాలి… చైనాతో పోరాటానికి ఇండియా సాయం కావాలి… అందుకే క్వాడ్ అంటూ ఆ మూడు దేశాలూ మనతో జతకట్టాయి… మళ్లీ ఏమైందో అవి మూడే ప్రత్యేక కూటమిగా ఏర్పడ్డాయి… ఇప్పుడు అవసరం కదా, మళ్లీ క్వాడ్ భేటీలు వేస్తున్నారు… అమెరికా ఏమాత్రం నమ్మదగని దేశం… ఉదాహరణలు ఇంకా బోలెడు…
ప్రస్తుతానికి వద్దాం… రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తోంది… దాని కారణాలు దానికున్నయ్… ఆ దాడి కరెక్టో కాదో వదిలేస్తే మనం మాత్రం తటస్థం… రష్యాను తప్పుపట్టలేం… మన అవసరాలు, మన కారణాలు మనకున్నయ్… అదేసమయంలో అమెరికా, నాటో, యూరప్ దేశాలకు వ్యతిరేకంగా కూడా స్పందించడం లేదు… ప్రపంచం మళ్లీ రెండు బలమైన ధ్రువాలుగా చీలిపోతోంది… మనం ఎటువైపు..? కాలం తేల్చబోతోంది… సో, రష్యా దాడిని ఎందుకు ఇండియా ఖండించడం లేదు అనే ప్రశ్నలకు ఇదీ ఓ చిన్న జవాబు..!!
Share this Article