.
న్యాయస్థానాలలో తెలుగు అమలు…. సుసాధ్యమే… కోరిసెపాటి బాలకృష్ణారెడ్డి, .బియస్సీ, బి ఎల్, విశ్రాంత న్యాయమూర్తి –ఒంగోలు
***
మనం తెలుగు వాళ్ళం.
మన భాష తెలుగు .
తెలుగులో మాట్లాడడం
మన విధి, హక్కు, బాధ్యత.
అయితే తరతరాలుగా, ఆంగ్ల పరిష్వంగంలో నలిగి నలిగి
కొన్ని దశాబ్దాలుగా ఈ విషయం మరిచిపోయాం, విస్మరించాం.
ముఖ్యంగా మన రాష్ట్రంలోనే ఏ ఇద్దరు ఎదురైనా ఈ ఆంగ్లంలో మాటాడుకునే దౌర్భాగ్యం . వీళ్ళే సుమా తెలుగు వాళ్ళు- అని పరాచికమాడే, వింత విచిత్ర పరిస్థితికి దిగజారింది .
ఇప్పుడు మనం న్యాయస్థానాలలో తెలుగు అనే విషయం గురించి ముచ్చటించుకుందాం .
న్యాయస్థానాలలో వుండే వారు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు, నేరస్తులు, ముద్దాయిలు, వగైరా.. నిత్యం .. అక్కడ వాదోపవాదాలు జరుగుతుంటాయి . కొన్ని వందల వేల తీర్పులు వెలువడుతుంటాయి.
Ads
న్యాయస్థానాలకు వచ్చే కక్షిదారులకు ఎక్కువమందికి ఆంగ్లం తెలియదు . చట్టాలు తెలియవు. అయినా నిత్యం అక్కడ వాదనలు ప్రతి వాదనలు వాగ్యుద్దాలు, ఆంగ్లంలోనే హోరాహోరిగా జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏమి జరుగుతున్నదో తెలియక , కక్షిదారులు ఇంగ్లిషు సినిమా చూస్తున్నట్టు బిక్కమొహాలు వేసుకొని బిడియంగా చోద్యం చూస్తుంటారు.
ఈ గందరగోళంలో తన జీవితం భవితవ్యం ఏమి కానున్నదో వారికీ బోధపడదు. ప్రభుత్వ న్యాయవాది, తన న్యాయవాది, ఇద్దరు తనను తెలుగులోనే ఏదో గుచ్చి గుచ్చి అడుగుతారు. న్యాయమూర్తి దానిని ఆంగ్లంలోకి అనువదించి నమోదు చేసుకుంటారు .
అక్కడ ఏం వ్రాశారో తనకు తెలియదు . తన బ్రతుకు ఎలా తెల్లవారనున్నదో అర్ధం కాదు . ఆ తర్వాత వాదోపవాదాలు పొట్టేళ్ళలా పోట్లాడుకొంటూ చిత్ర విచిత్ర విన్యాసాలు ..
కక్షిదారులు అనుకుంటారు ‘’తమకు తెలిసిన భాషలో పోట్లడుకొంటే ఎంత బాగుండేది’’ అని .. ఇలా తన ముందే తన గురించే , తన భవిష్యత్తు నిర్ణయించే తీర్పు దాకా ఆంగ్లంలో పరాయిభాషలో అక్కడ
మొత్తం కధ చిత్రంగా నడిచి పోతుంది .. ఒక దారుణమైన కుట్ర జరిగి పోతుంది..
పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అమాయక రైతు ఇంకా అమాయకంగా ఇలా అడుగుతాడు ‘’అయ్యా ! న్యాయం
పరాయి భాషలోనే వుందా, మన భాషలో లేదా ‘’
అతని ధర్మ సందేహం వింటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. నేను నా ఉద్యోగ నిర్వహణలో , ఈ వింత దయనీయమైన పరిస్థితిని గమనించాను . అమాయకంగా ఎదుట నిలబడ్డ ముద్దాయిని, అరకొర విజ్ఞానంతో నా ముందు విన్యాసాలు చేస్తూ ఆంగ్లంరాక, వచ్చినా సరిగా విడమరిచి చెప్ప లేక, తొట్రుపడుతున్న న్యాయవాదిని, పోలీసు అధికారిని చూచి జాలిపడ్డాను..
1 9 7 4 లోనే మన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చింది .. తెలుగులో తీర్పులు ఇవ్వాలని తెలుగు టైపు యంత్రాలు సమకూర్చింది.. తెలుగు నేర్చిన సిబ్బందిని నియమించింది . కాని అనతికాలంలోనే అన్ని వృధా ఐపోయాయి .. కాలగర్భంలో కలిసిపోయాయి .
అనువాదం అనేది ఎంత దుర్భరంగా దుస్సహంగా వుంటుందో ఒక చిన్న ఉదాహరణ .. ఆంగ్ల పరిభాషలో
వాంగ్మూలం నమోదు చేసే వేళ ‘blood stained earth ‘ అనే పదానికి ‘యుద్ధభూమి’ అని పలికిన అనువాదకుని
చూసి, జిల్లా న్యాయమూర్తి కోపంగా .. నీ బొంద, అది ‘’నెత్తురు తడిసిన మట్టి’’ అని విసుక్కోవడం చూశాను.
ఇలాంటి తికమక సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో .. ఎందుకీ వృధా ప్రయాస, తెలుగు భాషలో నమోదు చేసుకోవడం తేలిక కదా అనిపించింది. ఇప్పటిదాకా రాష్ట్రంలో అక్కడక్కడా న్యాయమూర్తులు తెలుగులో తీర్పులు వెలువరిస్తూనే ఉన్నారు. కాని అది వేళ్ళ మీద లెక్క పెట్టదగిన సంఖ్య మాత్రమే . న్యాయపాలన
మాతృభాషలో ఉంటేనే ప్రజలకు నమ్మకం పెరుగుతుంది,. నిజమైన న్యాయం జరుగుతుంది .
చిత్రమేమిటంటే ఆంగ్లేయుల పాలనలో వాదోపవాదాలు తెలుగులో జరిగాయి. అప్పటి న్యాయ స్థానాలు తెలుగులో తీర్పులు ఇచ్చాయి. ఇంకా ఆశ్చర్యమేమిటంటే స్వాతంత్ర్యం అనంతరం, తెలుగులో తీర్పులు ఆగిపోవడం, న్యాయమూర్తులు ఆంగ్లం బాట పట్టడం శోచనీయం.
ఈ విషయమై, మాన్యులు ఏ బి కే ప్రసాద్ గారు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్నపుడు, ఆయన
చేసిన కృషి అభినందనీయం . అక్కడక్కడా న్యాయమూర్తులు తెలుగులో తీర్పులు ఇచ్చిన విషయం
తెలుసుకొని, వాటిని సేకరించి ‘’న్యాయస్థానాలలో తెలుగు తీర్పులు ‘’ అనే ఒక గ్రంధం ప్రచురించి అన్ని న్యాయస్థానాలకు, అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు .
అందులోని పదిమంది న్యాయమూర్తుల సరసన ఈ వ్యాసకర్త రెండు తీర్పులు సైతం చోటు చేసుకున్నాయి. నేను ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లో తెలుగులో కార్యకలాపాలు, రిజిస్టర్లు అన్ని తెలుగులోనే ఉండడం చూశాను. కాలక్రమేణా అవి కాలగర్భలో కలిసిపోయాయి .
అప్పుడపుడు ప్రభుత్వం ఈ విషయమై ప్రకటనలు చేస్తూనే ఉన్నా, అవి కంటి తుడుపు చర్యలుగా మిగిలిపోతున్నాయి. కారణం .. ఈనాటి న్యాయమూర్తులు ఎక్కువగా ఆంగ్లంలో చదివినవారు కావడం .. వారికీ తెలుగులో రాయడం అనేది సహజంగా అసాధ్యం .. పైగా న్యాయపరమైన ఉత్తర్వులు సంబంధ పత్రికలు అన్నీ అంగ్లలోనే వున్నాయి .. వాటిని అధిగమించి , తెలుగులో కార్యకలాపాలు కొనసాగించడం వీరికి ఇబ్బందికరమైన విషయమే…
నిజానికి మనమందరం తెలుగులోనే ఆలోచిస్తాం.. తెలుగులోనే కలలు కంటాం .. మన ఆలోచనలు కలలు
ఆంగ్లంలో వుండవు . ఆవేదన, ఆగ్రహం పెల్లుబికినప్పుడు మాత్రమే – తెలుగు వాడు తెలుగును వాడుతాడు అని నానుడి .. తన అసలు భాష, హృదయభాష ఆగ్రహావేశాలు పెల్లుబికినపుడు మాత్రమే బయటపడుతుంది.
నాకు తెలిసి, విషయం ఏదైనా కానీ .. ముందుగా తెలుగులో అనుకొని, విశ్లేషించుకొని అప్పుడు దానిని ఆంగ్లంలోకి తర్జుమా చేస్తాం .. ఒక తీర్పును అర్ధం చేసుకోవాలంటే, ముందుగా భాషా పరిజ్ఞానం ఉండాలి, అది తెలుగు కానీ ఆంగ్లం కానీ .. కనుక , తెలుగులోనే మొత్తం వ్యవహారం ఉండొచ్చు కదా .. ఎందుకో నాకు ఇది
చాటుమాటు వ్యవహారం అనిపించింది .
కష్టపడి ఆంగ్లంలో తడబడుతూ వాంగ్మూలం ఇస్తున్న పొలీసు అధికారులను ఆంగ్ల భాష రాని , సాక్షులను చూచి జాలిపడి , వారి భాషలోనే , అంటే తెలుగులోనే చెప్పమన్నాను, వారు చెప్పినదే తు.చ. తప్పక నమోదు చేశాను. అంతేకాదు, అప్పటిదాకా ఆంగ్లంలో ఉన్న సమన్లు, వారంట్లు వగైరా అన్ని పత్రాలను తెలుగులోకి మార్చాను .
కార్యాలయంలో జరిగే అన్ని వ్యవహారాలు తెలుగులోకి మళ్ళించాను. కడకు హాజరు పట్టిలు కూడా .. నాకున్న ఒకింత కవితా పరిజ్ఞానం ఇందుకు ఎంతో దోహదం చేసింది.. నేను నా తీర్పుల్ని తెలుగులో నా లాప్ టాప్ మీద టైపు చేసాను. జిల్లా న్యాయమూర్తులు నా తీర్పు ప్రతులు అందుకొని అభినందించారు .
అలా ఒకటి రెండు రాశాక ఆ తర్వాత ఎంతో సులభం అనిపించింది. అక్షరం పొల్లు పోకుండా కక్షిదారుని మాటలు యధాతధంగా నమోదు చేసినప్పుడే నిజమైన తీర్పు వస్తుంది . ఆంగ్లంలో ఒక చిన్న పదం తారు మారై అర్ధం మారి తీర్పులు తారుమారైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
న్యాయ పదజాలం అంత కఠినమైనదేమీ కాదు.. కాకుంటే చిత్తశుద్ధి ఉండాలి . కొన్ని పారిభాషిక పదాలు ఆంగ్లం, ఉర్దూ భాషల నుంచి మన మధ్యకు వచ్చి చేరాయి . రైలు బస్సు వంటి పదాలు మన దైనందిన జీవితంలో చొరబడి అలవాటుగా మారిపోయాయి ..
నిజమే, అంతగా అనువాదం సులభసాధ్యం కానప్పుడు, తెలుగు పదం ఇంకా కఠినం అనిపింఛినప్పుడు, అదే ఆంగ్ల లేక ఉర్దూ పదాన్ని తెలుగు లిపిలో వ్రాయవచ్చు అవి జనబాహుళ్యంలోకి వాడుక పదాలుగా వచ్చాయి కాబట్టి.
ఉదాహరణకు కొన్ని…… క్రిమినల్ ప్రోసిజర్ కోడ్,/ గేమింగ్ ఆక్ట్, / ప్రాసిక్యూషన్ వారు/ లాప్ టాప్/ అరెస్టు/ టెలిఫోన్/ స్టేషన్/ స్టేట్మెంట్/ …… అలాగే కొన్ని పదాలు, పదేపదే వచ్చేవి …. జామీను దార్లు/ వాది /ప్రతివాది/ ఫిర్యాది/ న్యాయవాది/ ఉభయుల వాదనలు/ విచారణ/ అభియోగాలు/ సాక్షులు/ మధ్యవర్తి/ చట్ట ప్రకారం…….
ప్రతి వాంగ్మూలం ఆంగ్లంలో నమోదు చేసుకొని , దానిపై సదరు సాక్షి సంతకం తీసుకొనడం రివాజు .. వాంగ్మూలం చివర సదరు వ్యక్తికి ‘తెలుగులో వినిపించి’ అని ఉంటుంది కానీ , అంత ఓపిక తీరిక న్యాయస్థానానికి ఉండదు ..
అమాయక కక్షిదారులు అందులో ఏముందో అర్ధం కాకపోయినా వేలి ముద్ర వేస్తారు , సంతకం చేస్తారు. ఇలా
అందులో ఏముందో తెలియకుండా సంతకం చేయడం ఏ మాత్రం న్యాయసమ్మతం కాదు.. తెలుగులో తీర్పులు ఇవ్వడం అనేది బ్రహ్మవిద్య కాదు, బ్రహ్మ పదార్ధం అంతకన్నా కాదు అని నా ఉద్దేశం.
.. నాలుగైదు తీర్పులు వెలువరించాక, తెలుగు ఎంతో సులభం అనిపిస్తుంది.. తేలికగా సునాయాసంగా అవలీలగా తీర్పును వెలువరించే పరిజ్ఞానం దానంతట అదే అలవడుతుంది . అలా తెలుగులో వచ్చిన తీర్పుని పల్లెటూరి చదువురాని రైతు సైతం, హాయిగా చదివించుకొని తెలుసుకోగలడు . తన తీర్పు తనే వినగలడు , అర్ధం చేసుకోగలడు ..
అలా అర్ధం కాకపోతే అతడికి అన్యాయం అనర్ధం జరిగే అవకాశముంది . గతంలో ఆంగ్లంలో అర్ధం కాని పదాలతో తీర్పులు ఇచ్చిన వారున్నారు . అందులో ఏముందో తెలుసుకోలేక బుర్రలు బద్దలు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు . అందుకే తెలుగులో తేలిక భాషలో చదవగానే సులువుగా బోధపడేలా తెలుగులో తీర్పులు ఉన్నపుడే అది సాధ్యం.
అందుకే న్యాయమూర్తులకు విన్నపం …. మీరు తెలుగులోనే ఆలోచిస్తారు కదా .. తెలుగులోనే మొత్తం
వింటారు కదా.. ఆ తెలుగులోనే కార్యకలాపాలు నడపండి.. తెలుగులోనే తీర్పులు వ్రాయండి .. ఒకటికి రెండు.. పదిసార్లు రాశాక ప్రావీణ్యం దానంతట అదే వస్తుంది .. అది అలవాటై పోతుంది . నేను అలాగే వ్రాయగలిగాను.
అప్పుడే న్యాయస్థానం తలుపు తట్టిన అమాయక కక్షిదారునికి తగిన న్యాయం జరుగుతుంది. మరో ముఖ్యమైన అంశం .. ఆంగ్లంలో అక్షరాలు తక్కువ . అందువలన అన్ని భావాలను అవి మొయ్యలేవు .అదే తెలుగు భాష 5 6 అక్షరాలు గలిగి, భావాన్ని సూటిగా ధాటిగా వ్యక్తపరిచే గుణమున్న భాష.
ఆంగ్లంలో మాదిరి ఒకే పదానికి రెండు మూడు అర్ధాలు వచ్చే పరిస్థితి ఉండదు .. తికమక అసలే ఉండదు. ఇలా ఎన్నో కారణాల వలన మన తెలుగు నేలపైన తెలుగు భాష ఆవశ్యకత ఎంతో ఉన్నది .. ముఖ్యంగా జాతికి
నీతి నియమాలు నిర్దేశించే న్యాయస్థానాలలో తెలుగును ప్రవేశ పెట్టడం అత్యవసరమై ఉన్నది ..
అందుకే తేట తెలుగుతో న్యాయస్థానాలను నింపేద్దాం.. తెలుగు నేలపై తెలుగు వెలుగులు పూయిద్దాం .. మన తెలుగు భాషలోనే మాట్లాడుకుందాం .. అట్టడుగున ఉన్న. వారికీ అమాయక తెలుగు ప్రజానీకానికి, అసలైన
న్యాయాన్ని అందిద్దాం ………..
Share this Article