ఒక ఫోటో గుర్తుందా..? వనమా రాఘవ అనే కిరాతకుడి వేధింపులకు ఓ కుటుంబం నిలువునా నిప్పుకు ఆహుతైపోయిన విషాదం గుర్తుందా..? అన్ని పత్రికలు తన చరిత్ర రాశాయి… పోలీస్ కేసు, బెయిల్, బయటికి వచ్చేశాడు… ఇప్పుడు ఆయన గారి తండ్రి గారు శ్రీమాన్ వనమా వెంకటేశ్వరరావు ఏమంటున్నాడో తెలుసా..? అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్ చేస్తూ… ”2 నెలలు ఆరోగ్యం బాగాలేదు, నేను లేని సమయంలో కొందరు కుట్ర చేసి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కావల్సిన నా కొడుకు రాజకీయ భవిష్యత్తు ఆగం చేశారు… నా ఆరోగ్యం బాగుంటే ఈ స్థితి వచ్చేది కాదు… అందరి బండారం బయటపెడతా… రాఘవపై ప్రజల్లో సానుభూతి పెరిగింది… ఈ కేసు కోర్టులో నిలవదు…’’
ఇలాంటి సమయాల్లోనే అనిపిస్తుంది… సీఎంగా ఒక యోగి ఉంటే ఎంత బాగుండు..? అధికార పార్టీ ఎమ్మెల్యే తన కొడుకును వెనకేసుకొస్తూ, ఇక ఒక్కొక్కడి బండారం బయటపెడతానని అంటున్నాడు… అంటే ఇక తనే నేరుగా యాక్షన్‌లోకి దిగుతాడా..? కేసీయార్‌కు వీళ్ల చరిత్ర తెలుసు కదా..? జరిగిన విషాదం తెలుసు కదా..? తన పోలీసులే కదా రిమాండ్ రిపోర్టు రాసింది..? జైలుకు పంపింది..? మరీ ఏం చర్య తీసుకున్నట్టు..? జస్ట్, రాఘవను పార్టీ నుంచి పంపించేస్తే సరిపోయిందా..? అసలు తనకు ఈ ధైర్యం ఏమిటి..? అధికారమే కదా… అది ఎవరి వల్ల భరోసా ఇస్తున్నది..? దాన్ని ఎందుకు కత్తిరించలేకపోయినట్టు..? కేసీయార్ తన చొక్కా మీద పడిన మరకల్ని ఎందుకు తొలగించుకోవడం లేదు..? ఒక ఎమ్మెల్యే అంటే అంత గగుర్పాటా..?
Ads
వీళ్లను ఉపేక్షించడం వల్ల సగటు తెలంగాణ మహిళకు కేసీయార్ ఏం సంకేతం ఇస్తున్నట్టు..? నిలువునా అగ్నిజ్వాలల్లో తగులబడిపోయిన ఆమె మొహం ఓసారి గుర్తు తెచ్చుకోవచ్చు కదా… ముద్దొచ్చే ఆ పిల్లల మొహాల్ని ఓసారి గుర్తు తెచ్చుకోవచ్చు కదా… నీ పార్టీ నాయకుడి నైచ్యమేమిటో గుర్తు తెచ్చుకోవచ్చు కదా… ఇదేనా, తెలంగాణ సమాజం కోరుకున్నది..?
ఇలాంటోళ్లు నాకు అస్సలు అక్కర్లేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నట్టు..? ఆ కుటుంబం ఉసురు, వాళ్ల కారణంగా సర్వావస్థలు పడిన వాళ్ల కన్నీళ్ల ఉసురు అంతిమంగా తగిలేది ఎవరికి..? ఇదేకాదు, ఈమధ్య అక్కడెక్కడో ఓ డిప్యూటీ చైర్మన్ సాజిద్ నిర్వాకమూ ఇలాంటిదే కదా… కొరడా పట్టుకుని యాక్షన్‌లోకి దిగడం కేసీయార్‌కు చేతకాదా..? అబ్బే, కేసు పెట్టాం కదా, విచారణ జరుగుతుంది, నేరం నిరూపితమైతే కోర్టు శిక్షిస్తుంది అనే సమర్థనలు కాదు… అసలు నైతిక బాధ్యులకు సంపూర్ణ బహిష్కరణ, నిషేధం ఎందుకు వద్దు..?
పోలీసులు చెబుతున్నది, ఆ ఏరియా సమాజం చెబుతున్నదీ, మీడియా రాసిందీ నిజమని నమ్మితే… పార్టీపరంగా ఆ ఎమ్మెల్యే పట్ల కేసీయార్ అనుసరించాల్సిన వైఖరి ఏమిటి..? పోనీ, టీఆర్ఎస్ నుంచి తరిమేసినా సరే, ఫలానా నాయకుడిని మా పార్టీలోకి తిరిగి ఏ స్థితిలోనూ రానివ్వం అని బీజేపీ, కాంగ్రెస్ ఎందుకు చెప్పడం లేదు..? ఈ ప్రకటనలు బీజేపీకి చేతకాదా..? కాంగ్రెస్‌కు చేతకాదా..? తెలంగాణ చైతన్య సమాజం స్పందన కూడా ఇలా ఉందేమిటి..? అందుకే ఒక్కోసారి అనిపిస్తుంది… మనకూ ఓ యోగి ఉంటే ఎంత బాగుండు..?!
Share this Article