‘‘బీమ్లానాయక్ గురించి సినిమా పెద్దలు ఒక్కరూ మాట్లాడటం లేదు, ఇండస్ట్రీ మాట్లాడటం లేదు… వాటీజ్ దిస్ దారుణం’’ అని నాగబాబు అలియాస్ పవన్ కల్యాణ్ బ్రదర్ అలియాస్ చిరంజీవి బ్రదర్ మాట్లాడుతుంటే నవ్వొచ్చింది… సోషల్ మీడియాకొచ్చి శోకాలు పెట్టడం దేనికి..? ఒక్కసారి చిరంజీవి దగ్గరకు వెళ్లి ‘‘హన్నయ్యా, హేమిటి ధారుణం..?’’ అని ఒక్క మాట అడగొచ్చు కదా… ఎలాగూ తమ్ముడు ఎత్తిచూపాడు కదా, వంగి వంగి దండాలు పెట్టడం దేనికీ అంటూ..!
పవన్ కల్యాణ్ టెంపర్‌మెంట్‌కు ఆఫ్టరాల్ ప్రస్తుతం ఏ రాజకీయ నేపథ్యమూ లేని చిరంజీవిని అడగడం నామోషీ అనుకుందాం… నాగబాబు వెళ్లి అడగొచ్చు కదా… పోనీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సిండికేట్ లీడర్ కదా, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్‌ను అడగొచ్చు కదా… మీ మెగా క్యాంప్ సూపర్ హీరో కదా, బన్నీని అడగొచ్చు కదా… ఒక్క నాని తన సినిమా కోసం మాట్లాడాడు… ఇప్పుడు ప్రకాష్‌రాజ్ అనే ఓ కేరక్టర్ ఆర్టిస్టు మాట్లాడుతున్నాడు, ఇక ఒక్కరిని చూపించు…
చివరకు ప్రస్తుతం పదవిలో ఉన్న బాలకృష్ణ కూడా ఘర్షణకు పోలేదు… ఎందుకు..? అది కదా ఆత్మసమీక్ష చేసుకోవాల్సిన పాయింట్… ఎస్, జగన్ రెండు పడవలపై కాళ్లు వేసి ప్రయాణించేవాడు కాదు… ప్యూర్ రాజకీయవేత్త… పవన్ కల్యాణ్‌ను ప్రత్యర్థిగానే పరిగణిస్తాడు… వీలున్న ప్రతిచోటా తొక్కాలనే ప్రయత్నిస్తాడు… రాజకీయాల్ని, సినిమాల్ని తను వేరుగా చూడడు… చూడాల్సిన పనిలేదు… కానీ పవన్ కల్యాణ్ సినిమా నటుడా..? రాజకీయ నాయకుడా..?
Ads
హీరో పాత్రకు, పొలిటిషియన్ పాత్రకు నడుమ గీత గీసుకోగలుగుతున్నాడా..? నన్ను తొక్కలేరు, నా సినిమాను ఆపలేరు, అవసరమైతే ఫ్రీగా చూపిస్తాను అని ఏదో అప్పట్లో అన్నట్టు గుర్తు… మరి జరిగిందేమిటి..? బీమ్లానాయక్ సినిమాకు మాత్రమే నష్టదాయకమా..? మరి బంగార్రాజు, అఖండ, పుష్పల మాటేమిటి..? బాగానే సంపాదించుకున్నారు కదా..! మీరూ అలాగే రిలీజ్ చేసుకున్నారు కదా… మరింకా ఇండస్ట్రీ మీద శోకాలు దేనికి..? అప్పట్లో ఆఫ్టరాల్ శ్రీరెడ్డి ఇష్యూ సమయంలోనే ఇండస్ట్రీ మద్దతు ఇవ్వడానికి రెడీ కాలేదు… ఇప్పుడు జగన్‌తో గోక్కుంటుందా..?
ఇది ఓ దందా… ఎవడి స్వార్థం వాడిది… ఎవరైనా సర్కారుతో ఎందుకు గోక్కుంటారు..? అసలు పలువురు హీరోలు, ఒకరిద్దరు దర్శకులు మినహా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది ఎవరు..? అన్నిరకాల సంఘాలతో కూడిన ఫిలిమ్ ఛాంబర్ ఏమైంది..? అసలు సమస్య ఎగ్జిబిటర్లది కదా… ఆ సిండికేట్ ఏమైంది..? పోనీ, గతంలో ఎప్పుడైనా పవన్ సినిమా ఇండస్ట్రీ ఇష్యూల మీద మాట్లాడిన దాఖాలాలున్నాయా..? అసలు తనను రాజకీయ నాయకుడిలా చూడాలా..? ఇండస్ట్రీ సభ్యుడిగా చూడాలా..?
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీయార్ సినిమాకు అడ్డంకులు ఎదురైతే… ఎవరైనా మాట్లాడారా..? అసలు పెద్దరికంతో మాట్లాడగలిగే స్టామినా ఉన్నవాళ్లెవరున్నారు ఇండస్ట్రీలో..! వెన్నెముక ఉన్న నిర్మాతలో, దర్శకులో ఎవరున్నారు..? కాస్తోకూస్తో ప్రయత్నిస్తున్న చిరంజీవికే ఇలా సొంత కుటుంబ సభ్యుల నుంచే విమర్శలు ఎదురైతే ఎలా..? అధికారంలో ఉన్నవాడికి ఖచ్చితంగా అహం ఉంటుంది… జగన్ ఏమీ వివేకానంద స్వామి కాదు… తను అలాగే ఉంటాడు… అయ్యో, ఎవడూ మాకు సపోర్ట్ చేయడం లేదు అనే శోకాలు కాదు, ఈ స్థితి ఎందుకొచ్చింది అని కదా ఆత్మవిమర్శ చేసుకోవల్సింది… ఐనా నాగబాబు మెచ్యూరిటీ లెవల్స్ ఆ పనిచేయనిస్తాయా..?!
Share this Article