Gurram Seetaramulu……… పుట్టని బిడ్డకు పేరు పెట్టి మురిసే సంతానాలు ఉంటాయి. రాయని కావ్యానికి సమీక్ష చేసే తెంపరులు ఉంటారు. చరిత్ర స్పృహ ఎరగని, త్యాగం విలువ తెలియని పాలనలో ఉన్నాము. తొమ్మిదేళ్ళకే దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటుంటే ఎవరయినా దశాబ్ది ఉత్సవాలు పదేళ్ళు నిండాక చేసుకుంటారు కదా అని ఒక్క బుర్ర ఉన్న మేధావి అడగలేదు. రాజు గారి వస్త్రాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చంకీల రంగు గురించి, వజ్రపు పొదుగులు పొదిగిన రాజు గారి కోటు గురించి రాసే విదూషకులు మనకు చానా మంది ఉన్నారు. ఒకప్పుడు పత్రికల్లో ఇప్పుడు టివి డబ్బాల ముందు కొత్త అవతారాలు ఎత్తుతున్నారు.
ప్రసిద్ద శిల్ప కారుడు రమణారెడ్డి రూపొందించిన తెలంగాణ స్మారకస్థలి ఈ రోజు ప్రారంభం అవుతోంది. ఆయన నాకు వ్యక్తిగతంగా తెలుసు. మంచి ఆర్టిస్టు. ప్రపంచంలోనే పెద్ద స్టీంలెస్ భవనం అయిన ఈ స్మారక స్థలి నిర్మాణానికి వంద టన్నుల ఇంపోర్టెడ్ స్టీలు, పన్నెండు వందల టన్నుల ఇనుము, వందల కోట్ల విలువైన మూడెకరాల స్థలం, అక్షరాలా నూటా డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.
సరే, అమరుల త్యాగానికి చిహ్నంగా కట్టిన ఈ స్మారకంలో అమరుల వివరాలు ఎందుకు పెట్టడం లేదో అర్ధం కావడం లేదు. చనిపోయిన వాళ్ళ వివరాలు సేకరించడం పెద్ద కష్టం కాదు కానీ సేకరణ కష్టం అని పాలకుల లోపాన్ని పాలన డొల్లను సమర్ధించే పృచ్చకుల గానాలు కూడా మొదలైనాయి. అమరుల త్యాగాల మీద నిలబడ్డ తెలంగాణా వీరోచిత కాలాన్ని ఒక రెండు దశాబ్దాలకు కుదించిన తెంపరితనం ఒక కుటుంబ కురూపితనం కనబడుతోంది. తెలంగాణ అంటే కల్వకుంట్ల అనే పెద్ద కుట్రలో భాగమే అమరుల జాడలేని ఈ స్మరణిక.
Ads
అమరుల జాడ వెతుక్కోవడం నిజంగా కష్టమా ? కొంచం చరిత్ర లోకి పోదాము.‘బుక్ ఆఫ్ నేమ్స్’ ఒక ఒక పెద్ద పుస్తకం ఉంది. ఆ పుస్తకం హంతక నాజీల ఊచకోతకు బలైన యూదుల పేర్లతో కూడినది. అది పెద్ద పుస్తకం. కొన్ని అడుగుల ఎత్తు ఉండే ఆ పుస్తకం (26.45 feet (8 meters) in length, 6.56 feet (2 meters) high, and 3.3 feet (one meter) wide) ఒకటి అమెరికాలో, మరొకటి పోలెండ్ Auschwitz లో ఉంది. మరెక్కడయినా ఉందో లేదో నాకు తెలీదు. రెండో ప్రపంచ యుద్దకాలంలో చనిపోయిన ప్రతి సైనికుని పేరు గ్రంధస్తం అయ్యింది. వాళ్ళ సమస్త వివరాలు వస్తువులు స్థల కాలాల వివరాలు సమగ్రంగా గుది గుచ్చిన సేకరణ అది.
ఆ కాలంలో లండన్ కేంద్రంగా నడిపిన ఒక తెలుగు వార్ మాగజైన్ (యుద్ద సంచిక) వేయి పేజీల పుస్తకం నా దగ్గర ఇప్పటికీ ఉంది. అందులో ఎంతో విలువైన అమరుల జాడలు యుద్ద ఘోరాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో నలభై ఎనిమిది లక్షల మంది చనిపోయిన మాయం అయిన/బాధిత/అమరుల పేర్లు ఉన్నాయి. ఆ పెద్ద పుస్తకంలో ఇంకా చేర్చాల్సిన రెండు లక్షల మంది కోసం కొన్ని పేజీలు ఖాళీగా ఉంచి గోడకు వేలాడ దీసారు. ఈరోజుకీ ఆ లిస్టులో ఒక్కొక్కరు చేరుతూనే ఉన్నారు. పదేళ్ళ కింద ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ ఆ ఘోరకలిలో చనిపోయిన వాళ్ళ మామ, సంబంధీకుల పేర్లు చదువుతున్న ఫోటో నెట్టింట నేటికీ ఉంది.
ఈ ఘటన ఎప్పుడో క్రీ.పూర్వం జరగలేదు. ఈ ఘటన జరిగాక పదేళ్ళు అటూ ఇటుగా తెలంగాణ ఉద్యమం మొదలైనది. ఆనాడు ఎన్నో పత్రికలు ఉన్నాయి. ఆ ఉద్యమాన్ని చూసిన వాళ్ళు ఎందరో సజీవంగా. ఎన్నో ఆత్మకథలు ఇతర సాహిత్యం వచ్చింది. తెలంగాణ ఉద్యమం మొదలై అరవై డెబ్బై ఏళ్ళు అంటే మన సమీప గతం. ఇదేదో వందల ఏళ్ళ కింద ముచ్చట కాదు. ఏ ఖండ ఖండాంతరాలలోనో చెదిరి పోలేదు, చెరిగి పోలేదు. మనతోనే సజీవంగా ఉంది. కావాల్సింది డొక్కశుద్ధి. రాయదగ్గ నిబద్దత గల్ల పెన్ను. పెన్నులు గన్నులై ఘర్జించిన కాలంలో… అవే పెన్నులు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేస్తూ, బానిసకొక బానిస తిష్ట వేసిన పాడు కాలం అయినా ఆ పేర్లు సేకరించడం పెద్ద కష్టం కాదు. కాకుంటే ఆ అనామక వీరుల చరిత్రలు ఎంత అనామకంగా ఉంటే ఆ ఉద్యమం మీద ఊరేగుతున్న పాలకులకు పృచ్చకు కు అంత మంచిది.
ఈ మధ్య కొత్త చరిత్ర అనే మాట వింటున్నా చరిత్రకు కొత్త పాత ఉండదు. ఒక రాయి దగ్గరకు పోవడం ఇది మేమే కనిపెట్టాము అని ఫోటో దిగడం. ఆ రాయి వందల వేల ఏళ్ళుగా అక్కడే ఉంది. అలాంటి ఎన్నో శాసనాలు ముద్రితం అయ్యాయి. జనాలకు రాళ్ల మీద రప్పల మీద ఉన్న యావ పోయిన అమరుల మీద ఉండదు.
మనకు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఉంది. సాహిత్య అకాడమీ ఉంది. మ్యూజియాలు ఉన్నాయి. హిస్టరీ కాంగ్రెస్, కళా కథన రూపాలు ఉన్నాయి. ఎన్నో పత్రికలు ఉన్నాయి. ఎందరో ఆర్గానిక్ స్కాలర్లు ఉన్నారు. వాళ్ళు అవార్డుల దగ్గరో భజన దగ్గరో ఉండరు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. కొందరిది జీవన మరణ సమస్య. మరి ఎందుకు తెలంగాణ అమరుల జాడ సమగ్రంగా సేకరణ జరగడం లేదు. యూదులలాగా అమరులు లక్షల్లో లేరుగా. మహా అంటే రెండు వేలమంది. తొమ్మిది జిల్లాలు. పది మంది తలా ఒక జిల్లా బాధ్యత తీసుకున్నా రెండేళ్ళలో వెచ్చించిన ప్రతి తూటా సమాచారం సేకరించవచ్చు. కావాల్సింది డొక్క శుద్ధి.
నాడు సీమాంధ్ర పత్రికలు ఎక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణలో నడిచిన పత్రికల పాత్ర చిన్నది కాదు. గ్రంధాలయ ఉద్యమం దాచేస్తే దాగని సత్యం. గోల్కొండ పత్రిక, హితబోధిని, రయ్యత్, సియాసత్, సుజాత, హిందూ (మద్రాస్) ఈ పత్రికల డెబ్బై ఎనభై ఏళ్ళ పత్రికలు తెలంగాణ సజీవంగా ఉన్నాయి. మరి అమరుల జాడ ఎందుకు దొరకడం లేదు ?
డిపార్టుమెంటు ఆఫ్ కల్చర్ కోట్లు పుస్తకాలు వేసింది. భజన మాత్రం తీరొక్క రాగంలో ఉంది. తొమ్మిది జిల్లాల అమరుల సేకరణ కోసం ఒక టీం ఎందుకు ముందుకు రావడం లేదు. వీటి కోసం కొంత గ్రాంటు ఉండాలి అని ఎందుకు ఏ బుద్ధి జీవి అడగడం లేదు ? పోయినోడు మనోడు, రక్త మాంసాల తల పోతలతో బ్రతికినోడు , అవి మన తీపి గుర్తులు. వాడు ఇక రాడు . వాణ్ని వర్తమానం విస్మరించ వచ్చు గాక. కాలం కాపలాగా అమరుల త్యాగాలను నమోదు చేసే చేతులు ఏదో ఒకరోజు రాకమానవు. ఏనాటికి అయినా ఈ స్మరణిక నిజమైన అమరుల వారసుల పాద ధూళితో పునీతం అవుతుంది అనే ఆశతో….. డా.గుఱ్ఱం సీతారాములు
Share this Article