Bharadwaja Rangavajhala……… బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రం అన్నప్పుడు రాసింది…
…తెలుగు సినిమాకు స్వర్ణ కమలం వచ్చింది.తెలుగు సినిమా బాహుబలి ఉత్తమ జాతీయ చలన చిత్రంగా అవార్డు సాధించింది.1954 లో జాతీయ చలన చిత్ర పురస్కారాలు ప్రారంభమైన రోజు నుంచీ తెలుగు సినిమాకు జాతీయ పురస్కారం కోసం ఎదురు చూసిన వాళ్ల మనసులు కుదుట పడేలా బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రంగా స్వర్ణకమలం సాధించింది.నిజానికి 1955లోనే ఈ కల సాకారం కావాల్సింది. తెలుగు సినిమాకు స్వర్ణ కమలం అప్పుడే రావాల్సింది.కానీ రాలేదు.
ఆ ఏడాది స్వర్ణ కమలం సాధించిన చిత్రం సత్యజిత్ రే తీసిన తొలి చిత్రం పథేర్ పాంచాలి.భారతీయ తెర మీద వాస్తవిక చిత్ర విప్లవానికి నాంది పలికిన పథేర్ పాంచాలీకి ఓ తెలుగు సినిమా గట్టి పోటీనిచ్చింది.ఆ సినిమా పేరు బంగారు పాప. దర్శడుడు బి.ఎన్ రెడ్డి.తీవ్ర పోటీ అనంతరం పధేర్ పాంచాలీకి స్వర్ణ కమలం ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది.బి.ఎన్ బంగారు పాప తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో స్వర్ణ కమలం కోసం పోటీ పడిన చిత్రం విశ్వనాథ్ తీసిన శంకరాభరణం.27వ జాతీయ చలన చిత్ర పురస్కారాల కోసం హిందీ చిత్రం శోధ్ తో పోటీ పడింది శంకరాభరణం.విప్లవ్ రాయ్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన శోధ్ కు ఉత్తమ చిత్రం పురస్కారం లభించినా …దాన్ని శంకరాభరణంతో షేర్ చేశారు.బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విత్ మాస్ అప్పీల్ హోల్ సమ్ ఎంటర్టైన్ మెంట్ విత్ ఈస్తటిక్ వాల్యూ అనే క్యాటగిరీలో శంకరాభరణానికి దాదాపు స్వర్ణ కమలమే ఇచ్చారు.
Ads
నిజానికి అప్పట్లో వాస్తవిక చిత్రాలకు … అంటే ఆర్ట్ సినిమాలకు అధికంగా అవార్డులు వచ్చేవి.ఈ క్యాటగిరీలోనే బెంగాలీ, మళయాళ తదితర ఆర్ట్ సినిమాలు అధికంగా తీసిన భాషా చిత్రాలకే అవార్టులు వచ్చేవి.అలా ఆయా భాషల్లో జాతీయ పురస్కారాలు సాధించిన దర్శకులు కూడా తెలుగు సినిమాలు తీస్తే వాటికి పురస్కారాలు దక్కలేదు.ఇలా వచ్చిన చిత్రాల్లో మృణాల్ సేన్ తీసిన ఒక ఊరికథ ఒకటి.;ప్రేమ్ చంద్ రాసిన కఫన్ అనే కథ ఆధారంగా మృణాల్ సేన్ తెలుగులో ఒక ఊరి కథ తీశారు. ధనవంతుడు దోచీ దోచీ బలుస్తాడు. పేదోడు పనిచేసీచేసీ చస్తాడు.
పేదోళ్లు పనిచేయడం ద్వారా పెద్దోళ్లను మరింత పెద్దోళ్లను చేస్తారు.అందుకని పనిచేయడం మానేయాలనేది ఈ సినిమాలో వాసుదేవరావు సిద్దాంతం.తను పనిచేయడు కొడుకునీ పనిచేయనీయడు.ఈ సినిమాకు ప్రాంతీయ ఉత్తమ చిత్రం కేటగిరీలోనే జాతీయ పురస్కారం దక్కింది.సత్యజిత్ రే, మృణాల్ సేన్ల తో పాటు అదే సమయంలో జాతీయ పురస్కారాల్లో మారుమ్రోగిన పేరు శ్యామ్ బెనగల్.అంకుర్, నిశాంత్ లాంటి సినిమాలతో అవార్డుల దర్శకుడుగా పాపులర్ అయిన శ్యామ్ కొందూర అనే నవల ఆధారంగా తెలుగులో అనుగ్రహం పేరుతో సినిమా తీశారు.
మూఢనమ్మకాల నేపధ్యంలో సాగుతుందీ కథ. కనీసం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కూడా అవార్డు సాధించలేకపోయిందీ చిత్రం.ఆ సంవత్సరం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా పురస్కారం గెలుచుకున్న చిత్రం బి.ఎస్.నారాయణ తీసిన నిమజ్జనం.అరవై దశకం నాటికే సత్యజిత్ రే నేతృత్వంలో వాస్తవిక చిత్ర వాదన బలంగా ముందుకు వచ్చింది. ఆ తరహా చిత్రాలను ఆర్ట్ చిత్రాలుగా జనం చెప్పుకునేవారు.కమర్షియల్, ఆర్ట్ సినిమాగా సినిమా చీలి ఉండేది. ఆ సమయంలో ఆర్ట్ సినిమా క్యాంపులో మృణాల్ సేన్, శ్యామ్ బెనగళ్ల తర్వాత తెలుగులో సినిమా తీసిన వాడు గౌతమ్ ఘోష్.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపద్యంలో వచ్చిన మాభూమి కూడా జాతీయ స్థాయిలో అవార్టులు సాధించలేకపోయింది.1979,80 రెండు సంవత్సరాల్లోనూ ఉత్తమ ప్రాంతీయ చిత్రం పురస్కారాలు ఉప్పలపాటి విశ్వేశ్వరరావు తీసిన నగ్నసత్యం, హరిశ్చంద్రుడు చిత్రాలకు వెళ్లిపోయాయి.లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అనుయాయి అయిన విశ్వేశ్వరరావు తొలి రోజుల్లో ఎన్టీఆర్ తో కంచుకోట, పెత్తందార్లు, దేశోద్దారకులు లాంటి భారీ కమర్షియల్ సినిమాలు తీశారు.ఆ తర్వాత ఆయన రూటు మార్చి సామాజిక స్పృహతో తీర్పు, మార్పు, నగ్నసత్యం, తదితర చిత్రాలు తీశారు.నిజానికి దేశోద్దారకులు లాంటి సినిమాల్లో కూడా విశ్వేశ్వరరావులోని రాజకీయాగ్రహం కనిపిస్తూనే ఉంటుంది.
నందమూరి తారక రామారావు నటించిన నిర్మించిన తోడు దొంగలు చిత్రం కూడా జాతీయ ఉత్తమ చిత్రంగా మెరిట్ సర్టిఫికెట్ పొందింది.అయితే తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్టు సాధించిన చిత్రం మాత్రం వాహినీ వారి పెద్దమనుషులే.రేలంగి హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలయ్యే నాటికి భారతదేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు మాత్రమే జరిగాయి.అప్పుడే పార్లమెంటరీ రాజకీయాల డొల్లతనం మీద బోల్డు సెటైర్లు వేశారు కె.వి.రెడ్డి.శంకరాభరణం తర్వాత మళ్లీ జాతీయ స్థాయిలో ప్రత్యేక పురస్కారం పొందిన చిత్రం సప్తపది. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన సప్తపది చిత్రానికి నర్గీస్ దత్ నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు ప్రకటించారు.
నిజానికి ఈ చిత్రాన్ని సంస్కరణాభిలాషతోనే చేశారు విశ్వనాథ్.తెలుగు సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం వస్తుందని బలంగా హోప్స్ పెట్టుకున్న చిత్రం రుద్రవీణ.బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి స్వీయ నిర్మాణంలో రూపొందిన తొలి చిత్రం రుద్రవీణ.కళ పరమార్ధం ఏమిటి అనే పాయింట్ మీద నడచిన ఈ సినిమా కూడా నర్గీస్ దత్ పురస్కారాన్ని మాత్రమే సాధించింది.ఒక్క బెంగాలీ చిత్రరంగానికే 22 స్వర్ణ కమలాలు వెళ్లిపోయాయి.ఆ తర్వాత హిందీ చిత్రాల్లో పదమూడు చిత్రాలకు జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం లభించింది. పదకొండు మళయాళ చిత్రాలకూ రెండు తమిళ చిత్రాలు మాత్రమే అవార్డులు అందుకోగలిగారు. తమిళ చిత్ర రంగంలో కూడా 1990లో వచ్చిన మరుప్పాకం చిత్రానికీ ఆ తర్వాత 2007లో వచ్చిన కాంచీపురానికీ తప్ప జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం ఏ చిత్రానీకీ రాలేదు.
తెలుగు సినిమాకు జాతీయ అవార్డు భారతీయ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం కల్ల అనే అభిప్రాయం బలంగా ఉన్న సమయంలో బాహుబలి ఆ కలను సాకారం చేసింది.
Share this Article