Sridhar Bollepalli……….. మా తాతయ్యగారి టైమ్ లో మా కుటుంబానికి గాడ్ ఫాదర్ అని చెప్పదగిన ఒక పెద్ద నాయకుడు వుండేవాడు. ఆయనకి ఒకవైపు అభిమాన గణం, మరోవైపు శత్రువులు కూడా పుష్కలంగానే వుండేవాళ్లు. మాకు సంబంధించినంత వరకూ మాత్రం ఆయన దేవుడు కిందే లెక్క. మా మీద ఈగ వాలనిచ్చేవాడు కాదు. ఏ సమస్యొచ్చినా ఆయన దగ్గరకి పరిగెత్తడమే.
భార్య వుండగానే యింకొకావిణ్ని వుంచుకున్నాడాయన, యింట్లోనే. అసలు భార్యకీ, ఈ రెండో ఆవిడకీ పెద్దగా భేదాభిప్రాయాలు వున్నట్టు కనిపించేది కాదు. మొదటావిడ పూజలూ, గుళ్లూ, ప్రసాదాలూ, పురాణాలూ వీటిలో మునిగిపోయి వుండేది. మా గాడ్ ఫాదర్ యింట్లో వున్న వాళ్లందరితో పాటు, ఆయన్ని కలవడానికొచ్చే డజన్ల మందికీ ఈ రెండో ఆవిడే వండిపెడుతూ వుండేది. గాడ్ ఫాదర్ చనిపోయాడు. కొడుకులూ కూతుళ్లూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. పెద్దావిడ మంచాన పడ్డారు. కన్నుమూసే క్షణం వరకూ ఆవిడకి సేవలు చేసి, సుఖంగా గౌరవంగా సాగనంపింది ఎవరంటే ఈ రెండో ఆవిడే.
ఈ స్టోరీ గుర్తొస్తే చాలా ఆశ్చర్యంగా వుంటుంది నాకు. అసలిద్దరూ ఒకే ఇంట్లో ఎలా కలిసున్నారు? ఆయన పోయాక.. పెద్దావిణ్ని తన్ని తరిమేసే అవకాశం వుండి కూడా రెండో ఆవిడ ఎందుకు అంత సర్వీస్ చేసింది? అసలు మేటర్ ఇది కాదు. ఈ ముక్కోణపు ప్రేమకథాచిత్రాన్ని ఎంతో ఆదరించిన మావోళ్లంతా వేరేవాళ్ల విషయంలో మాత్రం ఇలాంటి వ్యవహారాల పట్ల చాలా చులకనభావంతో వుండేవాళ్లు. గాడ్ ఫాదరూ, ఆయన తాలూకూ ఇద్దరు భార్యలూ మాకు చాలా ఉపయోగపడ్డారు కాబట్టీ మాకు వాళ్ల మధ్య వున్న రిలేషన్ గురించిన పట్టింపు లేదు. కానీ, మా పక్కింటోడో ఎదురింటోడో అదే పని చేస్తే.. రాత్రీపగలూ దాని గురించే మాట్లాడుకోని, కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేసి వచ్చుండేవాళ్లం.
Ads
మనకి నచ్చినవాళ్లు ఏం చేసినా మనకి సమ్మగానే వుంటది. అలా నాకు ఎఫ్బీలో కూడా సమ్మగా అనిపించిన స్నేహాలు కొన్నుండేవి. “ఫలానావాళ్లు చెప్పారంటే ఇది నిజమే అయ్యుంటుంది. ఇంతటి మనిషికి ఇది తప్పుగా అనిపించిందంటే కచ్చితంగా ఇది తప్పే అయ్యుంటుంది”.. ఈ ఫ్లో లో వెళ్లిపోయేవాడిని. కానీ, రానురానూ నాకు ఆయా మనుషులు, వారి రాతలూ ఇబ్బందికరంగా పరిణమించాయి. వాళ్లకుండే లంపటాలు వాళ్లకీ వున్నాయనీ, వాళ్లకే కాదు ఎవరికైనా లంపటాలు లేని వ్యక్తిత్వం అనేది వుండదనీ నాకు బోధపడింది. పాత స్నేహితుల్లో కొందరు జారిపోయారు. కొత్తగా కొంతమంది వచ్చి చేరారు. వీళ్లతోనూ ఇదే సమస్య. వీళ్లు రాసిన పోస్టుల్లో కొన్ని పిచ్చపిచ్చగా నచ్చితే, కొన్ని చాలా విసుగ్గా, చిరాగ్గా అనిపించసాగాయి. నాతో రెగ్యులర్‌గా టచ్‌లో వుండేవాళ్ల పోస్టులకి కూడా లైక్ కొట్టడం నాకు పెద్ద భారంగా మారింది. ఇందులో అంత ఇబ్బంది పడ్డానికేముంది అని మీరంటారని నాకు తెలుసు. లంపటరహిత భావజాలం వుండుట అసాధ్యమనియెడు వాక్యములోని సత్యమునెరుంగుటకు మీకు ఉపయుక్తము కాగల సమాచారమేమనిన.. ఇది నా లంపటం..!
అలాగే, “వీళ్లతో మనకి కష్టం. ఈ సుత్తి పోస్టులు చదివి మనసు ఎక్కడ వికలం చేసుకు ఛస్తాం పొద్దున్నే, బ్లాక్ చేసి పారదొబ్బితే సుఖం” అనిపించిన వాళ్లు కూడా ఒక్కోసారి మంచి పోస్టులు రాస్తూ వుంటారు. అబ్బా, ఎంత బాగా రాశారూ, బ్లాక్ చేసుంటే ఇది నా దృష్టికి వచ్చేది కాదు కదా అని ఫీలైపోతాను. బొక్కలో ఎఫ్బీ అని తిట్టుకోవడం కూడా తరచూ జరుగుతూనే వుంటుందిలే కానీ… చాలా మంచి విషయాలూ, విశ్లేషణలూ, కొత్త కోణాలూ తెలుస్తూ వుంటాయిక్కడ. మొన్నొకసారి ఓ మిత్రుడు చెప్పాడు, “గతంలో బ్లాక్ చేసినోళ్లందరినీ అన్‌బ్లాక్ చేద్దామనుకుంటున్నా” అని. కాస్త ఆలోచించగా నాకూ ఆ పనే చేద్దామనిపించింది. లేనిపోని లంపటం అవుద్దా అని కాస్త బెరుగ్గా వున్నా.. ఏమీ తోచక ఎవరినైనా బ్లాక్ చేయాలనుకుంటే.. అప్పుడు అలా చేయడానికి రీసెంట్లీ అన్‌బ్లాక్డ్ బ్యాచ్ చేతినిండా చాలామంది దొరుకుతారు కదా అని మళ్లీ వుత్సాహం వచ్చింది.
ఇద్దరు భార్యలుండడం గాడ్ ఫాదర్ గారి లంపటం. అది మనకి సంబంధం లేని వ్యవహారం. ఆ లంపటాన్ని ఒకచోట ఆమోదించి, ఒకచోట ఆమోదించకపోవడం మాకున్న లంపటం. ఫలానావాళ్లకి ఏ లంపటాలూ లేవనుకోవడం కూడా ఒక లంపటమే. లంపట్ అనివార్య్ హై..!
Share this Article