సాధారణంగా ఎవరు, ఎలాంటి యాడ్ తీసుకుపోయినా పత్రికల్లో అచ్చు వేయించవచ్చు, డబ్బు కడితే చాలు కళ్లకద్దుకుని అచ్చేస్తారు అని భ్రమపడుతుంటారు చాలామంది… కానీ తప్పు… The Advertising Standards Council of India (ASCI) ఏర్పడ్డాక కొన్ని స్వీయ కట్టుదిట్టాలు ఏర్పడ్డాయి… ఎలాంటి యాడ్స్ యాక్సెప్ట్ చేయాలి, ఎలాంటివి తిరస్కరించాలో ఎప్పటికప్పుడు మీడియా సంస్థలకు స్పష్టతను ఇస్తోంది ఈ సంస్థ… అయితే రీసెంటుగా మన ప్రధాన తెలుగు పత్రికలకు సంబంధించిన ఓ వ్యవహారం ఆసక్తిని కలిగించింది…
చిన్నాచితకా పత్రికలు యాడ్ గైడ్ లైన్స్ పెద్దగా పట్టించుకోవు… వాటిని ఎవడూ చదవడు కాబట్టి ఎవడూ పట్టించుకోడు… కానీ మన తెలుగు మీడియా విషయానికి వస్తే ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలు యాడ్స్ తీసుకోవడంలోనూ జాగ్రత్తలు, కాస్త నైతికతను ప్రదర్శిస్తున్నాయి ఇన్నాళ్లూ… మెయిన్ చానెళ్లు కూడా…! మరీ ముఖ్యంగా ప్రజల్ని మభ్యపెట్టే, వాళ్లకు గంతలుకట్టే ప్రకటనల విషయంలో జాగరూకత చూపిస్తున్నాయి…
మన కేంద్ర ప్రభుత్వం వివిధ క్రిప్టోకరెన్సీలను వ్యతిరేకిస్తోంది… వాటి లావాదేవీల వివరాలను ట్రాక్ చేయడానికి 30 శాతం పన్ను విధిస్తోంది… సంబంధిత ఓనర్ల మీద కూడా నిఘా కొనసాగుతోంది… అంతేకాదు, తనే అధికారికంగా డిజిటల్ రుపీ ప్రవేశపెట్టింది… ఇంకోవైపు రకరకాల క్రిప్టోకరెన్సీలు జనాన్ని మభ్యపెడుతూ ప్రకటనలు ఇస్తున్నాయి… మోసాలు సాగుతున్నాయి… జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు… మరి వీటిని ప్రజలు నమ్మడం ఎలా..? పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు వస్తే జనం చదివే చాన్స్ ఉంది, నమ్మే చాన్స్ ఉంది…
Ads
పొద్దున ఈనాడులో జాకెట్ యాడ్ (రెండు ఫుల్ పేజీలు) చూశాక డౌటొచ్చింది, తరువాత ఎన్టీవీలో వచ్చిన ఓ స్టోరీ గుర్తొచ్చింది… వెతికితే దొరికింది… ఇదీ ఆ వార్త… కిభో క్రిప్టో కరెన్సీ పేరిట ఓ స్కామ్ ప్రారంభమైందని ఆ వార్త… అందులో వివరంగానే చెప్పుకొచ్చారు అదెందుకు నమ్మదగింది కాదో… (ముచ్చట ఆ వార్తను ఎండార్స్ చేయడం లేదు కానీ జనం జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం నిజం…) మరి నిజం ఎవరు చెప్పాలి..? ఈలోపు అది మరింతగా జనంలోకి వెళ్తే..? అదే జరుగుతోంది… ఈనాడే రెండు ఫుల్ పేజీల ప్రకటన వేసిందంటే తన క్రెడిబులిటీని కూడా ఈనాడు పణంగా పెడుతోంది డబ్బు కోసం, యాడ్స్ కోసం… ఈనాడులో వచ్చింది, మోసం అయితే వాళ్లు పబ్లిష్ చేయరు కదా అనుకుంటారు జనం… మరి ఈనాడుకు అర్థమైందా..? లేక డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ కక్కుర్తి వ్యవహారానికి వోకే చెబుతోందా..?
అసలే ప్రింట్ మీడియా అనేది మూలిగే నక్క… కరోనా రూపంలో దానిమీద తాటిపండు పడింది… చదివేవాళ్లు తగ్గుతున్నారు… జీతాల భారం పెరుగుతోంది… దాంతో ఈనాడు కూడా గతంలో ఎన్నడూ తన చరిత్రలో లేనట్టుగా కార్డు రేటుకు బోలెడంత తగ్గింపులు ఇస్తోంది… డబ్బులొస్తే చాలు… అదొక తన్లాట… కానీ సిట్యుయేషన్ ఎంత దరిద్రంగా ఉన్నాసరే, మరీ ఇలాంటి స్కీములు, స్కాముల ప్రకటనల్ని పబ్లిష్ చేయవచ్చా..? తెల్లారిలేస్తే ప్రపంచానికి లక్షనీతులు చెప్పే ఈనాడు తన చేతులకే అంటుతున్న బురదను చూసుకోకపోతే ఎలా..?
మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఇంగ్లిష్ పత్రికలు గట్రా ఈ ప్రకటనల్ని యాక్సెప్ట్ చేశాయి… వాటిని చదివేవాడు ఎవడూ పెద్దగా లేడు కాబట్టి, రీచ్ తక్కువ కాబట్టి నష్టం లేదు (అవి యాక్సెప్ట్ చేయడం అనైతికమే అయినా సరే…), కానీ ఈనాడు వంటి హైరీచ్ డెయిలీ ఎలా యాక్సెప్ట్ చేసినట్టు..? పాత్రికేయ లక్షణాలు లేని నమస్తే తెలంగాణ కూడా యాక్సెప్ట్ చేసింది… ముఖ్యమంత్రి కేసీయార్‌కు ఈ డబ్బు కావాలా..? రేప్పొద్దున ఏదైనా స్కామ్ బద్దలయితే అది అధికార పార్టీకి, అధికార పత్రికకూ నష్టమే అనే సోయి లేకపోతే ఎలా..?
ఇదే క్రిప్టో సంస్థ సాక్షిని, ఆంధ్రజ్యోతిని కూడా అప్రోచ్ అవుతే, అడ్వాన్స్‌గా డబ్బు పే చేసినా సరే, ఆ రెండు పత్రికలు తిరస్కరించాయి… నిజానికి సాక్షి, ఆంధ్రజ్యోతి ఆమోదించినా సరే, ఈనాడు ఇలాంటివి యాక్సెప్ట్ చేయవు అనుకుంటారు సర్కిళ్లలో… కానీ ఇప్పుడు ఉల్టా… సాక్షి, ఆంధ్రజ్యోతి ఆ డబ్బులకన్నా నైతికత ముఖ్యం అనుకున్నాయి… ఈనాడు తన బాధ్యతను, తన చరిత్రను, తన నైతికతను మూసీలో కలిపేసింది…!! (ఈ స్టోరీలో టెక్నికల్‌గా ఏమైనా ఎర్రర్స్ ఉంటే సరిచేసుకోవడానికి మేం సిద్ధం…)
Share this Article