‘సర్వే’ సర్వత్రా అబద్దం… అవున్నిజమే… మొన్న దుబ్బాక, నిన్న గ్రేటర్… ఫలితాన్ని ముందే పట్టుకోవడంలో ప్రతి సర్వే సంస్థా ఫెయిలైంది… ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలని ఏమీలేదు… బోలెడుసార్లు అవి దెబ్బతిన్న ఉదాహరణలు చూశాం, చదివాం… ఇదేమీ మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదు… ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ జనం నమ్మాలని కూడా ఏమీ లేదు… కాకపోతే రెండుమూడేళ్ల క్రితం వరకు… ఎగ్జిట్ పోల్స్ కనీసం రఫ్‌గా ఓ ట్రెండ్‌ను పట్టిచ్చేవి… సరైన సంఖ్య ఎవరూ చెప్పలేకపోయినా జనం మూడ్ ఏమిటో ప్రతిబింబించేవి… మరి ఇప్పుడు..? ముందుగా ఓ మిత్రుడు రాసిన ఓ పోస్టు చదవండి… తరువాత చెప్పుకుందాం…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస గెలుస్తుందని, ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా ఓడిపోతుందని మేము ఇచ్చిన సర్వే ఫలితాలు నిజం అయ్యాయి. గ్రేటర్ లో మా అంచనాలు తప్పాయి. అయితే,
గ్రేటర్ ఎన్నికలకి సంబంధించి ప్రజల నాడి పట్టుకోవడంలో దాదాపు అన్ని సంస్థల సర్వేలు విఫలం అయ్యాయి. ఎందుకిలా? అంటే..
1. ప్రజలు తమ అభిప్రాయాలని ఓపెన్ గా చెప్పడానికి ఇష్టపడడం లేదు. అధికార పార్టీకి ఓటు వేయం అని చెబితే ఏం నష్టం వస్తుందో, ఎందుకొచ్చిన తలనొప్పి అని..దాదాపు సగం మంది నిజం చెప్పడం లేదు. సర్వేలు ఫెయిల్ అవడానికి ఇది ప్రధాన కారణం.
2. సర్వేలు చేసే నైపుణ్యం ఉన్న ఉద్యోగులు లేకపోవడం రెండవ కారణం..శాస్త్రీయంగా సర్వే చేయాలి అంటే ఒక్కో ఉద్యోగి రోజుకి 30 మందిని సర్వే చేయగలరు. రోజుకి రూ.1200 లేనిదే ఎవరూ పనిచేయరు. అంటే ఒక్కో సాంపిల్ కి రూ.40 ఫీల్డ్ ఖర్చు అవుతుంది. దీనికి ఓవర్ హెడ్స్ కూడా కలుపుకుంటే ఒక్కో సాంపిల్ కి రూ.60 లు అవుతుంది. కానీ రాజకీయ పార్టీలు ఒక్కో సాంపిల్ కి రూ.40 కి మించి ఇవ్వడం లేదు. దీనితో సర్వే క్వాలిటీ దెబ్బతింటోంది.
3. సర్వే చేసే వారి స్వంత రాజకీయ అభిప్రాయాలు సర్వే ఫలితాలపై ప్రభావం చూపుతున్నాయి. ఫీల్డ్ లో ఓటర్లు చెప్పిన అభిప్రాయం కాకుండా సొంత అభిప్రాయం రికార్డ్ చేయడం కూడా ఎక్కువ అవుతోంది.
4. వీటన్నిటికి మించి, అన్ని రంగాలకి ఉన్నట్లే, చిత్తశుద్ధి, నైపుణ్యం, అంకితభావం, కష్టపడేతత్వం ఉన్న ఉద్యోగుల కొరత, ఈ రంగంలో కూడా ఉంది.
వీటిని అధిగమించి, ప్రజానాడిని పర్ఫెక్ట్ గా అంచనా వేసే పద్ధతుల కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. …
….. నిజమే… నిపుణులైన సర్వేయర్లు దొరకడం లేదు, దొరికినా ఖర్చు ఎక్కువ… అంత గిట్టుబాటు కావడం లేదు… ఫలితంగా శాస్త్రీయమైన ఒపీనియన్ పోల్ గానీ, ఎగ్జిట్ పోల్ గానీ సాధ్యం కావడం లేదు… అయితే… ఇవన్నీ వేస్ట్, ఏదో సంస్థ పేరు పెట్టేసి, చకచకా ఫోటోషాపులో నాలుగు అంకెలు రాసేసి… సోషల్ మీడియాలో పుష్ చేసే ఉదాహరణలే బోలెడు ఇప్పుడు… సర్వే శాంపిళ్ల సంఖ్య అడిగేవాడెవ్వడు..? సర్వేకు అనుసరించిన పద్ధతిని అడిగేవాడెవ్వడు..?
తమకు డబ్బులిచ్చిన వాడి ప్రయోజనాల కోసం… అప్పటికప్పుడు ఏదో వండి, వాట్సప్ గ్రూపుల్లో వార్చడం, వడ్డించడం… అంతే… ఎంట్రీ పోల్ లేదు, ఎగ్జిట్ పోల్ లేదు… మొన్న దుబ్బాకలో, నిన్న గ్రేటర్లో ఇలాంటి ఫేక్ సర్వేలు బోలెడు కనిపించాయి… ఏదో ఓ సంస్థ పేరిట రిలీజ్ చేస్తే సరి…
నిజానికి సర్వేల్లో మంచి అనుభవం, పేరు, ప్రొఫెషనలిజం ఉన్న సంస్థలు కూడా దుబ్బాక, గ్రేటర్ ఫలితాలను సరిగ్గా అంచనా వేయలేకపోయాయి… కొందరు నిజమేమిటో తెలిసినా బయటికి చెప్పలేదు.. కొంత భయం, కొంత సందేహం… వాస్తవంగా సర్వే చేయటానికి శాంపిళ్ల సంఖ్య ఎంత ముఖ్యమో… వాటి నాణ్యత కూడా అంతే ముఖ్యం… అంటే వయస్సు, వృత్తి, ప్రాంతం, నేపథ్యం, చదువు గట్రా సరైన నిష్పత్తిలో చూసుకుని, వారి నుంచి అభిప్రాయం సేకరించాలి… నువ్వు వోటు ఎవరికి వేస్తావు, వేశావు అనే సింగిల్ ప్రశ్న కాదు… వాళ్ల మూడ్‌ను బయటపెట్టే కొన్ని ప్రశ్నలు అవసరం… ఆ జవాబుల నుంచి వాళ్ల వాస్తవ మూడ్ పట్టుకోవాలి… అంటే డేటా క్రోడీకరణ, విశ్లేషణ కూడా ముఖ్యమే…
ఇంత కీన్గా సర్వేలు చేస్తున్నవారెందరు..? పోటీ తీవ్రంగా ఉండి, ఇద్దరి నడుమ తేడా వన్, టూ పర్సెంట్ మాత్రమే ఉన్నప్పుడు సర్వేలు అస్సలు సరైన ఫలితాన్ని చూపించలేవు కూడా… దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ నడుమ తేడా చాలా స్వల్పం… ఈ స్థితి కూడా సర్వే సంస్థలకు ఇరకాటమే… సంకటమే… అదే జరిగింది…!
కావాలని ఒపీనియన్ పోల్ పేరిట ఏదో జనంలోకి వదిలేసి, తమకు అనుకూలంగా జనం మూడ్ కొంతయినా మార్చుకుందామని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయి… అలా సర్వేలను వండిస్తాయి… జనంలోకి వదులుతాయి… అలాంటి ఉద్దేశపూర్వక సర్వేలతో మొత్తం సర్వేలనే జనం నమ్మని దుస్థితి ఏర్పడింది… ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా అంతే… వాటితో పార్టీలకు వచ్చే ప్రయోజనం ఏమీ లేకపోయినా… అదొక అలవాటుగా మారుతోంది… ఫలితంగా సర్వేలు తమ విశ్వసనీయతను కోల్పోయాయ్… ఎంత ఖర్చు చేసి, ఎంత కచ్చితత్వాన్ని చూపించినా సరే జనం నమ్మడం లేదు… అదీ సర్వేల దుర్గతి…!!
Share this Article