కొందరెందుకు కరోనా జాగ్రత్తలు పాటించరంటే!
———————-
ప్రపంచం ముందు ఇప్పుడున్న అతి పెద్ద సమస్య కరోనా. భారత్ తోపాటు అయిదారు దేశాల్లో కరోనాకు వ్యాక్సిన్ ప్రయోగశాలల్లో ఇంకా పరీక్షల దశలోనే ఉంది. పోలియో టీకాలా వంద శాతం పనిచేసేవి మాత్రం ఇంకా తయారయినట్లు లేదు. మరో నాలుగయిదు నెలల్లో కనీసం డెబ్బయ్ అయిదు శాతమయినా పనిచేసే కరోనా వ్యాక్సిన్ రావచ్చు. 135 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో అందరికీ టీకా వేయడం కూడా పెద్ద యజ్ఞమే. మాటల్లో చెప్పినంత సులభం కాదు. ప్రస్తుతానికి కరోనా రాకుండా జాగ్రత్త పడడమేతప్ప మందుల్లేవు. జలుబు, గొంతు నొప్పి, జ్వరం… ఇలా విడి విడిగా జబ్బులకు వాడే మందులే వాడుతున్నారు. మాస్కు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, చేతులు పదే పదే శుభ్రం చేసుకోవడం, అత్యవసరమయితే తప్ప జన సమూహాలున్నచోట్లకు వెళ్లకుండా ఉండడంలాంటి జాగ్రత్తలే ఉత్తమం. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలు మన పంచాయతీ దాకా అందరూ ఈ జాగ్రత్తలే చెబుతున్నారు. ఈ జాగ్రత్తల గురించే ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయినా కొందరు జాగ్రత్తలు పాటించడం లేదు.
Ads
ఎదుటి మనిషి గుర్తు పట్టడానికి మాస్కు తీసి మొహం చూపించేవారు కొందరు. మాట్లాడేప్పుడు విధిగా మాస్కు ఉండాలి. అలాంటిది మాట్లాడేప్పుడే మాస్కు తీసి పారేసేవారు మరి కొందరు. ఫొటోల కోసం మాస్కు తీసేసేవారు కొందరు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేసేవారు కొందరు. కరోనా లక్షణాలున్నా పరీక్షలకు వెళ్లనివారు కొందరు. పరీక్షలో పాజిటివ్ అని తేలినా ఐసొలేషన్ లో ఉండనివారు కొందరు. మానవ మనుగడకే ఇంత ప్రమాదకరంగా ఉన్నా కరోనా ఆంక్షలను కొందరు ఎందుకు పట్టించుకోవడం లేదన్న విషయంపై సామాజిక, మానసిక శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా లోతయిన అధ్యయనం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్- కృత్రిమ మేధ సాయం కూడా తీసుకుని కొన్ని కారణాలను కనుక్కోగలిగారు.
నైతిక ప్రవర్తన ప్రధాన విషయంగా ఈ అధ్యయనంలో తేలింది. కరోనాతో సంబంధం లేకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించడం, క్యూల్లో పద్ధతిగా నిలుచోవడంలాంటి మామూలు విషయాలను క్రమం తప్పకుండా పాటించేవారు కరోనా జాగ్రత్తలను కూడా ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేకుండా తమంతట తామే బాధ్యతగా పాటిస్తున్నారు. విచ్చలవిడిగా, లెక్కలేనితనంతో ఎలాపడితే అలా ఉండేవారే కరోనా జాగ్రత్తలు పాటించడం లేదు.
1. Violating social norms
2. Ethical lapse
… అని రెండు ప్రధాన కారణాలను ఈ అధ్యయనం గుర్తించింది. సామాజిక కట్టుబాట్లను తుంగలో తొక్కేవారు, విలువలు పాటించనివారే కరోనా జాగ్రత్తలను కూడా పట్టించుకోవడం లేదు. వంద దేశాల్లో మూడున్నర లక్షల మందిని ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు. ఆశ్చర్యంగా ఇందులో ఆధ్యాత్మికత ఉన్నవారు, కొన్ని స్థానిక ఆచారాలను గౌరవించేవారు కరోనా జాగ్రత్తలను తప్పనిసరిగా పాటిస్తున్నట్లు తేలింది. అయితే ఈ అధ్యయనం జాగ్రత్తలు పాటించనివారి గురించే కాబట్టి పాటించేవారి గురించి మరీ లోతుగా వెళ్లలేదు.
“ఆచార ప్రభవో ధర్మః ధర్మస్య ప్రభురచ్యుతః”
అని విష్ణు సహస్రనామం చివర ఒక గొప్ప మాట ఉంది. ఆచారంలో నుండే ధర్మం పుడుతుంది. ధర్మాన్ని పాటిస్తేనే దైవం అండ దొరుకుతుంది- అని దీని అర్థం. కరోనా జాగ్రత్తలు పాటించడానికి కూడా ఇదే సూత్రం అన్వయమవుతుంది. కరోనా జాగ్రత్తలు పాటించడం ఆచారం కావాలి. అప్పుడది ధర్మంగా మారుతుంది. ఆ ధర్మంమీద మనం నిలబడితే అప్పుడు వైరస్ వ్యాపించకుండా మనకు ఆరోగ్యం అండ దొరుకుతుంది. ఆచరించేది ఆచారం. చెప్పేవి గాలి మాటలు. మాటలకు కరోనా లొంగదు. ఆచరణలో జాగ్రత్తలు పాటిస్తే మన దగ్గరికి రాకుండా దూరముంటుంది. మనం ఎటున్నామో మనకు మనమే తెలుసుకోవచ్చు. ఎటు ఉండాలో కూడా గ్రహించగలిగితే మనకు, జగతికి శ్రీరామరక్ష. లేకుంటే పెద్ద శిక్ష.
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article